ఉధృతమవుతున్న పోరు | Sakshi
Sakshi News home page

ఉధృతమవుతున్న పోరు

Published Sun, Oct 12 2014 2:09 AM

movement for to get bellampalli district

బెల్లంపల్లి : బెల్లంపల్లి జిల్లా కోసం ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. రాజకీయ పక్షాలు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, మహిళలు, యువకులు, ఆటో ఓనర్లు, డ్రైవర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోరాడుతున్నారు. సామూహిక దీక్షలు, ప్రదర్శనలు నిర్వహించి ప్రజల్లో బెల్లంపల్లి జిల్లా కాంక్షను దినదినం రగిలిస్తున్నారు. బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఎ.శ్రీదేవి, మరో తొమ్మిది మంది  కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్లు గత నెల 17వ తేదీన కాంటా చౌరస్తా వద్ద ఒక రోజు సామూహిక రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అదే రోజు బెల్లంపల్లి మండల సర్పంచులు కూడా జిల్లా కోసం సామూహిక దీక్ష నిర్వహించారు.

బెల్లంపల్లి జిల్లా సాధన కోసం తాము సైతం అంటూ అదే నెల 28వ తేదీన బెల్లంపల్లి మండలం సోమగూడెం(భరత్‌కాలనీ) వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక రోజు దీక్ష జరిగింది. ఆ దీక్ష ముగిసిన రెండు రోజులకు పవర్ ఆఫ్ బెల్లంపల్లి ఆధ్వర్యంలో కాంటా చౌరస్తా వద్ద యువకులు ఒక రోజు దీక్ష చేశారు. ఈ నెల 8వ తేదీన కెరమెరి మండలం జోడేఘాట్‌లో జరిగిన గిరిజన వీరుడు కొమురంభీమ్ 74వ వర్ధంతి వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిసి బెల్లంపల్లి జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను వివరించి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మెమోరాండం సమర్పించారు. తాజాగా శనివారం అంజనీపుత్ర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో ఓనర్లు, డ్రైవర్లు బెల్లంపల్లిలో భారీ ప్రదర్శన చేశారు. అంతకుముందు రాజకీయ పక్షాల నేతలు సమావేశమై జిల్లా సాధన కోసం భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకున్నాయి. ఇలా జిల్లా సాధన కోసం ప్రజలు ఆందోళన పథంలో ముందుకు సాగుతున్నారు.

మంచిర్యాల పేరు ప్రస్తావించకుండానే..
ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మంచిర్యాలను జిల్లా చేస్తామని సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొని హామీ ఇ చ్చారు. దీంతో తూర్పు ప్రాంతంలో మంచిర్యాల జిల్లా ఏర్పాటుకావడం దాదాపు ఖాయమైనట్లుగానే అంతా భా వించారు. ఇటీవల కొమురంభీమ్ వర్ధంతికి హాజరైన ము ఖ్యమంత్రి మంచిర్యాల పేరు ప్రస్తావించకుండానే తూర్పు ప్రాంతంలో కొత్త జిల్లాను ఏర్పాటు చేసి, గిరిజనుల కోసం ప్రాణాలు అర్పించిన కొమురంభీమ్ పేరు పెడతామని ప్రకటించడం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి ప్రకటనపై తూర్పు ప్రాంత ప్రజలు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. ఇదివరలో ఎన్నోమార్లు మంచిర్యాల పేరు ప్రస్తావించి జిల్లాను చేస్తామని ప్రకటించిన సీఎం ఈసారి మాత్రం ఆ పేరు ఉచ్ఛరించకపోవడం ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించింది.

తూర్పు ప్రాంతంలో మంచిర్యాల, బెల్లంపల్లి పేర్లు మాత్రమే జిల్లా ఏర్పాటులో ప్రతిసారీ ప్రస్తావనకు వస్తున్నాయి. ఇటీవల బెల్లంపల్లి జిల్లా కోసం స్థానికంగా ఆందోళనలు జరుగుతున్నాయి. రాజకీయ పక్షాలు ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు పంపిస్తున్నారు. ప్రజా సంఘాలూ అదే బాటలో నడుస్తున్నాయి. మరో పక్క కొత్త జిల్లాల ఏర్పాటు కోసం భౌగోళిక పరిస్థితులు, మౌలిక వసతులు తదితర అంశాలను పరిశీలించేందుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కొత్త జిల్లా ఏర్పాటు అంశంలో ముఖ్యమంత్రి నేర్పుతో మాట్లాడినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

మంచిర్యాలను జిల్లా చేస్తే సిర్పూర్(టి), ఆసిఫాబాద్ నియోజవర్గాల ప్రజలకు జిల్లా కేంద్రం దూరమవుతుందనే వాదన తెరమీదకు రావడం, భౌగోళికంగా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు మంచిర్యాల కేంద్రంగా లేకపోవడం, ముఖ్యంగా భూమి సమస్య ఏర్పడే అవకాశాలు ఉండటంతో సీఎం ఈసారి మంచిర్యాల పేరును ప్రకటించలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆయా అంశాలన్నీ  మంచిర్యాలకు ప్రతికూలంగా మారగా బెల్లంపల్లి జిల్లాగా ఏర్పాటు కావడానికి దోహదపడుతాయని పలువురు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement