వేర్వేరు ఘటనల్లో ఇద్దరి హత్య

9 Oct, 2013 02:53 IST|Sakshi
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్ : చెన్నై పూందమల్లి, రామనాథపురం జిల్లాలో మంగళవారం ఉదయం వేర్వేరు ఘటనల్లో ఇద్దరు హత్య చేయబడ్డారు. చెన్నై సమీపం కున్రత్తూరు మనంజేరికి చెంది న కుమార్ (28) కాల్‌టాక్సీ సంస్థలో డ్రైవర్‌గా ఉన్నాడు. ఇతని సొంత ఊరు దిండివనం. మంగళవారం ఉదయం మనంజేరి నుంచి పోరూరులో ఉన్న తన కార్యాలయానికి బైకులో బయలు దేరాడు. కున్నత్తూరు మెయిన్ రోడ్డులో ఉన్న థియేటర్ వద్ద వెనుక వచ్చిన కారు కుమార్ బైకును ఢీ కొట్టింది. కింద పడిన కుమార్ లేవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కారు నుంచి దిగిన ఓ ముఠా కత్తులు, మరణాయుధాలలో దాడి చేశారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కీల్పాకం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
 
దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో కున్రత్తూరు, నత్తం ప్రాంతానికి చెందిన చిట్టిబాబు (48) నత్తం వీఏవో కార్యాలయంలో సహాయకుడిగా ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపా రం చేస్తున్నాడు. ఇతని వద్ద మూడు సంవత్సరాలకు ముందు కుమార్ కారు డ్రైవర్‌గా పనిచేశాడు. అతను చిట్టిబాబు కుమార్తె వైశాలిని ప్రేమించాడు. ఇది తెలియడంతో కుమార్‌ను పని నుంచి తొలగించారు. ఈ క్రమలో వైశాలికి సమీప బంధువుతో వివాహం జరిగిం ది. తర్వాత కుమార్, వైశాలి చాటుమాటుగా కలుసుకునేవారు. దీనిని వైశాలి భర్త ఖండించాడు. ఆమె కుటుంబంలో తరచూ గొడవలు చోటు చేసుకునేవి. చిట్టిబాబు తన బంధువులతో వెళ్లి కుమార్‌ను హెచ్చరించి వచ్చాడు. కానీ కుమార్ తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో హత్యకు గురయినట్టు తెలిసింది. 
 
డీఎంకే కార్యదర్శి హత్య 
రామనాథపురం సమీపం పేరావూర్ పంచాయతీ తిల్లై నాయగపురానికి చెందిన సుందరరాజన్ (58) డీఎంకే ఉపకార్యదర్శి. ఇతని అన్న గోపాల్. వీరి స్థలాన్ని ఆ గ్రామానికి చెందిన వారు ఆక్రమించారు. దీనికి సంబంధించి గోపాల్, సుందర రాజన్‌లు కోర్టులో కేసు వేశారు. ఆక్రమించిన స్థలం గోపాల్‌కు చెందుతుందని కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో సోదరులకు, గ్రామస్తులకు విరోదం ఏర్పడింది. ఈ క్రమంలో సుందరరాజన్ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయాడు. గ్రామస్తులు ఆ సోదరులపై తరచూ గోడవ చేస్తుండడంతో సుందరరాజన్ తేనికరై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం ఉదయం ఇంటి వద్ద సుందరరాజన్ పాలు పిండుతున్న సమయంలో అక్కడికి వచ్చిన ఓ ముఠా కత్తితో దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన సుందరరాజన్‌ను రామనాథపురం ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స ఫలించక తను మృతి చెందాడు. ఈ సంఘటనపై గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 
మరిన్ని వార్తలు