సహనాన్ని పరీక్షించొద్దు

12 Mar, 2015 00:30 IST|Sakshi

సాక్షి, చెన్నై:తమిళుల సహనాన్ని పరీక్షించవద్దు అని కేంద్రాన్ని ఎండీఎంకే అధినేత వైగో హెచ్చరించారు. కావేరి తీరంలో మిథైన్ తవ్వకాలు, కావేరి జలాల్ని అడ్డుకునే రీతిలో కర్ణాటక కుట్రల్ని ఖండిస్తూ, చెన్నైలోని క స్టమ్స్ కార్యాలయం ముట్టడికి వైగో నేతృత్వంలో నిరసనకారు లు బుధవారం యత్నించారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు.  కావేరి జలాల్ని అడ్డుకునే విధంగా మేఘదాతులో డ్యాముల నిర్మాణానికి కర్ణాటక సర్కారు చేస్తున్న కుట్రల్ని, కావేరి తీరంలో మీథైన్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ కావేరి హక్కుల భద్రతా సమాఖ్య నేతృత్వంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం చెన్నైలో భారీ నిరసనకు పిలుపునిచ్చారు. ఎండీఎంకే నేత వైగో, తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్ మురుగన్, ఇండియ దేశీయ లీగ్ నేత బషీర్ అహ్మద్ నేతృత్వంలో అన్నదాతలు, కావేరి తీరంలోని అన్ని సంఘాలకు చెందిన వాళ్లు కేంద్ర ప్రభుత్వ కస్టమ్స్ కార్యాలయం ముట్టడికి ర్యాలీగా బయలు దేరారు.
 
 ఆ కార్యాలయాన్ని సమీపిస్తున్న నిరసనకారుల్ని మార్గ మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను ఏర్పాటు చేసి నిరసన కారులు అటు వైపుగా రాకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు.  పోలీసులు తమను అడ్డుకోవడంతో కాసేపు రోడ్డుపై నిరసన కారులు బైఠాయించారు. ఈసందర్భంగా నిరసనను ఉద్దేశించి వైగో ప్రసంగిస్తూ, కేంద్రంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కావేరి తీరంలో మీథైన్ తవ్వకాలకు అనుమతి ఇవ్వొద్దని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్రం పెడ చెవిన పెట్టడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. కావేరి నదీ జలాల్ని అడ్డుకునేందుకు కర్ణాటక కుట్రలు చేస్తున్నా, కేంద్రం జోక్యం చేసుకోకుండా మెతక వైఖరిని అనుసరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ వ్యవహారాల్లో అన్ని పక్షాలు ఏకమై పోరాడాల్సిన అవశ్యం ఉందన్నారు.
 
 ఇందు కోసం తాను అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, సీఎం పన్నీరు సెల్వంతో పాటుగా అన్ని రాజకీయ పక్షాల నాయకులకు లేఖలు రాశానని, అయితే, వారి నుంచి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తే కావేరి డె ల్టా జిల్లాల ప్రజల సంక్షేమం మీద వారికి చిత్త శుద్ధి ఏ పాటిదో అర్థమవుతోందని విమర్శించారు. శాంతి యుతంగా, గాంధీ, అన్నా మార్గంలో నడుస్తున్న తమిళుల సహనాన్ని పరీక్షించ వద్దు అని, తమలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటే తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి ఉంటుందని కేంద్రాన్ని హెచ్చరించారు.
 
  తమిళుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్లకు పుట్టగతులు ఉండవని, దీన్ని గుర్తెరిగి తమ సహనాన్ని పరీక్షించకుండా మీథైన్ తవ్వకాల అనుమతుల్ని వెనక్కు తీసుకోవాలని, కర్ణాటక చర్యలకు కళ్లెం వే స్తూ, కావేరి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనతో ఆ పరిసరాల్లో వాహనాల రాక పోకలకు ఆటంకం నెలకొంది. చివరకు వైగో, వేల్ మురుగన్, బషీర్ అహ్మద్‌తో పాటుగా అణు వ్యతిరేక ఉద్యమ నేత ఉదయకుమార్, ఎండీఎంకే నేతలు మల్లై సత్య, మాసిలామణి, జీవన్, రైతు సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది.  
 

మరిన్ని వార్తలు