‘షాకింగ్‌’ డెత్స్‌! | Sakshi
Sakshi News home page

‘షాకింగ్‌’ డెత్స్‌!

Published Tue, Feb 6 2018 3:29 AM

Electric shock deaths Increasing in Telangana - Sakshi

లక్ష్మమ్మ బాట వెంట నడుస్తూ వెళుతోంది.. రాజయ్య ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కి తీగలు సరిచేస్తున్నాడు.. నరేశ్‌ ఇంట్లో సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెడుతున్నాడు.. వెంకన్న కరెంటు తీగలకు కొండీలు వేస్తున్నాడు.. అంతా మామూలే.
కానీ.. తెగిపడిన కరెంటు తీగ లక్ష్మమ్మ కాలికి తగిలింది.. రాజయ్య ఎక్కిన ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్‌ సరఫరా అయింది.. నరేశ్‌ సెల్‌ఫోన్‌ చార్జర్‌ పేలింది.. వెంకన్న వేసిన కొండీలు తగిలి షార్ట్‌ సర్క్యూట్‌ అయింది.. అంతా విషాదమే.

...రాష్ట్రంలో ఇలా రోజుకు ఇద్దరు కరెంటు కాటుకు బలవుతున్నారు. విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం, వైఫల్యాలకు తోడు గ్రామీణ ప్రజల అజాగ్రత్త, అవగాహనా లోపం కారణంగా విద్యుత్‌ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏడాదికేడాది పెరిగిపోతూనే ఉన్నాయి. గత మూడేళ్లలో ఏటా ఐదారు వందల మంది విద్యుదాఘాతాలకు బలైపోయారు. 2016–17లో అత్యధికంగా 678 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017–18) తొలి ఆరునెలల్లో 303 మంది మరణించారు.

2016–17లో మరణించినవారి సంఖ్య 678
11 కేవీ ఏబీ స్విచ్‌ల కారణంగా బలైనవారి సంఖ్య 43
విద్యుత్‌ శాఖ వైఫల్యాలతోనే మరణించినవారు 45

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏటా విద్యుత్‌ మరణాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా చేసే ఎన్పీడీసీఎల్‌ పరిధిలో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యంతోపాటు వినియోగదారుల అవగాహనా రాహిత్యం, అజాగ్రత్తల కారణంగా మృతుల సంఖ్య పెరిగిపోతోంది. డిస్కంలు ఇటీవల రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్‌ఆర్‌) నివేదికల్లో విద్యుత్‌ ప్రమాదాలు, మరణాలకు సంబంధించిన గణాంకాలను పొందుపరిచాయి. రాష్ట్రంలో దక్షిణ, ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు (ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌) ఉండగా.. వరంగల్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఎన్పీడీసీఎల్‌ పరిధిలో విద్యుత్‌ మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ పరిధిలో మాత్రం మరణాల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే.. మెదక్‌ జిల్లా పరిధిలో అత్యధికంగా 101 మంది మృత్యువాత పడగా, మహబూబ్‌నగర్, వరంగల్, ఆదిలాబాద్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తంగా సగటున రోజుకు ఇద్దరు విద్యుత్‌ షాక్‌ కారణంగా ప్రాణాలు వదులుతున్నారు.

శాఖాపర లోపాలు.. ప్రజలకు శాపాలు
విద్యుత్‌ ప్రమాద మరణాల్లో దాదాపు సగానికిపైగా ఆ శాఖాపరమైన లోపాల కారణంగానే సంభవిస్తున్నాయి. విద్యుత్‌ సరఫరా పరికరాలు విఫలం కావడం, తగిన నిర్వహణ లేకపోవడం, విద్యుత్‌ తీగలు కిందికి వేలాడుతుండటం, తెగిపడటం, ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ లేకపోవడం, విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లకు చెట్ల కొమ్మలు తగలడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే విద్యుత్‌ ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై ‘కేంద్ర విద్యుత్‌ సంస్థ (సీఈఏ)’జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం... డిస్కంలు ఏటా విద్యుత్‌ మరణాలకు కారణాలపై విశ్లేషణ జరిపి ఈఆర్సీకి నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఎన్పీడీసీఎల్‌ మాత్రమే 2016–17కి సంబంధించిన మరణాలపై విశ్లేషణ జరిపి నివేదికలో నమోదు చేసింది. దాని ప్రకారం ఆ ఏడాది సంస్థ పరిధిలో 276 మంది విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డారు. అందులో 124 మంది (45 శాతం) శాఖాపర కారణాలతో, మరో 152 మంది (55 శాతం) వినియోగదారుల అజాగ్రత్తతో మృతి చెందారు.

