సభ్యత... జాగ్రత్త!

20 Dec, 2018 08:15 IST|Sakshi

న్యూ ఇయర్‌ పార్టీలు శ్రుతిమించేలా నిర్వహించొద్దు

అవాంఛనీయ ఘటనలకు నిర్వాహకులే బాధ్యులు

హోటళ్లు, పబ్‌ల నిర్వాహకులకు స్పష్టం చేసిన సీపీ

సాక్షి, సిటీబ్యూరో: న్యూ ఇయర్‌ పార్టీల విషయంలో సభ్యత, భద్రత మరువద్దని నిర్వాహకులకు నగర పోలీసులు స్పష్టం చేశారు. ఇతరులకు ఇబ్బంది కలుగకుండా వీటిని నిర్వహించుకోవాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయడానికి నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ బుధవారం హోటళ్లు, పబ్స్, క్లబ్స్, బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమాల నిర్వహణకు నిర్ణీత సమయం ముందు దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని కొత్వాల్‌ స్పష్టం చేశారు. రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే ఈవెంట్స్‌ నిర్వహించాలని పేర్కొన్నారు. కార్యక్రమాలకు వచ్చే ఆర్టిస్టులు, డీజేలకూ నింధనలున్నాయి. వీరి వస్త్రధారణ , హావభావాలు, పాటలు తదితరాల్లో ఎక్కడా అశ్లీలం, అసభ్యతలకు తావుండకూడదు. అక్కడ ఏర్పాటు చేసే సౌండ్‌ సిస్టం నుంచి వచ్చే ధ్వని తీవ్రత 45 డెసిబుల్స్‌ మించకూడదు. న్యూ ఇయర్‌ కార్యక్రమాల్లో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగానికి తావు లేకుండా చూడాలి. వీటిని సేవించి వచ్చే వారినీ హోటల్స్, పబ్స్‌ నిర్వాహకులు అనుమతించకూడదు. యువతకు సంబంధించి ఎలాంటి విశృంఖలత్వానికి తావు లేకుండా, మైనర్లు పార్టీలకు రాకుండా నిర్వాహకులు చూసుకోవాలి.

పబ్‌లు, హోటళ్ల  నిర్వాహకుల సమావేశంలో మాట్లాడుతున్న అంజనీకుమార్‌
బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహుతులకు ఇబ్బందులు కలిగించినా వారితో పాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు తప్పవు. ఎక్సైజ్‌ అధికారులు అనుమతించిన సమయాన్ని మించి మద్యం సరఫరా చేయకూడదు. జనసమర్థ, బహిరంగ ప్రాంతాల్లో టపాకులు పేల్చకూడదు. నిర్ణీత ప్రదేశాల్లో అవసరమైన సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సింది. మద్యం తాగి వాహనాలు నడిపేతే కలిగే దుష్ఫరిణామాలు, చట్ట ప్రకారం వారిపై తీసుకునే చర్యల్ని వివరిస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలి. మద్యం తాగిన వారు వాహనాలు నడపకుండా ఉండేలా ‘డిజిగ్నేటెడ్‌ డ్రైవర్‌ ఫర్‌ ది డే’ అంశాన్ని వారికి వివరించాల్సి ఉంటుంది. ఈ సమావేశం అనంతరం కొత్వాల్‌ అంజనీకుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ... ‘న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌పై స్టార్‌ హోటల్స్, పబ్స్, రెస్టారెంట్స్, ఫంక్షన్‌ హాళ్లు తదిరాల యజమానులతో సమావేశం నిర్వహించాం. ఈ ఏడాదీ రాత్రి ఒంటి గంట వరకే అనుమతి. ఆ తర్వాత నిర్వహించకూడదు. 100 మంది కంటే ఎక్కువ మంది హాజరయ్యే కార్యక్రమాలకు కచ్చితంగా సీసీ కెమెరాలు ఉండాలి. పార్కింగ్‌ ప్లేసులు ప్రొవైడ్‌ చెయ్యడంతో పాటు అక్కడా వీటిని ఏర్పాటు చేయాలి. వాలంటీర్లు, ప్రై వేట్‌ సెక్యూరిటీ గార్డులు, ట్రాఫిక్‌ నిర్వహణ చేసే వారు కచ్చితంగా ఉండాల్సిందే. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఫైర్‌ సేఫ్టీకి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిందే. చిన్నారులు, మైనర్లు ఈ పార్టీలకే అంశంపై ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. మైనర్లకు మద్యం సరఫరా చేయకూడదు. డ్రగ్స్‌ వినియోగంపై కన్నేసి ఉంచాలి. ఈ చర్యలు కచ్చితంగా తీసుకుంటామని ఆయా యాజమాన్యాలు హామీ ఇచ్చాయి’ అని అన్నారు. 

రాష్ట్రపతి రాక నేపథ్యంలో...
‘రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది కోసం 21న వస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు వచ్చి బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌కు వెళ్తారు. నాలుగు రోజులు ఉండే ఆయన 6న ఓ జిల్లాకు, ఆపై కొన్ని పర్యటనలు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రపతి నిలయం వద్ద బందోబస్తు, భద్రత ఏర్పాటుతో పాటు ట్రాఫిక్‌ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే చీఫ్‌ సెక్రటరీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్ర–తెలంగాణ సబ్‌ ఏరియా కమాండెంట్‌తో చర్చలు జరిపాం. ఒక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిని కమాండింగ్‌ ఆఫీసర్‌ ఏర్పాటు చేశాం. బేగంపేట, మహంకాళి ఏసీపీలు కో–ఆర్డినేషన్‌ బాధ్యతలు నిర్వర్తిస్తారు. రాష్ట్రపతి భవన్‌ వద్ద వాచ్‌ టవర్స్, ఆరŠడ్మ్‌ గార్డ్‌ ఏర్పాటు చేసి పెట్రోలింగ్‌ ముమ్మరం చేస్తున్నాం. సమాచార మార్పిడి కోసం 65 మ్యాన్‌ప్యాక్స్‌ ఇచ్చాం. బుధవారం సాయంత్రం రిహార్సల్స్‌ సై తం పూర్తి చేశాం’ అని అంజనీ కుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు