ఇక్కడ మద్యం ఏరులై పారాల్సిందే..!

1 Sep, 2017 11:00 IST|Sakshi
ఇక్కడ మద్యం ఏరులై పారాల్సిందే..!

► రెండు రోజుల్లో రూ.5 కోట్ల వ్యాపారం
►వినాయక నిమజ్జనం సందర్భంగా జిల్లాలో జోరుగా మద్యం అమ్మకాలు
►అధికంగా జడ్చర్ల, మహబూబ్‌నగర్‌లో అమ్మకాలు
►ఎక్సైజ్‌ శాఖకు భారీగా ఆదాయం


మహబూబ్‌నగర్‌: ఉమ్మడి జిల్లాలో శుభకార్యమైనా.. పండగైనా మద్యం ఏరులై పారాల్సిందే.. వినాయక నిమజ్జనం సందర్భంగా మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి ఉమ్మడి జిల్లా నుంచి భారీ ఆదాయమే లభించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పండగ సమయాల్లో రూ.10 నుంచి రూ.12 కోట్ల వ్యాపారం జరిగితే ప్రస్తుతం విభజన తర్వాత కూడా నాలుగు జిల్లాలో మద్యం భారీగా అమ్మకాలు జరిగాయి.

వినాయక నిమజ్జనం సందర్భంగా రెండు రోజుల్లో రూ.5 కోట్ల వ్యాపారం జరిగిందని ఎక్సైజ్‌ అధికారులు చెప్పారు. బుధవారం మహబూబ్‌నగర్‌తోపాటు జడ్చర్ల, వనపర్తి తదితర ప్రాంతాల్లో వినాయక నిమజ్జనం ఉన్న నేపథ్యంలో మందుబాబుల దాహం తీర్చడానికి నాలుగు రోజుల ముందే మద్యం వ్యాపారులు తిమ్మాజిపేట దగ్గర ఉన్న డిపో నుంచి పెద్దఎత్తున మద్యం కొనుగోలు చేశారు.

నెలకు రూ.80 కోట్ల ఆదాయం..
ఉమ్మడి జిల్లాలో మొత్తం 200 మద్యం దుకాణాలు, 35 బార్లు ఉండగా వీటి ద్వారా నెలకు రూ.80 కోట్ల ఆదాయం వస్తోంది. కానీ కేవలం వినాయక నిమజ్జనం ఉన్న నేపథ్యంలో మద్యంప్రియులు అధిక మొత్తంలో మద్యం తీసుకుంటారని భావించి మద్యం దుకాణదారులు ముందే అమ్మకాలు నిర్వహించారు. జిల్లా విభజన తర్వాత మహబూబ్‌నగర్‌ జిల్లాలోకి 72 మద్యం దుకాణాలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న మూడు జిల్లాల కంటే మహబూబ్‌నగర్‌లోనే ఎక్కువ మద్యం దుకాణాలు ఉండటం విశేషం. వినాయక నిమజ్జనం సందర్భంగా ఒక్క జడ్చర్లలో రూ.కోటి వరకు మద్యం అమ్మకాలు సాగాయి. ఆ తర్వాత మహబూబ్‌నగర్‌లో రూ.కోటిన్నర వ్యాపారం జరగగా.. నారాయణపేట, మక్తల్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్‌ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

పొంగిపొర్లిన బీర్లు..
ఉమ్మడి జిల్లాలో ఎప్పుడైనా బీర్లకు ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. చాలా వరకు యువకుల నుంచి నడి వయసు కల్గిన వారు సైతం ఎక్కువ మొత్తం వీటిపై ఆసక్తి చూపడంతో వీటి అమ్మకాలు అమాంతంగా పెరిగాయి. సహజంగా ఏటా ఏప్రిల్, మే నెలల్లో మద్యం విక్రయాలు తారాస్థాయిలో జరుగుతుంటాయి. గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితి సంప్రదాయంగా వస్తుంది. దీనికి కారణం కూడా వేసవి నేపథ్యంలో బీర్లవైపు ఎక్కువగా ఆసక్తి చూపుతుండటమే కారణంగా అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు సీజన్‌తో సంబంధం లేకుండా బీర్లను బిర్రుగా తాగేస్తున్నారు.

ఆదాయం పెరిగింది..
ఉమ్మడి జిల్లాలో గతం కంటే ప్రస్తుతం మద్యం నుంచి ఆదాయం బాగా పెరిగింది. ఇంతకు ముందు దుకాణాల దగ్గరకు వెళ్లి రెవెన్యూ పెంచాలని చెప్పేవాళ్లం. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎక్సైజ్‌ శాఖకు మైనస్‌ అనేది ఏమాత్రం లేదు. జిల్లా నుంచి అవసరమైన దాని కంటే ఎక్కువగా ఆదాయం సమకూరుతుంది. పండగలు, సీజన్‌ సమయంలో అధిక స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.
                                – జయసేనారెడ్డి, డీసీ ఉమ్మడి జిల్లా

ఈనెల 25 నుంచి 30 వరకు ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాలు..

జిల్లా                        ఐఎంఎల్‌              బీరు కాటన్లు              విలువ (రూ.కోట్లలో)
మహబూబ్‌నగర్‌      12,956                      13,338                6.53
నాగర్‌కర్నూల్‌          7,608                          6,050               3.75
వనపర్తి                   4,574                          5,132              2.38
గద్వాల                   5,214                         4,044              2.55
మొత్తం                 30,352                      28,564             రూ.15.23 కోట్లు

మరిన్ని వార్తలు