బైసన్‌ పోలోపై కేంద్రం విముఖత!

12 Jan, 2018 01:32 IST|Sakshi

   ►  మైదానం ఇవ్వొద్దంటూ పీఎంవోకు ఫిర్యాదులు 
   ►  దాంతో రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరిన వైనం 
   ►  ప్రత్యామ్నాయంగా 543 ఎకరాలివ్వాలని షరతు 
   ►  రూ. 1,100 కోట్లు,
   ►  ఏటా నిర్వహణ చార్జీలూ 
   ►  చెల్లించాలని కొర్రీ

సాక్షి, హైదరాబాద్‌ : కొత్త సచివాలయ నిర్మాణానికి మరో మెలిక పడింది. సికింద్రాబాద్‌లోని బైసన్‌ పోలో గ్రౌండ్‌ను అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేస్తోంది. మైదానం ఇవ్వొద్దంటూ ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం గ్రీవెన్స్‌ సెల్‌కు కొంతకాలంగా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వాటిలో 13 ఫిర్యాదులకు వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి పీఎంవో తాజాగా లేఖ రాసింది. దీంతో కేంద్రానికి వివరణ ఇచ్చేందుకు రహదారులు, భవనాల శాఖ మల్లగుల్లాలు పడుతోంది.

మరోవైపు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలూ రక్షణ శాఖ భూములివ్వాలని ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు భూములిస్తే.. మిగిలిన రెండు రాష్ట్రాలకూ ఇవ్వాల్సి ఉంటుందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే ఈ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగానే కేంద్రం పెండింగ్‌లో పెడుతోందని ప్రభుత్వ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త షరతులు, రకరకాల కొర్రీలు తెరపైకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.  

భూములిచ్చేందుకు గతేడాది ఓకే  
బైసన్‌ పోలోతో పాటు జింఖానా గ్రౌండ్‌కు చెందిన 60.87 ఎకరాలు.. జాతీయ, రాష్ట్ర రహదారుల విస్తరణ, గఫ్‌ రోడ్డుకు ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి 200.58 ఎకరాల భూమి అప్పగించాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరుతోంది. ప్రత్యామ్నాయంగా జవహర్‌నగర్‌లో 500 ఎకరాల భూమి కేటాయించడంతోపాటు మౌలిక సౌకర్యాలు కల్పించే ప్రతిపాదనలు పంపింది. ఆ ప్రతిపాదనలపై రక్షణ శాఖ ఇప్పటికే రాష్ట్ర అధికారులతో ఢిల్లీలో ఓసారి సమావేశమైంది. హైదరాబాద్‌కు వచ్చి భూములను సైతం పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు భూములు అప్పగించేందుకు గతేడాది నవంబర్‌లోనే సంసిద్ధత వ్యక్తం చేసింది.  

వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం 
3 నెలలుగా నాన్చివేత «ధోరణి అనుసరించిన రక్షణ శాఖ.. ఇటీవలే కొన్ని షరతులు విధించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. 500 ఎకరాలు సరిపోదని, 543 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలని, దాదాపు రూ. 1,100 కోట్లు చెల్లించాలని షరతు విధించినట్లు తెలిసింది. వీటితో పాటు నిర్వహణ పేరుతో ఏటా చార్జీలు చెల్లించాలని మరో మెలిక పెట్టినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

అంత మొత్తం చెల్లించి భూములు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని అంచనాలు వేసుకుంటోంది. నిధులు చెల్లించేందుకు సిద్ధపడినా ఏటా నిర్వహణ చార్జీలు చెల్లించాలంటూ రక్షణ శాఖ పెట్టిన షరతులు అనుచితంగా ఉన్నాయని వెనుకడుగేసింది. అందుకే కొత్త సచివాలయం నిర్మాణాన్ని కొంతకాలం వాయిదా వేయాలని సూచనప్రాయంగా నిర్ణయించింది. కేంద్రం నుంచి సానుకూలత వచ్చే వరకు తొందరేమీలేదని ఈ విషయాన్ని అధికారులు తేలిగ్గా తోసిపుచ్చుతున్నారు.


 

మరిన్ని వార్తలు