ఉద్యోగ విరమణ రోజే పదోన్నతి

1 Jan, 2019 08:29 IST|Sakshi

సీపీ చొరవతో దక్కిన అరుదైన గౌరవం  

ఖమ్మంక్రైం: ఆ ఏఎస్‌ఐ సోమవారం ఉద్యోగ విరమణ పొందనున్నాడు. అయితే ఎప్పుడో ఎస్‌ఐగా పదోన్నతి రావాల్సి ఉన్నా రాలేదు. తాను ఉత్తమ సేవలు అందించినా చివరకు ఏఎస్‌ఐగానే ఉద్యోగ విరమణ పొందుతున్నానని సదరు ఏఎస్‌ఐ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. చివరకు ఉద్యోగ విరమణ పొందే రోజు కూడా వచ్చింది. అయితే ఆ ఏఎస్‌ఐ తాను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఎస్‌ఐగా పదోన్నతి సాధించి మరీ ఉద్యోగ విరమణ పొందుతున్నాడని తెలిసి ఉప్పొంగిపోయాడు. పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ ప్రత్యేక చొరవతో అది సాధ్యం అయింది.

వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లో ఏఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఫరీద్‌బాబు సోమవా రం ఉద్యోగ విరమణ పొందనున్నారు. అయితే ఆయన ఇప్పటికే ఎస్‌ఐగా పదోన్నతి పొందాల్సి ఉండగా బాగా ఆలస్యం కావడంతో ఏఎస్‌ఐగానే విరమణ పొందుతానని భావించాడు. అయితే ఆయన విధి నిర్వహణలో అందించిన సేవలకు గాను సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ ప్రత్యేక చొరవతో ఆయనకు ఎస్‌ఐగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

అనంతరం ఆయనకు సీపీ తన కార్యాలయంలో ఎస్‌ఐ పట్టీ తొడిగి పూలమాల వేసి సన్మానించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ విరమణ తన వృత్తికే కాని తన వ్యక్తిత్వానికి కాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐగా ఉద్యోగ విరమణ పొందిన ఫరీద్‌బాబు సీపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్‌ అధికారి వినీత్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు