తుంగభద్ర తీర వాసులకు వరద ముప్పు

2 Aug, 2014 03:08 IST|Sakshi
  • 10 గేట్ల ద్వారా దిగువకు 22 వేల క్యూసెక్కుల నీరు విడుదల
  • హొస్పేట : తుంగభద్ర జలాశయం ఎగువన వర్షాలు భారీగా కురుస్తుండటంతో డ్యాంలోకి లక్ష క్యూసెక్కులకు పైగా వరదనీరు శుక్రవారం రాత్రికి వచ్చి చేరనుండటంతో శుక్రవారం సాయంత్రం డ్యాంకు సంబంధించిన 10 క్రస్ట్‌గేట్ల ద్వారా దిగువకు 22 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు విడుదల చేశారు. అదే విధంగా శనివారం ఏ సమయంలోనైనా 22 క్రస్ట్ గేట్లను పెకైత్తి లక్ష పైచిలుకు క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఏ సమయంలోనైనా డ్యాం నుంచి భారీగా నీటిని విడుదల చేసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర బోర్డు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
     
    10 తుంగభద్ర గేట్ల ఎత్తివేత

     
    తుంగభద్ర డ్యాం పూర్తిగా నిండటంతో శుక్రవారం ఉదయం తుంగభద్ర బోర్డు అధికారులు డ్యాం వద్ద విశేష పూజలు చేసి 10 క్రస్ట్ గేట్లను పెకైత్తి దిగువకు నీరు విడుదల చేశారు. డ్యాంకు చెందిన మొత్తం 33 క్లస్టర్ గేట్లలో ఉదయం 3 గేట్లను ఒక్కొక్క గేటును 9 అంగుళాల మేర పెకైత్తి మొత్తం 4,300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రానికి మొత్తం 10 గేట్లు 2 అడుగుల మేర పెకైత్తి 22 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ సందర్భంగా తుంగభద్ర మండలి కార్యదర్శి జీ.రంగారెడ్డి, ఈఈ ఇంగళల్లి, డ్యాం జేఈ వీరేష్, గార్డెన్ సూపరింటెండెంట్ విశ్వనాథ్, డ్యాం ఇన్‌చార్జ్ అధికారి పార్థసారథి, మునిరాబాద్ ఇరిగేషన్ ఈఈ భోజానాయక్ తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు