హైదరాబాద్‌లో అడోబ్‌  కార్యాలయం

20 Feb, 2018 01:26 IST|Sakshi

   ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కేంద్రం ఏర్పాటుకు అంగీకారం 

    అడోబ్‌ చైర్మన్, సీఈఓ శంతన్‌ నారాయణ్‌తో కేటీఆర్‌ భేటీ

సాక్షి, హైదరాబాద్‌: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి కేంద్రంగా కొనసాగుతున్న హైదరాబాద్‌లో మరో ఐటీ దిగ్గజ సంస్థ ఏర్పాటు కానుంది. ప్రముఖ ఐటీ సంస్థ అడోబ్‌ తమ కార్యాలయాన్ని హైదరాబాద్‌ పరిసరాల్లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్‌ సందర్భంగా ఐటీ దిగ్గజం అడోబ్‌ చైర్మన్, సీఈఓ శంతన్‌ నారాయణ్‌తో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అడోబ్‌ కార్యాలయాన్ని నెలకొల్పాల్సిందిగా కేటీఆర్‌ కోరారు. 2015, మే నెలలో శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో శంతన్‌ నారాయణ్‌తో తొలిసారి సమావేశమైన కేటీఆర్, తర్వాత పలుమార్లు ఆయన్ను కలిశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో అడోబ్‌ కార్యకలాపాలను విస్తరించాల్సిందిగా కోరిన విషయాన్ని ఐటీ కాంగ్రెస్‌ సమావేశంలో గుర్తుచేశారు. దీనికి స్పందించిన శంతన్‌ నారాయణ్‌ అడోబ్‌ కంపెనీ విస్తరణ ప్రణాళికల్లో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానమిస్తున్నట్లు స్పష్టం చేశారు.

త్వరలోనే అడోబ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కేంద్రాన్ని ఇక్కడ నెలకొల్పుతామని తెలిపారు. గత మూడున్నరేళ్లలో హైదరాబాద్‌లో ఐటీ రంగం గణనీయమైన ప్రగతి సాధించిందని, నూతన టెక్నాలజీపై ఇక్కడ సుశిక్షితులైన యువతరం అందుబాటులో ఉందని శంతన్‌ అభిప్రాయపడ్డారు. త్వరలోనే అడోబ్‌ కేంద్రానికి సంబంధించిన పెట్టుబడి, ఉద్యోగ అవకాశాలు, సంస్థ విస్తరణ వంటి అంశాలపై సంస్థ తరఫున ఒక ప్రకటన చేస్తామని వివరించారు. ఈ నిర్ణయం పట్ల కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. అడోబ్‌ సంస్థకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇప్పటికే అనేక దిగ్గజ సంస్థలు వినూత్న టెక్నాలజీలపై ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయన్నారు. అడోబ్‌ నిర్ణయంతో ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి వీలుకలుగుతుందని అన్నారు.   

మరిన్ని వార్తలు