యమపాశం ఏబీ స్విచ్‌!
ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద విద్యుత్‌ సరఫరాను నిలిపేయడానికి, తిరిగి సరఫరా ప్రారంభించడానికి 11 కేవీ ఎయిర్‌ బ్రేక్‌ (ఏబీ) స్విచ్‌ కేబుల్‌ ఇన్సులేటర్‌ పరికరాన్ని వినియోగిస్తారు. ఎన్పీడీసీఎల్‌ పరిధిలో గతేడాది ఈ ఏబీ స్విచ్‌ విఫలం కావడం వల్లే ఏకంగా 43 మంది బలయ్యారు. ఇక హెచ్‌టీ, ఎల్‌టీ విద్యుత్‌ తీగలు తెగిపడటం కారణంగా మరో 36 మంది మరణించారు. 11 కేవీ, 6.6 కేవీ (సింగిల్‌ ఫేజ్‌) జంపర్‌లు విఫలమవడంతో 12 మంది మృతి చెందారు.

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు షాక్‌ గండం
విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కూడా విద్యుత్‌ ప్రమాదాల్లో పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు.ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 2016–17లో 320 మంది కరెంట్‌షాక్‌తో మృత్యువాత పడగా.. అందులో 28 మంది ఔట్‌ సోర్సింగ్‌ విద్యుత్‌ ఉద్యోగులు, ఒకరు రెగ్యులర్‌ విద్యుత్‌ ఉద్యోగి ఉండడం గమనార్హం.

తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో..
ఎన్పీడీసీఎల్‌ గణాంకాల ప్రకారం.. వినియోగదారుల పొరపాట్లు, అజాగ్రత్తల కారణంగా జరిగిన విద్యుత్‌ ప్రమాదాల్లో 276 మంది మరణించారు.
విద్యుత్‌ సర్వీసు వైరుకు ఆధారంగా వినియోగించే గాల్వనైజ్డ్‌ ఐరన్‌ (జీఐ) తీగల కారణంగా అత్యధికంగా 37 మంది మృతి చెందారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సరైన అవగాహన లేక జీఐ తీగల మీద బట్టలు ఆరేస్తున్నారని, దాంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
పొలాల్లో బోర్లు/మోటార్ల వద్ద సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో జరిగిన విద్యుత్‌ ప్రమాదాల్లో 35 మంది బలయ్యారు.
విద్యుత్‌ సరఫరా చేసే సర్వీస్‌ వైర్ల చుట్టూ ఉండే ఇన్సులేషన్‌ (ప్లాస్టిక్‌ కవచం) దెబ్బతినడంతో జరిగిన ప్రమాదాల్లో 31 మంది మరణించారు.
ఇళ్లలో విద్యుత్‌ పరికరాల వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మరో 28 మరణించారు. ఇందులో పలువురు సెల్‌ఫోన్‌ చార్జర్లు పేలడం కారణంగా మృతి చెందారు.
అనధికారికంగా విద్యుత్‌ స్తంభాలు ఎక్కడం వంటివాటి కారణంగా 17 మంది మృత్యువాత పడ్డారు.

వినియోగదారుల నిర్లక్ష్యంతోనే..
వినియోగదారుల నిర్లక్ష్యం, అజాగ్రత్తతోనే అధిక విద్యుత్‌ ప్రమాదాలు, మరణాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించాలనే తొందరపాటుతో కొంతమంది స్థానికులు ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద స్వయంగా మరమ్మతులు చేస్తున్నారు. కానీ విద్యుత్‌ సరఫరాను నిలిపేసేందుకు ఏబీ స్విచ్‌లను సరిగా ఆపరేట్‌ చేయలేక ప్రమాదాల బారినపడుతున్నారు. విద్యుత్‌ సిబ్బంది వచ్చే వరకు ఆగకుండా స్వయంగా మరమ్మతులు చేస్తుండటంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. సిబ్బంది నిర్లక్ష్యంతో కూడా కొన్నిచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే కొందరు నేరుగా విద్యుత్‌ తీగలకు కొండీలు వేసి.. దొంగతనంగా విద్యుత్‌ వాడుకుంటున్నారు. అలా వేసిన కొండీల వద్ద మిరుగులు (స్పార్క్స్‌) వచ్చి విద్యుత్‌ తీగలు తెగిపడే ప్రమాదం ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చు. – ఎ.గోపాల్‌రావు, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ 

షాకింగ్‌ డెత్స్‌..

Advertisement

తప్పక చదవండి

Advertisement