ఉర్దూలోనూ అన్ని ప్రవేశ పరీక్షలు

6 Feb, 2018 03:33 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లోనే నిర్వహిస్తున్న వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ఇకపై ఉర్దూ భాషలోనూ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉర్దూను రెండో అధికార భాషగా అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలను ఇకపై ఉర్దూలో కూడా ఇవ్వాలని ఉన్నత విద్యా మండలిని ఆదేశించింది.

ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఇచ్చే ప్రశ్నపత్రాలను తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లోనే ముద్రించేవారు. అయితే 2018–19 విద్యా సంవత్సరంలో తొలిసారిగా ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ఇచ్చే ప్రశ్నలను ఉర్దూలో ఇవ్వాలని నిర్ణయించారు. ఆయా సెట్‌ కమిటీలకు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో ఉర్దూ మాతృభాషగా కలిగిన విద్యార్థులకు ప్రశ్నలు మరింత సులభంగా అర్థం అవుతాయన్నారు. 

పీజీ ప్రవేశ పరీక్షల్లో కూడా... 
పోస్టు గ్రాడ్యుయేషన్‌ ప్రవేశ పరీక్షల్లోనూ ఉర్దూ భాషలో ప్రశ్నపత్రాలను ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఇంగ్లిష్‌ నుంచి ఉర్దూ భాషలోకి ప్రశ్నలను అనువాదం చేసేందుకు ట్రాన్స్‌లేటర్లను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.   

మరిన్ని వార్తలు