ఏ పార్టీకీ పార్టీ టైమ్‌ కాదు..

18 Nov, 2023 04:34 IST|Sakshi

గెలవాలంటే చెమటోడ్చాల్సిందే..

మార్పునకు కొందరు మొగ్గు.. ఇంకొందరు ప్రస్తుత పార్టీకే జై 

అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఒకింత అసంతృప్తి... 

ప్రభుత్వ పథకాలపై సానుకూలత.. 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎన్నికలు హోరాహోరీగానే సాగనున్నాయి. ఈసారి ఏకపక్షంగా జరిగే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండుసార్లు గులాబీ జెండా ఎగరేసిన బీఆర్‌ఎస్‌కు ఈసారి గట్టి పోటీనే ఉంది. మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో గులాబీ పార్టీ ఏకంగా 13 స్థానాల్లో గెలుపొందగా..ఈసారి అంత సులువుగా గట్టెక్కే పరిస్థితులు లేవు. మెజారిటీ స్థానాల్లో నువ్వా.. నేనా అన్న విధంగా పోటీ నెలకొంది.

సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంటే.. అవినీతి ఆరోపణలు మరికొందరి విజయంపై ప్రభావం చూపే అవకాశముంది. మరోవైపు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఈ జిల్లాకు చెందిన నాయకుడు కావడం, కాంగ్రెస్‌ గెలిస్తే సీఎం అవుతారన్న ప్రచారం రాజకీయాలను ప్రభావితం చేస్తోందని అంటున్నారు. బీజేపీ ప్రధానంగా మక్తల్, మహబూబ్‌నగర్, కల్వకుర్తిపైనే ఆశలు పెట్టుకుంది. మిగిలినచోట్ల ఆ పార్టీకి పెద్దగా కలిసొచ్చే స్థానాలు లేవనే పరిస్థితే ప్రస్తుతానికి ఉంది. 

మహబూబ్‌నగర్‌   త్రిముఖ పోరు
మహబూబ్‌నగర్‌ సెగ్మెంట్‌లో బీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్‌ నుంచి యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీజితేందర్‌రెడ్డి తనయుడు మిథున్‌రెడ్డి పోటీలో ఉన్నారు.  గత కొంత కాలం క్రితం వరకు బీజేపీ గాలి వీచినా,  ప్రస్తుతం ఆ పార్టీలో కొంత స్తబ్ధత నెలకొంది. అభివృద్ధి, ప్రభుత్వ పథకాలను గుర్తుచేస్తూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రెండు పర్యాయాలు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉండడంతో సహజంగా ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ పాలన అంతా బెదిరింపులు, కేసులు, భూకబ్జాలు అంటూ కాంగ్రెస్‌ అభ్యర్థి యెన్నం ప్రధానాస్త్రంగా చేసుకుని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది.  

అలంపూర్‌  అండ ఎవరికి?
అలంపూర్‌లో ప్రధానంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయుడు, కాంగ్రెస్‌ అభ్యర్థి సంపత్‌ మధ్య పోటీ నెలకొంది. ముఖ్యంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే అబ్రహం వర్గానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌కే చెందిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి చెంతకు చేరారు. మరికొందరు ఎంపీపీ, జెడ్పీటీసీలు, ఇతర ముఖ్య నాయకులు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఇది సంపత్‌ కుమా­ర్‌కు అను­కూలించే అంశం. బీఎస్పీ నుంచి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సోదరుడు ప్రసన్నకుమార్‌ కూడా బరిలో ఉండడం, బీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓట్లను చీల్చే అవకాశం ఉండడం ప్రధాన అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపనుంది.  

మక్తల్‌    ముగ్గురు..
మక్తల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి వాకిటి శ్రీహరి, బీజేపీ అభ్యర్థి జలంధర్‌రెడ్డి మధ్య త్రిముఖ పోరు కొనసాగుతోంది. ఎమ్మెల్యేతో పొసగకపోవడంతో  జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజమ్మ, బీకేఆర్, నర్వ పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ లక్ష్మీకాంత్‌రెడ్డితో పాటు పలువురు బడా నేతలు హస్తం గూటికి చేరారు. ఇది బీఆర్‌ఎస్‌కు మైనస్‌గా మారగా, కాంగ్రెస్‌కు ప్లస్‌ అయినట్లు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి మాదిరెడ్డి జలంధర్‌రెడ్డి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి దాదాపు 37 వేల ఓట్లు సాధించడంతో ఆయనపై సానుభూతి పెరిగింది.

రెడ్డి సామాజికవర్గం ఆయన వైపు చూస్తుండడంతో పోరు కీలకం కానుంది. అంతేగాక ఆ నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు గణనీయంగా ఉండటం, ఇటీవలే ప్రధాని మోదీ, మందకృష్ణమాదిగ పాల్గొన్న సభ నేపథ్యంలో మక్తల్‌ ఎన్నికల్లో జలంధర్‌రెడ్డికి కలిసొచ్చే అంశాలు. ఈ మేరకు మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులతో జలంధర్‌రెడ్డి సమావేశం అవుతున్నారు.  ఇక్కడ ముగ్గురు అభ్యర్థులూ పోటాపోటీగా విజయం కోసం పోరాటం చేస్తున్నారు.  

గద్వాల   ఎవరి అడ్డానో..
గద్వాలలో  డీకే అరుణ పోటీలో లేకపోవడంతో ఎన్నికల్లో  ప్రధాన పోటీ కాస్త బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యనే కొనసాగుతోంది. బీజేపీ నుంచి బోయ శివారెడ్డి బరిలో ఉన్నా,  బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి కుర్వ సామాజిక వర్గానికి చేరిన సరిత మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇక్కడ బీసీ వర్గాల ఓట్లు కీలకం కానున్నాయి. మరో వైపు సిట్టింగ్‌ ఎమ్మెల్యే బండ్లపై ప్రజల్లో  కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఆయన అనుచరుల దందాలను కాంగ్రెస్‌ ప్రధానాస్త్రంగా తీసుకుని ప్రచారం చేస్తోంది. అయితే బీఆర్‌ఎస్‌కు అన్ని మండలాలు, గ్రామాల్లో బలమైన నాయకత్వం, కార్యకర్తలు ఉండడం ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా.  

నాగర్‌కర్నూల్‌    నువ్వానేనా.. 
నాగర్‌కర్నూలులో బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి,  కాంగ్రెస్‌ నుంచి కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, జనసేన నుంచి వంగ లక్ష్మణ్‌గౌడ్‌ బరిలో ఉన్నారు. పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వడంతో  అసంతృప్తికి గురైన  బీజేపీలోని ప్రధాన నాయకులు, అనుచరులు ఎక్కువగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీల్లో చేరారు. నియోజకవర్గంలో ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్యే హోరాహోరీ పోరు నెలకొంది. జరిగిన అభివృద్ధి పనులు బీఆర్‌ఎస్‌  అభ్యర్థికి ఒకింత అనుకూలంగా మారాయి. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు  ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డి కాంగ్రెస్‌ తరపున  బరిలో ఉండటంతో గట్టి పోటీ నెలకొంది.  

నారాయణపేట  పోటాపోటీ
నారాయణపేటలో బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి,  కాంగ్రెస్‌ నుంచి డాక్టర్‌ చిట్టెం ఫరిణికారెడ్డి, బీజేపీ నుంచి రతంగ్‌పాండురెడ్డి పోటీలో ఉన్నారు. ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మ«ధ్యే హోరాహోరీ పోటీ నెలకొంది. రెండు పర్యాయాలు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండగా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతానికి ప్రజల్లో కాస్త్త మార్పు కనిపిస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ ఫరిణికారెడ్డికి ఉన్న కుటుంబ నేపథ్యబలం  ప్రధాన భూమిక పోషిస్తోంది.  

అచ్చంపేట   అమీతుమీ 
అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు,  కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, బీజేపీ నుంచి సతీశ్‌ మాదిగ బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీల  మధ్యే నెలకొంది. నియోజకవర్గంలో ప్రభుత్వంపై అసంతృప్తితోపాటు  ఎమ్మెల్యేపై  సైతం వ్యతిరేకత కనిపిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలోని మెజారిటీ మండలాల్లోని ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు కాంగ్రెస్‌లో చేరడం, ప్రభుత్వ  వ్యతిరేకత కాంగ్రెస్‌కు కలిసివస్తోంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. 

