'చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం'

28 Jun, 2015 00:25 IST|Sakshi
'చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం'

ఆదిలాబాద్ : ఓటుకు కోట్లు’ వ్యవహరంలో అడ్డంగా దొరికిన చంద్రబాబు.. ఈ కేసు నుంచి బయట పడేందుకు కేంద్రం పెద్దల శరణుజోచ్చాడని, ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి విమర్శించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు ఆయన హైదరాబాద్‌లో సెక్షన్ 8ను తెరపైకి తెస్తున్నారని, చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న కొన్ని మీడియా కూడా సెక్షన్ 8పై లేనిపోని రాద్దాంతం చేస్తోందని ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్నతో కలిసి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడారు.

ఈ కేసులో ఏసీబీ పకడ్బందీగా విచారణ చేపట్టిందని అన్నారు. తప్పించుకునేందుకు చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కుల చేసిన జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఈ కేసును కేంద్ర ఎన్నికల సంఘం కూడా తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. ధర్మపురిలో కేసీఆర్ పుష్కరస్నానం ఈ పుష్కరాల్లో సుమారు ఆరు నుంచి ఎనిమిది కోట్లు మంది భక్తులు పుణ్యస్నానాలు చేసే అవకాశాలున్నాయని, ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోందని ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 106 ఘాట్ల నిర్మాణం చేపట్టామని, 80 శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు.

ఈ పనుల్లో నాణ్యత లోపిస్తే విజిలెన్స్, క్యూసీ వంటి సంస్థలతో విచారణ చేపడతామని కాంట్రాక్టర్‌లను హెచ్చరించారు. పుష్కర స్నానం ఆచరించేందుకు భద్రాచలానికి నాగసాదువులు వచ్చే అవకాశాలున్నాయని, ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పుష్కరాల్లో రెండు హెలిక్యాప్టర్‌లను కూడా వినియోగిస్తామని చెప్పారు. హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రత్యేక రైళ్లు నడపాలని ఆ శాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశామన్నారు. సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా ధర్మపురిలో పుష్కర స్నానం చేస్తారని ప్రకటించారు.

అలాగే ఈ పుష్కరాలకు రాష్ట్రపతి, ప్రధానిని ఆహ్వానిస్తామన్నారు. ఇండ్ల నిర్మాణానికి విదేశీ కంపెనీలు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు బెడ్‌రూంల గృహ ల నిర్మాణానికి విదేశీ కంపెనీలు ముందుకోస్తున్నాయని ఐ.కె.రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది 50 వేల గృహాలను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే రెండు లక్షల గృహాల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. మున్సిపాలిటీల్లో జీ ప్లస్ 1, జీ ప్లస్ 2తో ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. విలేకరుల సమావేశంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, టీఆర్‌ఎస్ పార్టీ పశ్చిమ జిల్లా అధ్యక్షులు లోక భూమారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు