సాగర్ ఎడమ కాల్వకు తక్షణమే 15 టీఎంసీలు

19 Sep, 2016 02:38 IST|Sakshi

- సీఎం ఆదేశాలతో కృష్ణా బోర్డుకు అధికారుల లేఖ
- సాగునీటి అవసరాల కోసం విడుదలకు విజ్ఞప్తి
 
 సాక్షి, హైదరాబాద్: నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద సాగునీటి అవసరాల కోసం తక్షణమే 15 టీఎంసీలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని జోన్-2 పరిధిలో ఉన్న 2.51 లక్షల ఎకరాల ఆయకట్టు అవసరాలకు నీటిని విడుదల చేయాలని విన్నవించింది. ఈ అంశంపై బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీతో ఉన్నతాధికారులు ఫోన్లో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆగస్టు తొలి వారంలోనే రాష్ట్ర నీటి అవసరాలను బోర్డు ముందుంచిన ప్రభుత్వం... వచ్చే మూడు నెలల వరకు సాగర్ ఎడమ కాల్వ కింద ఖరీఫ్ కోసం 31 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 6 టీఎంసీలు, నల్లగొండ తాగునీటికి 4.1 టీఎంసీలు అవసరమని తెలిపింది.

ఇందులో ఖరీఫ్ అవసరాలకు 12 టీఎంసీలు తక్షణమే అవసరమని, అక్టోబర్‌లో 15 టీఎంసీల మేర నీటి అవసరం ఉంటుందని పేర్కొంది. దీనిపై స్పందించిన బోర్డు సెప్టెంబర్ కోటా కింద 12 టీఎంసీలకు అనుమతిచ్చింది. అక్టోబర్ కోటాపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఖరీఫ్ అవసరాల నిమిత్తం నీటి విడుదలపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెరగడంతో నీటి విడుదలపై బోర్డుకు లేఖ రాయాలని శనివారం నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్ సూచించారు. దీంతో అధికారులు ఆది వారం లేఖ రాశారు. ప్రస్తుతం సాగర్‌లో 513 అడుగుల వద్ద 138 టీఎంసీల మేర నీటి లభ్యత ఉండగా శ్రీశైలంలో 873.2 అడుగుల వద్ద 155 టీఎంసీల మేర నీటి లభ్యత ఉందని, కనీస నీటిమట్టమైన 834 అడుగుల పైన లభ్యత నీరు సుమారు 53 టీఎంసీలుగా ఉంటుందని ప్రభుత్వం లేఖలో పేర్కొంది.

మరిన్ని వార్తలు