30 రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలి

6 Sep, 2019 10:41 IST|Sakshi
సదస్సులో మాట్లాడుతున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, చిత్రంలో కలెక్టర్‌ అమయ్‌కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్‌ దీపిక , ఎంపీ బడుగుల, ఎమ్మెల్యేలు బొల్లం, గాదరి

అందరూ భాగస్వాములు కావాలి

రాష్ట్రాన్ని నంబర్‌వన్‌ స్థానంలో ఉంచాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 

పేటలో రెండు చోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన సదస్సు

సాక్షి, సూర్యాపేట: పల్లెల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ 30రోజుల ప్రణాళికను రూపొందించారని, ఇది విజయవంతం కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఇలా అందరూ భాగస్వాములుకావాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై గురువారం జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్‌ హాల్‌లో సూర్యాపేట, తుంగతుర్తి, జీవీవీ గార్డెన్‌లో కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన హాజరై మాట్లాడారు.   

మంచి ఆలోచనతో సీఎం కేసీఆర్‌ 30రోజుల ప్రణాళికను రూపొందించారని, ఇది విజయవంతం కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఇలా అందరూ భాగస్వాములుకావాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. 30రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై గురువారం  జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్‌ హాల్‌లో సూర్యాపేట, తుంగతుర్తి, జీవీవీ గార్డెన్‌లో కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఏ ఒక గడువు పెట్టకుండా ఏ పనులు కూడా కావడం లేదని తెలిసి ఈ కార్యక్రమానికి 30రోజుల ప్రణాళికగా డెడ్‌లైన్‌ పెట్టారని చెప్పారు. ప్రతి గ్రామంలో అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత, డ్రెయినేజీల శుభ్రతపై దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని పనిచేయాలన్నారు. 14ఏళ్లు ఉద్యమంలో ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్ని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబవర్‌వన్‌గా నిలపాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. ప్రపంచంలోనే ఏ నాయకుడు చేయని విధంగా తనకు తానే పరీక్ష పెట్టుకుని అభివృద్ధి చేస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్‌ అని ఆయన పేర్కొన్నారు. 

గ్రామ స్వరాజ్యం సీఎం ఆకాంక్ష.. 
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌ మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రావాలనే ఆలోచనతో సీఎం ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. గ్రామాభివృద్ధి చేయడంలో ప్రజలను మమేకం చేయాలని పేర్కొన్నారు. జెడ్పీ చైర్‌ పర్సన్‌ గుజ్జా దీపిక మాట్లాడుతూ ప్రతి పౌరుడు ఈ 30రోజుల ప్రణాళికలో భాగస్వాముడు కావాలన్నారు. గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకూడదన్నారు. వీలున్న చోట్ల మొక్కలు నాటి పచ్చధనం ఉండేలా చూడాలన్నారు. 

గ్రామాలకు గతం కంటే మెరుగ్గా నిధులు.. 
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ రాష్ట్రమంత ఒకేసారి చేస్తే విజయవంతమవుతుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారన్నారు. నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని తీసుకొచ్చారని, గ్రామాలకు గతం కంటే నిధులు మెరుగ్గా ఉంటాయన్నారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే అభివృద్ది సాధ్యమవుతుందన్నారు.  

పల్లెలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో.. 
కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ మాట్లాడుతూ పల్లెలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ నడుం బిగించి 30రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలని చెప్పారు. గ్రామాల్లో పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటాలన్నారు. కలెక్టర్‌ దుగ్యాల అమయ్‌కుమార్‌ అధ్యక్షత జరిగిన ఈ సదస్సుల్లో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్, జాయింట్‌ కలెక్టర్‌ సంజీవరెడ్డి, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, డీఆర్‌ఓ చంద్రయ్య, ఆర్డీఓ మోహన్‌రావు, అర్వపల్లి జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌ , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.      

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా