ఊపిరి పీల్చుకున్న వరద బాధితులు

21 Aug, 2018 01:47 IST|Sakshi
గుబ్బల మంగమ్మ కొండవాగు నుంచి తాళ్ల సాయంతో భక్తులను దాటిస్తున్న దృశ్యం

కొండవాగులో చిక్కుకున్న 500 మంది 

తాళ్ల సాయంతో రక్షించిన రెస్క్యూటీమ్‌

 ఊపిరి పీల్చుకున్న వరద బాధితులు  

అశ్వారావుపేట రూరల్‌: భద్రాద్రి కొత్తగూడెం– పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దులో అశ్వారావుపేట మండలం గోగులపూడి అటవీ ప్రాంతంలో ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం వద్ద ఆదివారం చిక్కుకున్న భక్తులను ఎట్టకేలకు సురక్షితంగా బయటకు లాగారు. భారీ వర్షంతో ఆలయ సమీపంలోని కొండవాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో 400 మంది భక్తులు, 100 మంది వ్యాపారులు అడవిలోనే దాదాపు 12 గంటలపాటు ఉండిపోయారు. సోమవారం ఉదయం వరకు కూడా వాగు ఉధృతి ఏ మాత్రం తగ్గలేదు. దాంతో అడవిలో ఉన్న భక్తులు వాగు దాటే పరిస్థితి లేకుండా పోయింది.

భక్తులు చిక్కుకుపోయారని ఆదివారం రాత్రి టీవీ చానళ్లలో వచ్చిన వార్తలతో ఏపీలోని బుట్టాయిగూడెం మండల రెవెన్యూ, పోలీసు అధికారులు అతి కష్టం మీద అక్కడికి చేరుకున్నారు. కానీ భక్తులను వాగు దాటించలేక పోయారు. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలు సాధ్యం కాలేదు. దీంతో సోమవారం ఉదయం ఏడు గంటలకు స్థానిక ఆర్‌డీవో మోహన్‌రావు, కన్నాపురం ఐటీడీఏ పీవో హరిప్రసాద్, జంగారెడ్డిగూడెం సీఐ బాలరాజు వచ్చి రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగాన్ని రంగంలోకి దింపారు. రెస్క్యూటీమ్‌ల ఆధ్వర్యంలో పెద్ద తాళ్ల సాయంతో భక్తులను సురక్షితంగా వాగు దాటించారు. ఎట్టకేలకు అడవి, వాగు నుంచి క్షేమంగా బయటపడటంతో ఇటు అధికారులు, అటు బాధితుల కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, వాగు ప్రవాహంలో లారీతోపాటు పలు వాహనాలు కొట్టుకుపోగా వాటిని బయటకు తీయడం సాధ్యం కాలేదు.  

చేయి చేయి కలిపితేనే తట్టుకోగలం 
వాతావరణ మార్పులపై  సీఎస్‌ జోషి  
సాక్షి, హైదరాబాద్‌: పర్యావరణ నాశనంలో మానవ తప్పిదాల పాత్ర చాలా ఉందని, పరిస్థితిని సరిదిద్దుకోకపోతే  భూమ్మీద మనిషి మనుగడ కష్టమేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్‌లోని జి.పి.బిర్లా సైన్స్‌ సెంటర్‌లో ‘వీ 4 క్లైమెట్‌’ పేరుతో సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్, జర్మన్‌ సంస్థ జీఐజెడ్‌ నిర్వహించిన కార్యక్రమంలో సీఎస్‌ మాట్లాడారు. వాతావరణ పరిరక్షణకు ప్రభుత్వాల తోపాటు వ్యక్తులు కూడా  బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రభుత్వా లు విధానాలు రూపొందించగలవే గానీ అమల్లో ప్రజలదే కీలకపాత్ర అన్నారు.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా