వరుస భేటీలతో అమిత్‌ షా బిజీబిజీ..

13 Jul, 2018 19:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో పార్టీ పటిష్టమే లక్ష్యంగా బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ నేతలతో వరుస భేటీలతో బిజీబిజీగా గడిపారు. ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదని, అన్ని స్ధానాల్లోనూ ఒంటరిగానే బరిలో దిగుతామని శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఇటీవల కేసీఆర్‌, కేటీఆర్‌లు కలవడానికి ఎలాంటి ప్రాధాన్యతా లేదని, అవి మామూలుగా జరిగేవేనని తేల్చిచెప్పారు. ఇక 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలన్నింటినీ చుట్టి వచ్చేలా 119 యాత్రలతో కొద్ది మంది సభ్యులతో బైక్‌ యాత్రలు చేపట్టాలని ఆదేశించారు. పార్టీలో నేతల చేరికలను ప్రోత్సహించాలని, కేవలం రాజకీయ నాయకులే కాకుండా రాజకీయేతర రంగాల్లో పేరున్న వారిని పార్టీలోకి ఆకర్షించాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పిలుపు ఇచ్చారు. 


అరవింద్‌, రాజాసింగ్‌లతో భేటీ
నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న ధర్మపురి అరవింద్‌తో అమిత్‌ షా కొద్దిసేపు ముచ్చటించారు. ఆయన చేపడుతున్న సేవా, రాజకీయ కార్యక్రమాలు, సోషల్‌ మీడియా ప్రచారం గురించి అడిగి తెలుసుకున్నారు.నిజామాబాద్‌లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలనీ, అవసరమైతే మరోసారి భేటీ కావాలని సూచించారు. మరోవైపు ఎమ్మెల్యే రాజాసింగ్‌తోనూ షా ముచ్చటించారు. రాజాసింగ్‌ ప్రణాళిక ఏమిటో తనకు మెయిల్‌ చేయాలని కోరారు. రాజకీయంగా ఆయన కార్యక్రమాలు పార్టీకి ఎలా ఉపయోగపడతాయో తనకు నివేదించాలని, ఏయే నియోజకవర్గాల్లో రాజాసింగ్‌ ప్రభావం ఉంటుందో చెప్పమని సూచించారు. పార్టీలో ప్రతి ఒక్కరికీ పనిఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.


ఎన్నికలకు ముందే మందిర్‌..
ఆరెస్సెస్‌, వివిధ సంఘ్‌ పరివార్‌ సంస్ధలతో జరిగిన సమావేశంలో అయోధ్య రామాలయ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు ముందే రామాలయ నిర్మాణం జరుగుతుందని సంఘ్‌ సభ్యులకు అమిత్‌ షా భరోసా ఇచ్చారు. సుప్రీం కోర్టులో ఈ అంశంపై విచారణ జరుగుతున్నదని సభ్యులకు వివరించారు.

మరిన్ని వార్తలు