59th Raising Day : పాక్, బంగ్లా సరిహద్దుల్లో పటిష్ట భద్రత

2 Dec, 2023 05:42 IST|Sakshi

మంత్రి అమిత్‌ షా  

హజారీబాగ్‌: భారత్‌–పాకిస్తాన్, భారత్‌–బంగ్లాదేశ సరిహద్దుల్లో అత్యంత పటిష్టమైన భద్రత కల్పించబోతున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. రాబోయే రెండేళ్లలో సరిహద్దులను దుర్భేద్యంగా మార్చబోతున్నట్లు తెలిపారు. సరిహద్దుల్లో అసంపూర్తిగా ఉన్న 60 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయనున్నట్లు  ప్రకటించారు. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. శుక్రవారం జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) 59వ రైజింగ్‌ డే వేడుకల్లో అమిత్‌ షా పాల్గొన్నారు.

జవాన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత తొమ్మిదేళ్లలో భారత్‌–పాకిస్తాన్, భారత్‌–బంగ్లాదేశ సరిహద్దుల్లో 560 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిన కంచెలో అక్కడక్కడా ఖాళీలు ఉండేవని, ఆ ఖాళీల గుండా చొరబాటుదారులు, స్మగ్లర్లు సులభంగా మన దేశంలోకి ప్రవేశించేవారని గుర్తుచేశారు. ఆ ఖాళీల్లోనూ కంచె నిర్మాణం పూర్తయ్యిందని, తూర్పు, పశి్చమ సరిహద్దుల్లో మరో 60 కిలోమీటర్లే కంచె ఏర్పాటు చేయాల్సి ఉందని వివరించారు. 

మరిన్ని వార్తలు