TS Elections 2023: ఈ నియోజకవర్గ ఓటర్లు చరిత్ర తిరగరాస్తారా?

29 Nov, 2023 12:41 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

ఆ నియోజకవర్గ ఓటర్ల తీర్పు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయం ముఖచిత్రంలో ఆసక్తికర చర్చగా మారింది. ఎంతటి ఉద్దండులైనా సరే, ఒక్కసారికి మించి గెలిచిన చరిత్ర లేదు. ఏదో ఒక కారణంతో వారికి పదవి గండం తప్పడం లేదు. మరి ఈ సారి పోటీ చేసే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆ చరిత్ర తిరగ రాస్తారా.. మళ్లీ గెలుపు యోగం ఉందా.. అక్కడి ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది.

రాజకీయ చైతన్యానికి, ప్రజా పోరాటాలకు కేరాఫ్ అడ్రస్ ఓరుగల్లు. ఎంతోమంది గొప్ప గొప్ప నేతలకు రాజకీయ జన్మనిచ్చిన గడ్డ ఈ అడ్డ. అలాంటి ఓరుగల్లు గడ్డపైన ఓ విచిత్ర తీర్పు ఆసక్తికరంగా మారింది. అదే వరంగల్ నియోజకవర్గం. వరంగల్ తూర్పు నియోజకవర్గంగా రూపాంతరం చెందిన తర్వాత ఎవరైనా ఒక్కసారికి మించి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టిన చరిత్ర లేదు. మంచి మంచి దిగ్గజాలకు కూడా ఇక్కడ రెండోసారి ఓటమి తప్పలేదు.వరంగల్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంగా రూపాంతరం చెందింది.

2009లో అప్పటి మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ఇక్కడి నుండి గెలుపొందారు. నియోజకవర్గం పునర్విభజనకు ముందు వరుసగా మూడు పర్యాయాలు గెలిచిన ఆయన, 2014 ఎన్నికల్లో కొండా సురేఖ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బస్వరాజు సారయ్య కూడా బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఊహించని పరిణామాలు నేపథ్యంలో 2018 ఎన్నికల్లో కొండా సురేఖకు టిక్కెట్ దక్కలేదు. దీంతో బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ లో చేరారు కొండా సురేఖ దంపతలు.. ఏకంగా ఈ నియోకవర్గాన్నే వదిలి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2018 లో పరకాల నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అయితే 2009 నుంచి ఇప్పటి వరకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినవారు లేరు. ఇక, 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నన్నపునేని నరేందర్ ఇక్కడి నుండి గెలుపొందారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నరేందర్ తిరిగి మళ్లీ అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ నుండి టిక్కెట్ సాధించి బరిలోకి దిగారు. ఆయనపై సొంత పార్టీలోనే ఇప్పుడు తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవడం ఓరుగల్లు హాట్ టాపిక్ గా మారింది. మళ్ళీ చరిత్ర రిపీట్ అవుతుందా. అనే చర్చ జరుగుతుంది. వరంగల్ తూర్పులో కొనసాగుతున్న చరిత్ర రిపీట్ అవుతుందా. సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్ ఆ చరిత్ర ను తిరగ రాస్తారా. అనే చర్చ ఇప్పుడు ఓరుగల్లు వాసుల్లో హాట్ టాపిక్‌గా మారింది.
 

మరిన్ని వార్తలు