‘అభయ’మివ్వని ‘ఆసరా’

28 Aug, 2015 04:23 IST|Sakshi
‘అభయ’మివ్వని ‘ఆసరా’

ముకరంపుర : ‘కొండనాలికకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది’ అన్నట్లు... ఆసరా కోసం ఆశపడిన వృద్ధులకు అభయహస్తం కూడా దూరమయ్యింది. అనాథలకు అండగా ఉంటామంటున్న సర్కారు ఏ దిక్కూలేని ఇలాంటి పండుటాకులను మాత్రం పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వంలో జిల్లాలో 41,660 మంది అభయహస్తం పింఛన్‌దారులు ఉండగా, వీరికి ప్రతీనెల రూ.500 పింఛన్ వచ్చేది. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకంలో 60 ఏళ్లు దాటిన మహిళా గ్రూపు సభ్యులకు ప్రతినెలా వచ్చే పింఛన్‌తో ఆర్థిక భరోసా కలిగేది. మహిళలు సంవత్సరానికి రూ.365 చొప్పున పదేళ్లపాటు చెల్లించినట్లయితే రూ.3650 అవుతుంది. అంతే మొత్తంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. 60 ఏళ్ల దాటిన తర్వాత వారికి నెలకు కనీసం రూ.500 చొప్పున వారు మరణించే దాకా పింఛన్ వస్తుంది.

 ఆసరాతో మొదటికే మోసం...
 టీఆర్‌ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన ఆసరా పథకంలో వృద్ధులకు, వితంతువులకు రూ.వెరుు్య, వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్ చెల్లిస్తున్న విషయం తెలిసిందే. దీంతో జిల్లాలోని 41,660 మంది అభయహస్తం పింఛన్‌దారులు ఆసరా కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 20,672 మందిని ఆసరాకు అర్హులుగా గుర్తించగా, మిగిలిన 20,988 మందిని అభయహస్తం పింఛన్ లబ్ధిదారులగానే ఉంచారు. ఆసరాకు ఎంపికైన 20,672 మం ది లబ్ధిదారులకు సంబంధించిన డాటాబేస్ పూర్తి చేసి ఊరించారు. అనంతరం ఆధార్ అనుసంధానం, పరిశీలన పేరిట ఆసరాకు ఎంపికైన వారిలో 70 శాతానికి పైగా తిరస్కరించి తొలగించారు.

అంటే దాదాపు 15 వేల మంది అటు అభయహస్తానికి, ఇటు ఆసరా పింఛన్‌కు దూరమయ్యూరు. గత తొమ్మిది నెలలుగా వీరికి ఎటువంటి పింఛన్ లేకుండా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. 20,988 మంది అభయహస్తం పింఛన్‌దారులకు కూడా ప్రభుత్వం ఆర్నెల్లపాటు ఊరించి మార్చి చివరిలో ఒకేసారి ఆరు నెలల పింఛన్ రూ.3వేలు మంజూరు చేసింది. ఆ తర్వాత నుంచి ప్రతీనెల రూ.500 చొప్పున చెల్లించాల్సి ఉండగా, సర్కారు ఆ విషయూన్నే మర్చిపోరుుంది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలలకు సంబంధించిన అభయహస్తం పింఛన్లను పెండింగ్‌లో పెట్టింది.

దీంతో అభయహస్తం లబ్ధిదారులు సైతం ఇకమీదట తమకు పింఛన్ వస్తుందో లేదోననే ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు అభయహస్తం పథకాన్ని ఎత్తివేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మంత్రి కేటీఆర్‌తో కలిసి కలెక్టరేట్‌లో గతంలో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. మార్చి నెల నుంచి అభయస్తం పింఛన్ నిలిచిపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. మలిసంధ్యలో ఆదుకుంటుందనుకున్న అభయహస్తం అందకపోవడం, ఆసరాకు దూరం కావడంతో వృద్ధుల పరిస్థితి అగమ్యగోచరంగా తయూరైంది.

మరిన్ని వార్తలు