అమ్మా.. మేం నీ బిడ్డలమే.. గుర్తుపట్టావా?

21 Jul, 2019 08:46 IST|Sakshi
14 ఏళ్ల తర్వాత కలిసిన తల్లితో కుమార్తెలు

14 ఏళ్ల కిందట ఇల్లు విడిచి వెళ్లిన తల్లిని గుర్తుపట్టిన కుమార్తెలు

పిల్లల్ని దగ్గరకు తీసుకుని వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి 

పట్టరాని ఆనందంతో అమ్మను ఇంటికి తీసుకెళ్లిన బిడ్డలు 

సాక్షి ప్రతినిధి, చెన్నై : వారు పిల్లలుగా ఉండగానే తల్లి ఇల్లు విడిచి వెళ్లింది. ఇన్నాళ్లూ పెంచి పోషించి, చదివించి వృద్ధిలోకి తెచ్చిన తండ్రి రెండువారాల కిందట తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అయితేనేం.. ఆ ఇద్దరు అనాథలు కాకుండా వి«ధి కరుణించింది. చిరుప్రాయంలో తమకు దూరమైన తల్లిని 14 ఏళ్ల తర్వాత చేరువ చేసింది. తమిళనాడు తినల్వేలి సురండై చేనేతకాలనీకి చెందిన భాగ్యరాజ్‌ (50), జ్ఞానసెల్వి (45) దంపతులకు జపరాణి, షకీలా అనే కుమార్తెలున్నారు. జపరాణి పదేళ్ల వయస్సులో ఉన్నపుడు భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో జ్ఞానసెల్వి ఇల్లు విడిచి వెళ్లిపోయింది. ఆమె కోసం వెతికి, పోలీసులకు ఫిర్యాదు చేసినా దొరకలేదు. భాగ్యరాజ్‌ కూడా మరో వివాహం చేసుకోకుండా కుమార్తెల కోసమే జీవించాడు. తండ్రి మనస్సును అర్థం చేసుకున్న కుమార్తెలు కష్టపడి చదివారు.

పెద్ద కుమార్తె జపరాణి (24) నర్సింగ్‌ చదివి తిరునల్వేలీలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో పనిచేస్తోంది. చిన్నకుమార్తె షకీలా (22) రెండేళ్లుగా కోల్‌కతాలోని ఓ అతిథిగృహంలో ఉద్యోగం చేస్తోంది. అనారోగ్యంతో రెండువారాల కిందట భాగ్యరాజ్‌ మరణించాడు. అతని అంత్యక్రియలు పూర్తయ్యాక రెండురోజుల కిందట షకీలా తిరిగి కోల్‌కతాకు బయలుదేరింది. చెల్లిని సాగనంపేందుకు జపరాణి రైల్వేస్టేషన్‌కు బయలుదేరింది. తిరునల్వేలి జంక్షన్‌ బస్‌స్టేషన్‌ సమీపంలో అక్కాచెల్లెళ్లు నడిచి వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న మహిళను చూసి ‘ఆమె మన అమ్మలా ఉంది కదూ’ అని జపరాణి తన చెల్లితో అంది. ఆ తర్వాత ఆమె వద్దకు వెళ్లి ‘ మీది సురుండై కదూ.. మీ పేరు జ్ఞానసెల్వినా’ అని ప్రశ్నించగా అవునంటూ సందేహంగా చూసింది.. అంతే ఆకాశమంత సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిన అక్కా చెల్లెళ్లు ‘నీవు మా అమ్మవి.. మేము నీ కుమార్తెలం.. ఇంట్లో నీ పెళ్లి ఫొటో చూసి గుర్తు పట్టాం’ అని చెప్పారు. అంతే తల్లి సైతం ఆనందంతో ఉప్పొంగిపోయి బిడ్డలను దగ్గరకు తీసుకుంది. మిమ్మల్ని చిన్నతనంలోనే వదిలేసి వెళ్లానంటూ బిగ్గరగా ఏడ్చింది. తిరునెల్వేలి వవూసీనగర్‌లో నివసిస్తూ భిక్షమెత్తి బతుకుతున్నట్టు చెప్పింది. కుమార్తెలు ఎంతో అనందంతో తల్లిని ఇంటికి తీసుకెళ్లారు.  

మరిన్ని వార్తలు