వడదెబ్బకు 208 మంది మృతి

28 May, 2015 05:06 IST|Sakshi

అత్యధికంగా నిజామాబాద్‌లో 47 డిగ్రీలు
 ఏపీలో వడదెబ్బకు 310 మంది మృతి
 
 సాక్షి నెట్‌వర్క్: రాష్ర్టంలో ఎండలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. రాష్ర్టవ్యాప్తంగా బుధవారం వడదెబ్బ బారిన పడి 208 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 45 మంది మరణించగా, వరంగల్ జిల్లాలో 44 మంది మృతి చెందారు. ఖమ్మం 35, కరీంనగర్  31, మహబూబ్‌నగర్  18, ఆదిలాబాద్  12, మెదక్ 8 మంది, రంగారెడ్డి ఆరుగురు, నిజామాబాద్ ఐదుగురు, హైదరాబాద్ జిల్లాలో నలుగురు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం బుధవారం నిజామాబాద్‌లో 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో 45.2, హైదరాబాద్‌లో 42 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి. బుధవారం ఏపీలో 310 మంది మరణించారు. ఒంగోలులో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
 
 వ్యాకోచిస్తున్న పట్టాలు
 రామగుండం: ఎండదెబ్బకు రైల్వే ట్రాక్‌లు మండిపోతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రత కంటే ట్రాక్‌లపై అదనంగా 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవడంతో పట్టాలు వ్యాకోచిస్తున్నాయి. దీంతో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను వేగాన్ని తగ్గించి నడుపుతున్నారు.
 
 విస్తరిస్తున్న ‘నైరుతి’
 నైరుతి రుతుపవనాలు క్రమేపీ ముం దుకు కదులుతున్నాయి. ప్రస్తుతం ఇవి ఆగ్నేయ అరేబియా సముద్రం, మాల్దీవుల్లోకి ప్రవేశించాయి. మరో 24 గంటల్లో దక్షిణ, మధ్య బంగాళాఖాతంలోకి విస్తరిస్తాయని ఐఎండి తెలిపింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ నెలాఖరు నాటికి నైరుతి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు