కరియప్ప చేరికతో కాంగ్రెస్‌లో లుకలుకలు

12 Oct, 2014 02:06 IST|Sakshi
కరియప్ప చేరికతో కాంగ్రెస్‌లో లుకలుకలు

సింధనూరు టౌన్ : గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున తెర వెనుక ప్రచారం చేసిన  ప్రముఖ నాయకుడు కే.కరియప్ప ఇటీవల బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ.పరమేశ్వర్‌ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బాదర్లి హంపనగౌడ వర్గం జీర్ణించుకోలేక పోతోంది. మాజీ కాంగ్రెస్ ఎంపీ కే.విరుపాక్షప్ప బంధువైన కరియప్ప గత అసెంబ్లీ ఎన్నికల వరకు విరుపాక్షప్ప వెంటే ఉన్నారు.

అయితే ఎన్నికల్లో ఓటమి అనంతరం సంభవించిన పరిణామాలు, స్థానికంగా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప బీజేపీలో చేరారు. అప్పుడు కరియప్ప మాత్రం తటస్తంగా ఉన్నాడు. అయితే తెర వెనుక కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేపట్టారు. క్రమంగా విరుపాక్షప్పకు దూరమైన కరియప్ప ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కరియప్పను భవిష్యత్తులో కురుబ సమాజ నాయకుడిగా పార్టీ గుర్తిస్తే విరుపాక్షప్పకే నష్టమనే వదంతులు వినిపిస్తున్నాయి.

అంతకు ముందు బీఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన కే.విరుపాక్షప్ప గత లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించగా అప్పట్లో విరుపాక్షప్ప చేరికను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే హంపనగౌడ వర్గం సీఎం, కేపీసీసీ అధ్యక్షులకు మొర పెట్టుకున్నారు. దీంతో నిరాశ చెందిన విరుపాక్షప్ప చివరకు బీజేపీలో చేరిపోయాడు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బంధువు కాంగ్రెస్ అభ్యర్థి బసవరాజ్ హిట్నాళ్ తరఫున ప్రచారం చేయకుండా బీజేపీ బలపరిచిన అభ్యర్థి కరడి సంగణ్ణకే మద్దతు తెలిపి గెలిపించారు.

అదే సమయంలో కరియప్ప కాంగ్రెస్ అభ్యర్థి తరఫున తెర వెనుక ప్రచారం చేసి పార్టీ అగ్రనాయకత్వంతో సంబంధాలు పెంచుకున్నారు. దీంతో పార్టీ అగ్రనాయకత్వం సమక్షంలో పార్టీలో చేరిపోయారు. అయితే ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే వర్గంలోని కొందరు నగరసభ సభ్యులు రాజీనామా చేస్తామని తమ అసంతృప్తి వ్యక్తం చేయగా, మరికొందరు నోరు మెదపడం లేదు. అగ్ర నాయకత్వం సమక్షంలో పార్టీలో చేరినా రాబోయే రోజుల్లో స్థానిక నాయకులతో పొసుగుతారో లేక సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారో వేచి చూడాలి.
 

మరిన్ని వార్తలు