ఎల్‌ఆర్‌ఎస్‌ కిరికిరి

20 Jun, 2018 11:10 IST|Sakshi

తమ ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు తిరిగిచ్చేయమంటున్న తిరస్కరణదారులు  

జీఓలో ఆ ప్రస్తావన లేదంటున్న అధికారులు 

హెచ్‌ఎండీఏకు పోటెత్తుతున్న దరఖాస్తుదారులు.. 

తిరస్కరణకు గురైనవి 63,500 

ఒక్కో దరఖాస్తుకు రూ.10 వేలు వసూలు 

ఆందోళన చెందుతున్న బాధితులు

సాక్షి, హైదరాబాద్‌: శ్రీకాంత్‌ 20 ఏళ్లుగా ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తూ దాచుకున్న డబ్బులతో హయత్‌నగర్‌లో ఒక ఓపెన్‌ ప్లాట్‌ తీసుకున్నాడు. అనధికారిక భూములను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో ‘ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌’ కోసం హెచ్‌ఎండీఏకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాడు. ఇందుకు రూ.10 వేలు ఇనిషియల్‌ పేమెంట్‌ చెల్లించాడు. అయితే టైటిల్‌ క్లియర్‌ అంతా బాగున్నా టెక్నికల్‌ స్క్రూటినీలో ఆ ప్లాట్‌ ఇండస్ట్రియల్‌ జోన్‌లో ఉందంటూ అధికారులు క్లియరెన్స్‌కు అంగీకరించలేదు. అలాగే మణికొండలో వాటర్‌ బాడీస్‌ కింద ప్లాట్‌ ఉందంటూ రాజేందర్‌రెడ్డి దరఖాస్తును కూడా తిరస్కరించారు. ఇలా హెచ్‌ఎండీఏకు వచ్చిన లక్షా 75 వేల దరఖాస్తుల్లో 63,500 దరఖాస్తులను ఓపెన్‌ స్పేస్, రిక్రియేషనల్, వాటర్‌ బాడీ, మానుఫ్యాక్చరింగ్, సెంట్రల్‌ స్క్వేర్, ట్రాన్స్‌పోర్టేషన్, బయో కన్సర్వేషన్, ఫారెస్ట్‌ జోన్, మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు, ఓపెన్‌ స్పేస్‌ ఆఫ్‌ లే అవుట్, బఫర్‌జోన్‌ వంటి కారణాలతో తిరస్కరించారు. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌లో ఇప్పడు ఈ తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులు తాము కట్టిన ఫీజును వెనక్కి ఇచ్చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఇనిషియల్‌ పేమెంట్‌గా చెల్లించిన మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలంటూ తార్నాకలోని హెచ్‌ఎండీఏ కార్యాలయానికి పోటెత్తుతున్నారు. జీఓ 151లో ఫీజు వెనక్కి ఇచ్చే ప్రస్తావన లేదని అధికారులు చెబుతుండడంతో ఖంగుతింటున్నారు. ఎంతో చమటోడ్చి కొన్న ప్లాట్‌ క్రమబద్ధీకరించరని తేలడంతో ఆర్థికంగా చితికిపోయామని, తాము కష్టించి కట్టించిన ఫీజును వెనక్కి ఇవ్వాలంటూ వారు మొరపెట్టుకుంటున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోలేని స్థితిలో అధికారులు ఉన్నారు.  

వారికి కట్టామన్నట్టుగానే.. మావి ఇచ్చేయండి 
రూ.10 వేలు కట్టకున్నా లే అవుట్‌ రెగ్యులేషన్‌ స్కీమ్‌(ఎల్‌ఆర్‌ఎస్‌)కు దరఖాస్తు చేసుకున్న ప్రజలకు చివరి సమయంలో ప్రభుత్వం అవకాశమిచ్చినట్టుగానే.. తాము ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం అప్లయ్‌ చేసుకునే సమయంలో చెల్లించిన మొత్తం ఫీజు వెనక్కి ఇచ్చే విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని హెచ్‌ఎండీఏలో ఎల్‌ఆర్‌ఎస్‌ తిరస్కరణకు గురైనవారు అభ్యర్థిస్తున్నారు. ‘పైసాపైసా కూడబెట్టి శివారు ప్రాంతాల్లో కొనుగోలు చేసిన ప్లాట్లు క్రమబద్ధీకరణ కావడం కష్టమని తేలడంతో ఇప్పటికే సగం చితికిపోయాం. ఈ ప్లాట్‌కు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ప్రారంభ సమయం(ఇనీషియల్‌ పేమెంట్‌)లో చెల్లించిన ఫీజు కూడా ప్రభుత్వానికే వెళుతుందంటూ అధికారులు చెబుతున్న మాటలతో గుండె బరువెక్కుతోంది. అసలే ప్లాట్‌ విషయంలో మోసపోయాం. ఈ ఫీజు కూడా తిరిగి ఇవ్వకపోతే ఎలా’ అంటూ బాధితులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. కొందరైతే ఏకంగా ‘మా పైసలు తిరిగి ఇప్పించండి’ అంటూ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్న సందర్భాలు ఉన్నాయి.   

చిరుజీవుల ఆశలు అడియాసలు.. 
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం వచ్చి నగరంలో ఉంటున్నారు. దినసరి కూలీలతో పాటు వివిధ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల వరకు అహర్నిశలు శ్రమించి శివారు ప్రాంతాల్లో చాలా మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. కొందరు తమ పిల్లల పెళ్లిళ్లకు ఉపయోగపడతాయని, మరికొందరు భవిష్యత్‌లో ఇల్లు కట్టుకోవాలని ఆశించారు. ఇలా గ్రామ పంచాయతీ లే అవుట్లలోని ప్లాట్లు తీసుకున్నారు. ఎంతో వ్యయప్రయాసలతో కొన్న ఈ ప్లాట్‌ను లే అవుట్‌ రెగ్యులేషన్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద క్రమబద్ధీకరించుకుంటే క్రయవిక్రయాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని భావించి వేలాది మంది ప్రారంభ ఫీజు «రూ.10 వేలు చెల్లించి దరఖాస్తు చేశారు. అయితే ఇప్పుడు వివిధ కారణాలతో హెచ్‌ఎండీఏ అధికారులు తిరస్కరించారు. ‘ఏళ్ల క్రితం కొనుగోలు చేసినప్పుడు ఆ ప్లాట్లు బాగానే ఉన్నాయి. అయితే మాస్టర్‌ ప్లాన్‌లో ఆయా ప్రాంతాల్లో రోడ్లు, చెరువులు, కుంటలు, నాలాలు, ఇండస్ట్రీయల్‌ జోన్‌లో ఉన్నవంటూ ఇప్పుడు అధికారులు చెబుతున్నారు. కొత్త మాస్టర్‌ ప్లాన్‌ తప్పుల వల్ల ప్లాట్‌ మీద పెట్టిన డబ్బులు పోతున్నాయి. అవి అమ్మినా తీసుకునేందుకు ఎవరూ రావడం లేదు. పోనీ మేం దరఖాస్తు చేసిన సమయంలో చెల్లించిన రూ.10వేలు కూడా హెచ్‌ఎండీఏ ఇచ్చేది లేదంటోంది. జీఓ 151లో ఆ ప్రస్తావన లేదంటున్నారు’ అని హెచ్‌ఎండీఏకు వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ బాధితులు రాజేందర్‌ రెడ్డి వాపోయాడు. ఫీజు తిరిగి ఇవ్వాలని జీఓలో లేదని, ప్రారంభ ఫీజు రూ.10 వేలు కంటే అధికంగా చెల్లిస్తే ఆ మొత్తం మాత్రం తిరిగి ఇస్తామన్నారు.   

జీఓ 151లో ఏముంది..  
ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలో పూర్తిస్థాయి ఫీజు చెల్లించవచ్చు. లేదంటే ప్రారంభ ఫీజు రూ.10వేలు చెల్లించవచ్చు. లేదంటే దీంతో పాటు మరో పది శాతం డబ్బు కూడా చెల్లించవచ్చని ప్రభుత్వం ప్రస్తావించింది. కానీ తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులకు తిరిగి ఆ 10 వేలు తిరిగి చెల్లించాలని ఎక్కడా ప్రస్తావించడలేదు. హెచ్‌ఎండీఏకు వచ్చిన లక్షా75 వేల దరఖాస్తుల్లో లక్షా2,500 దరఖాస్తులను ఆమోదించారు. దాదాపు 9 వేల దరఖాస్తులు ఎన్‌ఓసీల రూపంలో పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన 63,500 వివిధ కారణాలతో తిరస్కరించారు.   

మరిన్ని వార్తలు