ఆస్పత్రులు బంద్

23 Apr, 2016 03:10 IST|Sakshi
ఆస్పత్రులు బంద్

ఇబ్బందులుపడ్డ రోగులు
హైకోర్టుకు వెళ్లిన వైద్యుల బృందం
హెచ్‌ఆర్సీ, ఎంపీ కవితకు విన్నపం

 
జగిత్యాల అర్బన్/కోరుట్ల :
అపెండిసైటిస్, గర్భసంచుల ఆపరేషన్ల కేసులో జగిత్యాలకు చెందిన తాటిపాముల సురేష్‌కుమార్, కోరుట్లకు చెందిన డాక్టర్ మనోజ్‌కుమార్‌ను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల వైద్యులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈమేరకు కోరుట్ల, మెట్‌పల్లిలో నిరవధిక బంద్‌కు పిలుపునివ్వగా జగిత్యాలలోనూ బంద్ కొనసాగుతోంది. శనివారం జిల్లా వ్యాప్తంగా బంద్  చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని రాష్ట్ర మానవహక్కుల కమిషన్(హెచ్‌ఆర్సీ)కి శుక్రవారం విన్నవించారు. అంతేకాకుండా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను సైతం కలిసి డాక్టర్ల సమస్యపై వినతిపత్రం అందజేశారు.

హైకోర్టులో క్రాస్ పిటిషన్, రిట్ పిటిషన్ సైతం దాఖలు చేశారు. ఫిర్యాదు చేసిన బాధితులు ఏడాది క్రితం ఆపరేషన్ చేసుకున్నారని, మళ్లీ కడుపునొప్పి ఉందనే చెప్పారే తప్ప బలవంతంగా చేయలేదన్నారు. కానీ పోలీసులు 420 కేసులు నమోదు చేశారని హెచ్‌ఆర్సీ ఎదుట వారు ఆవేదన వ్యక్తం చేశా రు. హెచ్‌ఆర్సీ సైతం పత్రికల్లో వచ్చిన కథనాల మేరకే దర్యాఫ్తు చేయమన్నామే తప్ప వేరేగా ప్రయత్నించలేదని చెప్పినట్లు తెలిసింది. ఈ సమస్యలన్నీ ఎంపీ కవిత దృష్టికి సైతం తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని ఆమె చెప్పినట్లు సమాచారం.

 నేటి బంద్‌కు నిర్ణయం?
 శనివారం జిల్లాస్థాయిలో ఆస్పత్రులను బంద్ చేయడంతోపాటు సమావేశం సైతం నిర్వహించనున్నట్లు తెలిసింది. అక్రమంగా అరెస్ట్‌లు చేస్తే నిరవధిక సమ్మె చేపట్టే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.  

 రోగులకు తప్పని తిప్పలు
 వైద్యులందరూ నిరవధిక బంద్ చేపడుతుండడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తెలియక నిత్యం హాస్పిటల్‌కు వస్తూ పోతున్నారు. ఉన్నతాధికారులు స్పందిస్తేగానీ సమస్య పరిష్కారం అయ్యేలా లేదు.
 
 
 కోరుట్ల-మెట్‌పల్లి బంద్ కాల్ ఆఫ్
 వైద్యుల ఆరెస్టుతో బంద్‌కు పిలుపునిచ్చిన ఐఎంఏ ప్రతినిధులు రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో బంద్ పిలుపును ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఐఎంఏ సెంట్రల్ కమిటీ సభ్యుడు వైద్యుడు అనూప్‌రావు ‘సాక్షి’తో మాట్లాడారు. శనివారం నుంచి తాము ఆస్పత్రులు తెరిచి వైద్యసేవలు అందిస్తామన్నారు. కోరుట్ల-మెట్‌పల్లి ప్రాంతంలో రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. శనివారం నుంచి ప్రజలకు అందుబాటులో ఉండనున్నట్లు చెప్పారు.  
 
కోరుట్లలో రోగుల పాట్లు
ఈమె పేరు సామల్ల మహేశ్వరి. కోరుట్లలోని 21వ వార్డులో నివాసముంటుంది. తొమ్మిది నెలల గర్భిణి మహేశ్వరీ శుక్రవారం ఉదయం పురిటినొప్పులతో ఇబ్బందులు పడుతుండడంతో బంధువులు హడావిడిగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బంద్ బోర్డు ఉండడంతో.. ఏం చేయూలో తెలియలేదు. అన్ని ఆస్పత్రులు బంద్ ఉన్నాయని తెలుసుకుని చివరికి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ మహేశ్వరి బాబుకు జన్మనిచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో పిల్లల డాక్టర్ లేకపోవడంతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు వెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. ఈ పరిస్థితి మహేశ్వరీదే కాదు. ఈ ప్రాంతంలో ప్రైవేట్ ఆస్పత్రులు బంద్ ఉండడంతో చాలా మంది ఇబ్బందులుపడ్డారు. హృద్రోగి కోరుట్లకు చెందిన ఎక్కల్‌దేవి నారాయణ, కథలాపూర్ మండలం తుర్తికి చెందిన గర్భిణి జమున అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు తిరిగి చివరికి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు.

మరిన్ని వార్తలు