దేవరకద్ర  ద్విముఖ పోరు 
దేవరకద్రలో బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి మధుసూదన్‌రెడ్డి, బీజేపీ నుంచి కొండాప్రశాంత్‌రెడ్డి బరిలో ఉన్నారు. బీజేపీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉండగా... బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యే పోరు కొనసాగనుంది.  బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అభివృద్ధి పనుల పేరిట కొందరు రూ.కోట్ల మేర కమీషన్లు దండుకున్నారనే ఆరోపణలున్నాయి. కాంగ్రెస్‌ ఈ అంశాలనే ప్రధానంగా తీసుకుని ప్రచారం చేస్తోంది. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందిస్తున్నారని... కాంగ్రెస్‌తోనే అందరికీ సంక్షేమం అంటూ మధుసూదన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు. 

జడ్చర్ల    జైకొట్టేదెవరికి?
జడ్చర్లలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోటీ ఉంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండడం ఆయనకు కలిసి వచ్చే అంశం. అయితే ఆయన అనుచరులైన జడ్చర్ల మున్సిపాలిటీ పాలకమండలి కొందరు సభ్యుల అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు, మైనస్‌గా నిలుస్తున్నాయి. వీటినే కాంగ్రెస్‌ అభ్యర్థి అనిరుథ్‌రెడ్డి ప్రధానాస్త్రంగా చేసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు కాంగ్రెస్‌ గాలి కలిసి వస్తుందనే ధీమాతో ఆయన ఉన్నారు. అయితే ఆయనకు అన్ని మండలాలపై పట్టు లేకపోవడం, ప్రచారంలో వెనుకబడడం మైనస్‌ అని చెప్పవచ్చు.  

కొల్లాపూర్‌  త్రిముఖ పోటీ
కొల్లాపూర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ అభ్యర్థిగా ఎల్లేని సుధాకర్‌రావు ఎన్నికల బరిలో ఉన్నారు. సుధాకర్‌రావు ఈసారి ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపులో ప్రభావం చూపనున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో పాటు కాంగ్రెస్‌ అభ్యర్థి జూపల్లి సామాజిక వర్గానికి చెందిన ఓట్లను చీల్చే అవకాశాలు ఉన్నాయి.  

షాద్‌నగర్‌   ఇద్దరి మధ్యే..
షాద్‌నగర్‌లో అధికార బీఆర్‌ఎస్‌కి గట్టి పట్టు ఉంది. అధికార పార్టీ అభ్యర్థి అంజయ్య యాదవ్, ఇప్పటికే రెండుసార్లు విజయం సాధించారు. అధికారపార్టీపై ఉన్న ప్రజా వ్యతిరేకతకు తోడు, బీఆర్‌ఎస్‌ నుంచి కొనసాగిన వలసలు తనకు కలిసి వస్తాయని కాంగ్రెస్‌ అభ్యర్థి వీర్ల శంకర్‌ భావిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి బరిలోకి దిగిన అందె బాబయ్య మోదీ బొమ్మతో పాటు తన సొంత సామాజిక వర్గాన్ని నమ్ముకున్నారు. మొత్తంగా ఇక్కడ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్యే కీలకమైన పోటీ నెలకొంది.  

వనపర్తి  నువ్వానేనా..
వనపర్తిలో బీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరి అనూహ్య పరిస్థితుల్లో టికెట్‌ దక్కించుకున్న తూడి మేఘారెడ్డి, బీజేపీ నుంచి అనూజ్ఞారెడ్డి పోటీలో ఉన్నారు. బీజేపీ ప్రభావం అంతంతే కాగా, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యనే పోరు హోరాహోరీగా ఉండనుంది. మంత్రి నిరంజన్‌రెడ్డికి నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేశారనే పేరుంది. అయితే ఆయన వ్యవహార శైలిపై ప్రజలతోపాటు సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. దీంతో అహంకారానికి, ఆత్మగౌరవానికి పోరు అనే నినాదంతో కాంగ్రెస్‌ ప్రచారంలో దూసుకెళ్తోంది. అధికార పార్టీపై వ్యతిరేకత ఇక్కడ ప్రధానాంశంగా నిలుస్తోంది.  

కొడంగల్‌   పాతకాపుల దంగల్‌
కొడంగల్‌లో బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ నుంచి బంటు రమేష్‌ పోటీలో ఉన్నారు. ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోటీ ఉండనుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ చీఫ్‌గా ఉన్నారు. పైగా కాంగ్రెస్‌ గెలిస్తే రేవంతే సీఎం అన్న ప్రచారం ప్రజల్లోకి వెళుతోంది. యూత్‌లో ఆయన పట్ల క్రేజ్‌ ఉండడంతోపాటు మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి వంటి నాయకులు ఆయనకు మద్దతుగా అన్నీ తామై నిలుస్తుండడం, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండడం రేవంత్‌కు కలిసి వచ్చే అవకాశం ఉంది.  

కల్వకుర్తి  ట్రయాంగిల్‌ 
కల్వకుర్తిలో బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్, కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, బీజేపీ నుంచి తల్లోజు ఆచారి బరిలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు జైపాల్‌యాదవ్‌పై సైతం వ్యతిరేకత ఉంది. ఇప్పటికే ఆయనకు చెందిన ముఖ్యమైన కేడర్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఇది కాంగ్రెస్‌ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డికి కలిసి వచ్చింది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు సాగనుంది. 

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్యే పోటీ  
మహబూబ్‌నగర్‌లో పరిస్థితి పోటాపోటీగా ఉంది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌  పట్టణాన్ని బాగానే అభివృద్ధి చేశారు. అయినా,  ఎవరు గెలుస్తారని చెప్పే పరిస్థితి లేదు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్యనే పోటీ. – వెంకటేశ్, మహబూబ్‌నగర్, ఆటో డ్రైవర్‌ 

రైతుబంధు బీఆర్‌ఎస్‌కు కలిసొచ్చే అవకాశం 
అధికార పార్టీకి కాంగ్రెస్‌ పార్టీకి మధ్య పోటాపోటీ నెలకొని ఉంది. రైతుబంధు వల్ల రైతులు బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. మిగిలిన వర్గాలు ఏం చేస్తాయో చెప్పలేను. ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. –  వెంకటయ్య, రైతు, గోపులాపురం(దేవరకద్ర)

ఇంటికొక ఉద్యోగం ఏమైంది? 
ఈ ప్రభుత్వంలో రైతుబంధు, రైతుబీమా పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు. ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి నెరవేర్చలేదు. పిల్లలు చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం రాక ఆగమవుతున్నారు. పరిస్థితి మాత్రం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు మధ్య పోటాపోటీగానే ఉంది.  – కృష్ణమ్మ, రైతు, మరికల్‌ (నారాయణపేట) 

దళితబంధు కొందరికే ఇవ్వడంతో అసంతృప్తి   
గద్వాల నియోజకవర్గంలో ఇంకా ఎవరు గెలు­స్తారో అప్పుడే చెప్ప­లేం. ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలాగైనా మారిపోవచ్చు. అధికార ప్రతిపక్ష పార్టీలు గట్టి పోటీని ఇస్తున్నాయి. దళిత బంధు కొందరికి మాత్రమే రావడం పట్ల ఆ వర్గాల్లో అసంతృప్తి ఉంది. పిల్లల ఉద్యోగాల విషయంలో కూడా వ్యతిరేకత కనిపిస్తోంది. 
– వసంత్, రైతు, తప్పెట్లముర్స్‌ (గద్వాల) 

మక్తల్‌లో సానుభూతి పనిచేస్తుందా.. 
మక్తల్‌ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో అంతు పట్టడం లేదు. బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య పోటాపోటీ ఉంది. గతంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన జలంధర్‌రెడ్డిపై సానుభూతి ఏమైనా పని చేస్తుందా అన్నది చూడాలి.  – దేవదాసు, పెట్రోల్‌బంక్‌ పంపు బాయ్, మూలమల్ల (మక్తల్‌) 

-ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి బొల్లోజు రవి

మరిన్ని వార్తలు