నిర్బంధాలకు నిరసనగా 5న బంద్‌

1 Feb, 2018 03:31 IST|Sakshi

మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ లేఖ  

చర్ల(భద్రాచలం): మావోయిస్టుల నిర్మూలన పేరుతో పాలకులు ప్రజలపై చేస్తున్న ఫాసిస్టు నిర్బంధానికి వ్యతిరేకంగా దండకారణ్యం, తెలంగాణలో ఈనెల 5న బంద్‌ పాటించాలని సీపీఐ(మావోయిస్టు) దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు స్పెషల్‌ జోనల్‌ కమిటీ, రాష్ట్ర అధికార ప్రతినిధులు వికల్స్, జగన్‌ పేరిట బుధవారం లేఖ విడుదలైంది. అడవుల్లోని సహజ వనరులను దోచుకునేందుకు ఆదివాసీలను ఖాళీ చేయించాలని కేంద్రం కుట్ర పన్నిందని, ‘సమాధాన్‌ 2022’పేరుతో కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో 2 లక్షల మంది పోలీసు, పారామిలటరీ బలగాలను మోహరించి దాడులకు పాల్పడుతున్నాయని ఆ లేఖలో ఆరోపించారు.

ఈ క్రమంలో జరిగిన ఆపరేషన్‌ ప్రహార్‌–2లో 2017 ఆగస్టు 16 నుంచి 2018 జనవరి 10 వరకు దండకారణ్యంలో 60 మందిని బూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారని పేర్కొన్నారు. మెట్టగూడెం గ్రామం వద్ద పొలంలో పని చేస్తున్న మడవి సోమ్డా అనే రైతును ఎటువంటి హెచ్చరిక లేకుండా కాల్చి చంపారని, కన్నెమరక గ్రామస్తులపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారని తెలిపారు. పలు ప్రాంతాల్లో 20 మందిని అక్రమంగా అరెస్టు చేసి తప్పుడు కేసులు బనాయించి జైలులో పెట్టారని విమర్శించారు. పశ్చిమ బస్తర్‌ డివిజన్‌లోని గంగులూరు ఏరియాలో కేంద్ర, రాష్ట్ర బలగాలు ఇటీవల దాడి చేసి ముగ్గురిని మావోయిస్టుల పేరుతో కాల్చి చంపాయని, అందులో ఓ 13 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడని పేర్కొన్నారు.  

తెలంగాణలో నిర్బంధం.. 
తెలంగాణలో గోదావరిపై కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లకు మావోయిస్టుల వల్ల ముప్పు ఉందని ప్రభుత్వం బూటకపు ప్రచారం చేస్తూ గోదావరి తీరమంతటా పోలీసు క్యాంపులు ఏర్పాటు చేసి నిర్బంధాన్ని పెంచిందని లేఖలో విమర్శించారు. తుపాకులగూడెం, మేడిగడ్డ నుంచి గోలివాడ వరకు పోలీసు క్యాంపులు వెలిశాయని, గోదావరి వెంట డ్రోన్‌ల సహాయంతో నిఘా కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న ఈ చర్యలకు నిరసనగా తాము పిలుపునిచ్చిన బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు.   

మరిన్ని వార్తలు