కరోనా వైరస్‌: అధికారుల ఇష్టారాజ్యం

16 Mar, 2020 03:03 IST|Sakshi

హైరిస్క్‌ దేశం నుంచి వస్తే ఐసోలేషన్‌లో ఉంచాలన్ననిబంధన ఎయిర్‌పోర్ట్‌లో ఉల్లంఘన

అతని పేరు ఆకాశ్‌ (పేరు మార్చాం). శనివారం జర్మనీ నుంచి వచ్చాడు. హైదరాబాద్‌ విమానాశ్రయంలో దిగాడు. అక్కడి కేంద్ర వైద్య అధికారులు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి వదిలేశారు. అతడి గురించి రాష్ట్ర వైద్యాధికారులకు సమాచారం కూడా ఇవ్వలేదు. తనకు జాగ్రత్తలు కానీ, ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉండాలని కానీ అక్కడ ఎవరూ చెప్పలేదని అతను అంటున్నాడు. దర్జాగా హైదరాబాద్‌లో తిరుగుతున్నాడు. 

పూర్వ ఖమ్మం జిల్లాకు చెందిన లోకేష్‌ (పేరు మార్చాం) 3 రోజుల క్రితం అమెరికా నుంచి హైదరాబాద్‌ వచ్చాడు. విమానా శ్రయంలో అతడికి ఎటువంటి జాగ్రత్తలు చెప్పలేదు. సరికదా అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేయబోతున్నాడు కూడా తెలుసుకోలేదు. అతను పెళ్లి చేసుకునేందుకు ఇక్కడకు వచ్చాడన్న విషయం కూడా అధికారులకు తెలియదు. ఆదివారం పెళ్లి జరిగింది. అతను అమెరికా నుంచి వచ్చాడని తెలిసి చాలా మంది పెళ్లికి కూడా వెళ్లలేదు. 

సాక్షి, హైదరాబాద్‌: ఇలా వివిధ దేశాల నుంచి వచ్చే వారికి కోవిడ్‌ అనుమానిత లక్షణాలు ఉన్నాయా? లేదా? అనేది సంబంధం లేకుండా హోం ఐసోలేషన్‌లో ఉంచాలి. జర్మనీ సహా ఏడు దేశాల నుంచి ఎవరు వచ్చినా సరే సర్కారు ఆధ్వర్యంలో ఐసోలేషన్‌ చేయాలని తెలంగాణ వైద్యాధికారులు నిర్ణయించారు. అది ఈ నెల 13 నుంచి అమల్లోకి వచ్చింది. అమెరికా సహా ప్రపంచంలోని ఏ దేశం నుంచి వచ్చినా, వారిని కూడా 14 రోజులు హోం ఐసోలేషన్‌ చేయాలని గతంలోనే నిర్ణయించారు. పైన పేర్కొన్న ఇద్దరు వ్యక్తులు ఒకరు జర్మనీ నుంచి, మరొకరు అమెరికా నుంచి వచ్చారు. కానీ ఈ ఇద్దరికీ హోం ఐసోలేషన్‌లో ఉండాలని కానీ, ఎలాంటి జాగ్రత్తలు కానీ చెప్పకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 

హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలంగాణ వైద్యాధికారులకు కొందరు ప్రయాణికుల విషయంలో సరైన సమాచారం ఇవ్వడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఒక్కోసారి విదేశీ ప్రయాణికుల జాబితా తీసుకోవడం కూడా కష్టంగా మారుతుందని రాష్ట్ర వైద్యాధికారులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం, వైద్య, ఆరోగ్య శాఖ కోవిడ్‌ వైరస్‌పై యుద్ధం ప్రకటిస్తే, విమానాశ్రయ అధికారుల్లో కొందరు తేలిగ్గా తీసుకుంటున్నారని అంటున్నారు. ఆ ఏడు దేశాలు హైరిస్క్‌లో ఉన్నందున, 60 ఏళ్లు దాటిన వారికి లక్షణాలు లేకపోయినా తప్పకుండా సర్కారు ఆధ్వర్యంలో కోరంటైన్‌ చేయాలని, ఆ లోపు వారికి లక్షణాలు లేకపోతే హోం ఐసోలేషన్‌లో ఉంచాలన్నది కేంద్రం నిబంధన. 

ఈ నిబంధనను మార్చాలని, ఆ ఏడు దేశాల నుంచి వచ్చేవారెవరైనా సరే తమ ఆధ్వ ర్యంలోనే కోరంటైన్‌లో ఉంచుతామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు తాజాగా లేఖ రాశారు. అయినా ప్రస్తుతం ఉన్న నిబంధనలను కూడా తుంగలో తొక్కడం వల్ల ఆ 2 దేశాలకు చెందినవారు హోం ఐసోలేషన్‌లో కూడా లేకుండా బయట ఉన్నారు. ఇలా విదేశాల నుంచి, రిస్క్‌ ఉన్న దేశాల నుంచి ఎందరు రాష్ట్రంలోకి సమాచారం లేకుండా ప్రవేశిస్తున్నారన్న దానిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే మున్ముందు పరిస్థితిని నియంత్రించలేమన్న భయాందోళనలు కూడా వైద్యాధికారుల్లో నెలకొన్నాయి.  

మరిన్ని వార్తలు