సీఎం కేసీఆర్‌పై ‘ఎలక్షన్‌ కింగ్‌’ పద్మరాజన్‌ పోటీ.. 236వసారి నామినేషన్‌ దాఖలు

7 Nov, 2023 14:40 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చిన  ‘ఎలక్షన్‌ కింగ్‌’ పద్మరాజన్‌ పోటీ చేయడం ఏమిటని అనుకుంటున్నారా.. ? అసలు ఎవరీయన అని ఆలోచిస్తున్నారా.. అయితే పద్మరాజన్‌ గురించి కాస్త తెలుసుకోవాల్సిందే. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా మెట్టూరుకు చెందిన పద్మరాజన్‌ వృత్తిరీత్యా హోమియోపతి వైద్యుడు. ప్రముఖులు ఎక్కడ పోటీ చేస్తే అక్కడికి వెళ్లి ఈయన బరిలో ఉంటుంటారు.

దివంగత అటల్‌ బిహారీ వాజ్‌పేయి, పీవీ నరసింహారావు, జయలలిత, కరుణానిధిపై కూడా పోటీ చేశారు. ఇక పీఎం నరేంద్రమోదీ మొదలు పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులపై సైతం బరిలోకి దిగారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ ఎన్నిక జరిగినా ప్రముఖులపై ఆయన పోటీకి దిగేస్తారు.

1988 నుంచి ఇలా పోటీ చేయడం మొదలుపెట్టిన పద్మరాజన్‌  అలా ఇప్పటి వరకు 236 సార్లు పోటీ చేశారు. కానీ ఇప్పుడు తొలిసారిగా సీఎం కేసీఆర్‌పై పోటీ చేయబోతున్నారు. గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పద్మరాజన్‌ ఈ నెల 3న నామినేషన్‌ వేసి 237వ సారి పోటీకి సై అంటున్నారు.  

ఐదుసార్లు రాష్ట్రపతిగా కూడా పోటీ 
ఐదుసార్లు రాష్ట్రపతి అభ్యర్థిగా, ఐదుసార్లు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా, 32 సార్లు లోక్‌సభకు, 72 సార్లు అసెంబ్లీకి, 3 సార్లు ఎమ్మెల్సీకి , ఒకసారి మేయర్‌ పదవికి, మూడు మార్లు  చైర్మన్‌ పోస్టుకి, ఇంకా అనేక ఇతర ఎన్నికల్లో పోటీ చేశారు. 

అత్యంత విఫలమైన అభ్యర్థిగా గిన్నిస్‌ రికార్డు 
ఇప్పటివరకు ఆయన ఏ ఎన్నికలోనూ గెలవలేదు. 35 ఏళ్లుగా పోటీ చేస్తున్న ఆయన్ను గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులలో ప్రపంచంలోనే అత్యంత విఫలమైన అభ్యర్థిగా పేర్కొనడం గమనార్హం. 

ఇలా ఎందుకు పోటీ చేస్తున్నారంటే.. 
ఓటమి చెందుతానని తెలిసినప్పటికీ తప్పకుండా బరిలో ఉంటారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు డిపాజిట్‌లు, ఇతర ఖర్చులు మొత్తంగా ఇప్పటి వరకు సుమారు రూ.30 లక్షలు అయినట్టు చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని ప్రజలకు తెలియజేయడం కోసమే ఇలా పోటీ చేస్తున్నానని డాక్టర్‌ పద్మరాజన్‌ చెప్పుకొచ్చారు. 
చదవండి: బస్సులకూ... ఎన్నికలకూ  సంబంధమేమిటి?

మరిన్ని వార్తలు