108కు సుస్తీ..

7 Feb, 2019 11:31 IST|Sakshi

ఆత్మకూరు(పరకాల): ఆపద సమయంలో ఆదుకునే ఆపద్భందు 108కు సుస్తీ చేసింది. అనుకోకుండా రోడ్డు ప్రమాదం జరిగితే రోగిని అత్యవసరంగా వాహనంలో చేర్చి ప్రథమ చికిత్స అందజేసి ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాలను కాపాడేది 108. దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి గొప్ప మనసుతో ప్రవేశపెట్టిన ఈ సేవలకు ఇప్పుడు అంతరాయం కలుగుతోంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏడాదిలో ఎన్నో సార్లు సేవలకు అంతరాయం కలుగుతోంది.


జిల్లాలో 16 అంతంతమాత్రమే..మండల కేంద్రాల్లో 108 వాహనం ఉండాల్సి ఉన్నప్పటికీ ఆ సౌకర్యం పూర్తిస్థాయిలో లేదు.8 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. పరకాల, ఆత్మకూరు, నల్లబెల్లి, పర్వతగిరి, నర్సంపేట, సంగెం, గీసుకొండ, నెక్కొండ మండలకేంద్రాల్లో ఉండగా ఒక్కో వాహనం రెండు మండలాల్లో సేవలందిస్తోంది. ఒకటే సమయంలో రెండు మండలాల్లో అత్యవసరం ఏర్పడితే ఇబ్బందులు పడాల్సిందే. పీహెచ్‌సీల్లో రాత్రివేళ అత్యవసర సేవలు మృగ్యమయ్యాయి. దీనికి తోడు 108 వాహనాలు ప్రతి మండలకేంద్రానికి లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

నాలుగోసారి..
ఈ ఏడాది కాలంలో డీజిల్‌ లేక వాహనాలు నిలిచిపోయిన సందర్భం ఇది నాలుగోసారి. 2018లో ఆగస్టు, డిసెంబర్‌లలో ఇదే పరిస్థితి. మూడు సార్లు నిలిచిపోగా తాజాగా ఇప్పుడు నాలుగురోజులుగా జిల్లాలో ఈ పరిస్థితి ఉంది. నాలుగురోజులుగా డీజిల్‌కు డబ్బులు లేక వాహనాలు కదలడం లేదు. డబ్బులు ఎప్పుడొస్తయో అని సిబ్బంది ఎదురు చూస్తున్నారు. కనీసం డీజిల్‌కు డబ్బులు అందచేయలేని స్థితిలో నిర్వాహకులు ఉండడంపై రోగులు దుమ్మెత్తిపోస్తున్నారు.

పైలెట్లు, ఈఎంటీల కొరత..
జిల్లాలో 108 సర్వీసుల్లో సేవలందించాల్సిన పైలెట్లు, ఈఎంటీ(ఎమర్జన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌)ల కొరత ఉంది. ఒక వాహనానికి ఆరుగురు సిబ్బంది ఉండాల్సి ఉండగా ఇప్పుడు నలుగురు మాత్రమే పనిచేస్తున్నారు. సిబ్బంది కొరతతో అక్కడక్కడ వాహనాలు కదలడం లేదు. మానిటరింగ్‌ వ్యవస్థ సరిగాలేదు.

సమ్మెచేసినా..తీరని డిమాండ్లు..
ఇటీవల తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 108 సిబ్బంది సమ్మె చేసినప్పటికి వీరి డిమాండ్లు నెరవేరలేదు. వేరే వారిని తీసుకుంటున్న ఆందోళనతో విధుల్లో చేరారు. వీరికి కనీస కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. హైకోర్టు 8 గంటల సమయం పనిచేయాలని ఆదేశించినప్పటికీ 12 గంటలు పనిచేయాల్సి వస్తోంది. సిబ్బంది సరిపడా లేకపోవడంతో అధనపు పనిభారంతో ఒత్తిడి, నిరాశలో సిబ్బంది ఉంటున్నారు.

కుదరని జీవీకే ఒప్పందం..
ప్రభుత్వంతో 108 సేవలకు సంబంధించి జీవీకే కంపెనీతో ఒప్పందం ఉంది. అయితే ఇప్పుడు ఈ ఒప్పందంలో జాప్యం జరుగుతోందని సమాచారం. ఇప్పటికైనా ప్రభుత్వం 108 సర్వీసులపై నిర్లక్ష్యం వీడాలని ప్రజలు కోరుతున్నారు.

అంతరాయం కలుగకుండా చూస్తాం..
108 సర్వీసులో అంతరాయం కలుగకుండా చూస్తాం. డీజిల్‌ నిధులు వచ్చాయి. వాహనాలు నడిపిస్తాం. వాహనాలను నిలుపకుండా చూస్తాం.సిబ్బంది కొరత విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.  –శ్రీనివాస్, 108 జిల్లా కో ఆర్డినేటర్‌ 

మరిన్ని వార్తలు