కలెక్టర్‌ శ్రీదేవసేనకు అరుదైన గౌరవం

20 Feb, 2020 08:48 IST|Sakshi
ఆదిలాబాద్‌ కలెక్టర్‌ శ్రీదేవసేన

ఇప్పటివరకు నాలుగు జాతీయ స్వచ్ఛత అవార్డులు

సీఎంఓ గ్లోబల్‌ సంస్థ నుంచి మరో అవార్డు

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేనకు అరుదైన గౌరవం లభించింది. ఇప్పటివరకు నాలుగు జాతీయ స్థాయి అవార్డులు ఆమె సొంతం చేసుకున్నారు. మరోసారి సీఎంఓ వరల్డ్‌ సంస్థ ద్వారా ‘ద వరల్డ్‌ ఉమేన్‌ లీడర్‌షిప్‌’ అవార్డును మంగళవారం ముంబైలో ఆ సంస్థ నిర్వాహకుల చేతుల మీదుగా అందుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో ఇంకుడుగుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మహిళలకు శానిటరీ న్యాప్కిన్స్‌ పంపిణీ, పల్లెప్రగతి, గ్రామాల్లో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం తదితర కార్యక్రమాలకు ఈ అవార్డు దక్కింది. పెద్దపల్లి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించినందుకు మహిళ కలెక్టర్ల విభాగంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2018 సంవత్సరంలో పెద్దపల్లి జిల్లాలో 271 కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం హైరిస్క్‌ డెంగీ జిల్లాగా ప్రకటించింది.

ఉపాధిహామీ కింద ఉచితంగా ఇంకుడు గుంతలను నిర్మించడంతో దోమల నివారణ, వృథా నీరు పోకుండా భూగర్భజలాలు పెంపొందించేందుకు దోహదపడ్డాయని కలెక్టర్‌ తెలిపారు. కాగా 2019లో 85 శాతం కేసులు తగ్గాయని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్దపల్లి జిల్లాను ఆదర్శంగా తీసుకోవాలని ప్రకటించినట్లు పేర్కొన్నారు. దేశంలోనే స్వచ్ఛత జిల్లాగా ప్రకటించారని గుర్తు చేశారు. కాగా అప్పట్లో ప్రధాని మోడీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛభారత్, స్వచ్ఛదర్పణ్‌ పథకాల కింద నాలుగు జాతీయ అవార్డులు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.  అందరి సహకారంతో స్వచ్ఛతలో జిల్లాను ముందుంచుతానన్నారు. 


 

మరిన్ని వార్తలు