రిక‘వర్రీ’

25 Aug, 2014 03:03 IST|Sakshi
రిక‘వర్రీ’

 జిల్లాలో పావలా వడ్డీ రుణాలందించిన బ్యాంకులకు రికవరీ బెడద పట్టుకుంది. తీసుకున్న లింకేజీ రుణాలు తిరిగి చెల్లించేందుకు మహిళా సంఘాలు వెనకడుగు వేస్తున్నాయి. దీంతో కొత్త రుణాలు మంజూరు ఆగిపోగా.. రుణాలు చెల్లించిన సంఘాలకు కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. రైతుల రుణమాఫీ తరహాలోనే పావలా వడ్డీ రుణాలు మాఫీ అవుతాయన్న ఉద్దేశంతో సంఘాలు రుణాలు చెల్లించకుండా మొండికేసినట్టు తెలుస్తోంది.
 
 నీలగిరి  : జిల్లా వ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలు 59,600 ఉన్నాయి. ఈ మొత్తం సంఘాల్లో 2013-14కు గాను 29 వేల సంఘాలకు రూ.519 కోట్లు రుణాలు బ్యాంకర్లు ఇచ్చారు. దీంట్లో ఇప్పటి వరకు రూ.200 కోట్ల రుణాలను తిరిగి చెల్లించారు.  మిగిలిన రుణాలను సంఘాలు చెల్లించడం లేదు. రుణాలు తిరిగి చెల్లించాల్సిందిగా బ్యాంకర్లు సంఘాలకు నోటీసులు కూడా జారీ చేశారు.  డీఆర్‌డీఏ పీడీ అయితే ఏకంగా ‘సంఘదర్శిని’ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా రుణాలు చెల్లించాల్సిందిగా సంఘాలను కోరుతున్నారు.
 
 గామ సంఘాలు మొదలుకుని జిల్లా సమాఖ్య వరకు అన్ని సమావేశాల్లోనూ రుణాలు చెల్లించాల్సిందిగా కోరుతున్నా, ఫలితం కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో సంఘాల రుణాలు మాఫీ చేశారు కాబట్టి... ఇక్కడి ప్రభుత్వం కూడా మాఫీ చేస్తుందన్న ఆశతో సంఘాలు ఎదురుచూస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం సంఘాల రుణమాఫీ సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వలేదని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు నెత్తినోరు బాదుకుంటున్నా సంఘాలు మాత్రం పెడచెవిన పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఎప్పటికైనా పావలా వడ్డీ రుణాలు మాఫీ చేస్తాయన్న ధీమాను సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి.
 
 కొత్త రుణాలు ఇవ్వని బ్యాంకర్లు..
 గతంలో తీసుకున్న రుణాలు సంఘాలు చెల్లించకపోవడంతో కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. 2014-15కు గాను 32,506 సంఘాలకు రూ.803 కోట్ల రుణాల లక్ష్యాన్ని ఖరారు చేశారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆరు మాసాలు కావస్తున్నా, ఇప్పటివరకు కేవలం 4 వేల సంఘాలకు రూ.130 కోట్లు మాత్రమే ఇచ్చారు. డీఆర్‌డీఏ లెక్కల ప్రకారం ఇప్పటికే 6 వేల సంఘాలకు రూ.180 కోట్లు మంజూరు చేయాలి. కానీ రుణాల రికవరీ పడిపోవడంతో ఆ ప్రభావం కొత్త రుణాలపై పడింది.
 
 ఊసేలేని వడ్డీ బకాయిలు...
 వడ్డీలేని రుణాల పథకం కాబట్టి సంఘాల తరఫున ప్రభుత్వం వడ్డీ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెలా 10వతేదీలోగా సంఘాలకు ఖాతాలకు వడ్డీ జమకావాల్సి ఉంది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు నయాపైసా కూడా ప్రభుత్వం వడ్డీ విడుదల చేయలేదు. ఈ మొత్తం సుమారూ. 20 కోట్లు వరకు ఉంటుందని అధికారుల అంచనా. ఇదిగాక వడ్డీలేని పథకం ప్రారంభమైన కొత్తలో పాత బకాయి తాలుకు రూ.24 కోట్లు రావాల్సి ఉంది. బకాయిల మొత్తాన్ని సంఘాల నుంచి బ్యాంకర్లు బలవంతంగా రాబట్టుకున్నారు. కానీ ప్రస్తుతం నడుస్తున్న కాలానికి గాను ప్రభుత్వం వడ్డీ విడుదల చేయకపోవడంతో సంఘాలపై బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారు.
 
 పట్టించుకోని జిల్లా యంత్రాంగం
 గతంలో జిల్లా యంత్రాంగం డీఆర్‌డీఏ పనితీరు పట్ల ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండేది. ప్రసుత్తం ఆ భారం మొత్తాన్ని ప్రాజెక్టు డెరైక్టర్ మీదకు నెట్టివేయడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. సంఘాలు రుణాలు చెల్లించే విషయంలో జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం జిల్లా యంత్రాంగం బిజీబిజీగా ఉండడంతో డీఆర్‌డీఏ పట్ల అంత ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 
 రికవరీ కావట్లేదు
 ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణలో కూడా రుణా లు మాఫీ అవుతాయన్న ఉద్దేశంతో సంఘాలు రుణా లు చెల్లించడం లేదు. కొన్ని సంఘాలు తిరిగి చెల్లింపులు చేస్తున్నా...మిగిలిన సంఘాలు తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో ఆ ప్రభావం మిగతా వాటి మీద పడుతోంది. దీనిపై సంఘాలతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది బ్యాంకు లింకేజీ రుణాల మంజూరు ఫర్వాలేదు.
 - చిర్రా సుధాకర్, డీఆర్‌డీఏ,
 ప్రాజెక్టు డెరైక్టర్
 

మరిన్ని వార్తలు