Sakshi News home page

కమల వికాసం.. విలాపం! 

Published Mon, Dec 4 2023 6:04 AM

Telangana assembly election results for BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మిశ్రమ ఫలితాలిచ్చాయి. గతంతో పోలిస్తే సీట్లు, ఓట్లు పెరిగినా అధికారంలోకి రావాలన్న కల కలగానే మిగిలింది. 2018 ఎన్నికల్లో 118 సీట్లలో పోటీచేసి కేవలం ఒక సీటు గెలిచి 7 శాతం ఓటింగ్‌కు పరిమితమైన స్థితి నుంచి ఈ ఎన్నికల్లో 8 సీట్లలో గెలిచి 14 శాతం ఓటింగ్‌ సాధించడం వరకే కమలదళం పరిమితమైంది. పోటీ చేసిన 111 స్థానాలకుగాను కనీసం 35–40 సీట్లలో గట్టి పోటీ ఇచ్చి 18–22 సీట్లలో గెలుస్తామనే అంచనాలకు ఆమడ దూరంలో నిలిచింది. 

ఉత్తర తెలంగాణలో బీజేపీ గాలి.. 
బీజేపీ పోటీ చేసిన మొత్తం సీట్లలో దాదాపు 32.20 లక్షల ఓట్లు సాధించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే గెలిచిన 8 సీట్లలో 7 ఉత్తర తెలంగాణ నుంచే రావడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 4 ఎంపీ సీట్లలో మూడు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లలో ఉండగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మళ్లీ ఉత్తర తెలంగాణనే బీజేపీని ఆదుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో 4, నిజామాబాద్‌లో 3 సీట్లలో బీజేపీ విజయదుందుభి మోగించింది. ఆయా నియోజకవర్గాల పరిధిలో బీజేపీ అగ్రనాయకులైన మోదీ, అమిత్‌ షా, నడ్డా నిర్వహించిన ప్రచారం కూడా పార్టీ అభ్యర్థుల విజయానికి దోహదపడిందని నాయకులు అంచనా వేస్తున్నారు. 

నిజంకాని అంచనాలు.. 
ఉత్తర తెలంగాణలో మెజారిటీ సీట్లతోపాటు గ్రేటర్‌ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, మహబూబ్‌నగర్‌లలో కొన్ని సీట్లు కలిపి మొత్తం 18కిపైగానే గెలుస్తామనే బీజేపీ ముఖ్యనేతల అంచనాలు నిజం కాలేదు. హైదరాబాద్‌ పరిధిలో కేవలం గోషామహల్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి విజయం సాధించడం మాత్రమే ఆ పార్టీకి కాస్త ఓదార్పు మిగిల్చింది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏకంగా 48 సీట్లు గెలిచినా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఫలితాలేవీ ప్రతిబింబించకపోవడం పార్టీ నేతలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. అలాగే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు బండి సంజయ్‌ (కరీంనగర్‌లో), ధర్మపురి అరి్వంద్‌ (కోరుట్లలో), సోయం బాపూరావు (బోథ్‌లో)తోపాటు గతంలో ఉప ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌ (హుజూరాబాద్, గజ్వేల్‌లలో), ఎం. రఘునందన్‌రావు (దుబ్బాకలో) ఓడిపోవడం బీజేపీకి అంతుబట్టడంలేదు. 

పనిచేయని బీసీ నినాదం...ఎస్సీ వర్గీకరణ... 
బీజేపీ బీసీ నినాదం, అధికారానికి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామనే హామీ, ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిర్ణయం, మేనిఫెస్టోలో రైతులు, యువత, మహిళలు... ఇలా వివిధ వర్గాలను ఆకట్టుకొనేందుకు పొందుపరిచిన అంశాలేవీ ఫలితాల సాధనలో బీజేపీకి కలసి రాలేదు. బీసీ నినాదం తీసుకున్నారే తప్ప ఈ వర్గాలను చేరుకొని వారి మద్దతు సాధించడంలో పార్టీ విఫలమైంది. ఎస్సీ–19, ఎస్టీ–12 స్థానాల్లో ఒక్కటంటే ఒక్క సీటునూ పార్టీ గెలవలేకపోయింది.

ఈ సీట్లపై ప్రత్యేక దృష్టిపెట్టి మిషన్‌–31ను ప్రారంభించినా పెద్దగా ఆ దిశగా కృషి చేయకపోవడం ఫలితాలపై ప్రభావం చూపింది. పార్టీ గెలిచిన 8 సీట్లలో ముగ్గురు బీసీ వర్గానికి చెందిన వారు (36 మందికి సీట్ల కేటాయింపు) కాగా ఐదుగురు జనరల్‌ కేటగిరీకి చెందినవారు. పార్టీ గెలిచిన 8 సీట్లలో (రాజాసింగ్, మహేశ్వర్‌రెడ్డి మినహా) ఆరుగురు తొలిసారిగా శాసనసభలోకి అడుగుపెడుతుండటం గమనార్హం. అయితే మహిళలకు 12 టికెట్లు ఇచ్చినా వారిలో ఒక్కరూ విజయం సాధించలేదు. 

కమలాన్ని దెబ్బతీసిన అంశాలెన్నో... 
రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ మార్పుపై 3–4 నెలలపాటు సందిగ్ధత నెలకొనడం... ఎన్నికలకు ముందు సంజయ్‌ను హఠాత్తుగా మార్చడం.. బీఆర్‌ఎస్‌–బీజేపీ మధ్య అంతర్గత దోస్తీ ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోవడం, అధికార బీఆర్‌ఎస్‌ అవినీతిపై ఆరోపణలు గుప్పించి వాటిపై కేంద్ర ప్రభుత్వ స్థాయిలో విచారణ లేదా దర్యాప్తునకు ఆదేశించకపోవడం ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీశాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ముఖ్యంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందనే ఆరోపణలపై ఈడీ ద్వారా విచారణ జరిపినా చర్యలు తీసుకోకుండా తాత్సారం చేయడం, కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఏటీఎంగా మారిందని స్వయంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వంటి వారు బహిరంగ సభల్లో ఆరోపించినా దర్యాప్తుకు మొగ్గుచూపకపోవడం వంటివి పార్టీపై ప్రతికూల ప్రభావానికి ప్రధాన కారణాలుగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ఈ పరిణామాలను ముందుగానే అంచనా వేసిన వివేక్‌ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, విజయశాంతి వంటి అసంతృప్త నేతలు పార్టీని వీడినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్‌లో చేరిన వివేక్, రాజ్‌గోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచారు.  
 

Advertisement

What’s your opinion

Advertisement