పిట్ట బతుకే ఓటరుదీ... పిట్టమెదడే వాడి యుక్తి!

18 Nov, 2023 04:43 IST|Sakshi

‘‘వాళ్లకు ఇవ్వం. మనం వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో బెటిఫిట్స్‌ ఇవ్వం. మన జెండా మోసినోళ్లకు, మనతోని తిరిగినోళ్లకు..వాళ్లకే మన స్కీముల ప్రయోజనాలు ఇస్తం. మనోళ్లు కానోళ్లు ఎవ్వరైనా ఇళ్లు కట్టుకుంటుంటే.. మున్సిపాలిటీ వాళ్లకు చెప్పి, నేనే దగ్గరుండి కూలగొట్టిస్త’..ఇదీ కొన్ని దశాబ్దాలుగా ఎన్నికవుతూ ఉన్న ప్రజాప్రతినిధి మాట. అదీ పబ్లిగ్గా మీటింగ్‌లో. అదీ ఆన్‌ రికార్డ్‌. ఇలా అనడం కరెక్టేనా సార్‌’’ అమాయకంగా అడిగాడు ఓటరు.  

‘‘ఆయనంటే ఏదో మామూలు మంత్రిస్థాయి వ్యక్తి. కానీ ఆయన కంటే గొప్పగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా  ‘ప్రజలకు విచక్షణ ఉన్నప్పుడు ప్రభుత్వానికీ ఉంటది. కాబట్టి మేం మా ఇష్టమైనోళ్లకే ఇచ్చుకుంటం మా బెనిఫిట్లు’ అన్నాడు కదా నాయనా. ఈయనతో పోలిస్తే ఆయనెంత’’ అని చిద్విలాసంగా అన్నారు స్వామీ ఎలక్షనానంద.  

‘‘కేవలం నలభై శాతం ఓట్లతోనే ఎన్నికైనా, అంటే అరవై శాతానికి ఆమోదం కాకపోయినా, దాన్నే మెజారిటీ ఓపీనియన్‌ అంటారు. తనకు ఓట్లు వేయనోళ్లకు కూడా గెలిచిన వ్యక్తే ప్రతినిధి అనేది మన ఎలక్షన్‌ సిస్టమ్‌. ఈ సిస్టమ్‌లో ఎన్నికై..ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగునా సార్‌’’ ఎలక్షనానందస్వామిని మళ్లీ అడిగాడు  ఓటరు.  

నిజానికి ఆయన పేరు సలక్షాణానంద స్వామి. ఓ మంచి స్వామీజీగా అన్ని అంశాలతో పాటు రాజకీయాలూ, నేతల అంతర్గత భావాల మీద కూడా వ్యాఖ్యానిస్తుంటారు. ఎన్నికలతో సహా అన్ని విషయాల మీదా నిర్మొహమాటంగా అభిప్రాయాలు చెబుతుంటారు కాబట్టి ఆయన్నలా పిలుస్తారు.  

‘‘పిట్టలు చాలా అమాయకంగా కనిపిస్తాయి. ‘పిట్టప్రాణం’ అనే మాట వినే ఉంటావు. ఓ సామాన్యుడి బతుకులాగే అంతటి బక్కప్రాణం దానిది. అంతటి అర్భకపు ప్రాణికీ ఎన్నో యుక్తులూ, దాని మీద మరెన్నో కథలు. ఎన్నోసార్లు విన్న అలాంటి కథే మచ్చుకు మరోసారి చెబుతా విను నాయనా’’ అంటూ ఎలక్షనానంద స్వామి ఈ కథ చెప్పారు.   

అనగనగనగా రాణివారి తోట. అందులో ఓ చెట్టు. ఆ చెట్టు మీద ఓ పిట్టల జంట కాపురముంటోంది. అదే చెట్టుకు కాస్త ఆవల ఓ పుట్ట. ఆ పుట్టలో ఓ పాము నివాసముంటోంది.  ఎవరి బతుకు వారు బతుకుతున్నంత కాలం..ఎదుటివాడిని కూడా బతకనిస్తున్నంత కాలం... ఎవరికీ అభ్యంతరముండదు. కానీ..ఆడ పిట్ట గుడ్లు పెట్టిన ప్రతిసారీ  పాము రావడం, గుడ్లు తిని వెళ్లిపోవడం..ఇది ప్రతిసారీ జరుగుతోంది. అప్పటికీ పిట్టల జంట చాలాసార్లు పామును కోరాయి..ఇక తమను వదిలేయమనీ, తమ బతుకు తమను బతకనివ్వమని. కానీ తేలిగ్గా దొరికే ఆహారాన్ని వదల్లేక పాము ప్రతిసారీ అదే పని చేస్తోంది.  

పిట్ట బతుకెంత? దాని ఔకాదెంత? పామునది ఏమీ చేయలేదు. అందుకే ఓరోజున  రాణిగారి అంతఃపురంలోకి పోయింది పిట్ట. అక్కణ్నుంచి చాలా విలువైన, రాణిగారికి అత్యంత ప్రియమైన నగను నోటకరచుకొని వచ్చి, సరిగ్గా పుట్టలో వేసింది. నగ పుట్టలో పడిన ఆనవాలు వదులుతూ మరీ వేసింది. అంతే నాయనా..భటులు పుట్ట తవ్వేశారూ, నగను పట్టేశారు.  

ఇక్కడ గమనించాల్సిన ఓ విషయం ఒకటుంది. పిట్టలు తాము పెట్టిన గుడ్ల బెనిఫిట్టును తమ పిల్లల రూపంలో పొందాలి. పిట్టబిడ్డ పిట్టకు ముద్దు కాదా. అందుకే అది నగను పుట్టలో వేసింది. నగలాగే విలువైనది ఓటు కూడా. ఆ ఓటును పిట్టప్రాణమంతే ఉన్న బక్కజీవి ఓట్ల పెట్టెలో వేసేశారనుకో..మిగతా పనంతా పనంతా ప్రజాస్వామ్యం చూసుకుంటుంది నాయనా. ఇది నేను చెప్పిన నీతి కథ కాదు. అనాదిగా అందరూ చదివిందే. దీని తాలూకు నీతి ఏమిటో ఇంకా విపులంగా వివరించి చెప్పాల్సిందేమీ లేదనుకుంట..అంటూ మరోసారి చిద్విలాసంగా నవ్వేరు స్వామి ఎలక్షనానంద.  

మరిన్ని వార్తలు