భాస్కర్‌ది కూడా పరువు హత్యేనా..?

26 Sep, 2018 08:21 IST|Sakshi
మాట్లాడుతున్న మృతుడి తల్లి దీవెన , భాస్కర్‌ , నిషిత (ఫైల్ ఫోటో)

పంజగుట్ట: తన కుమారుడి మరణంపై ఎన్నో సందేహాలు ఉన్నాయని వాటిని నివృత్తిచేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న భాస్కర్‌ తల్లిదండ్రులు అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మృతుడి తండ్రి సత్యనారాయణ, తల్లి దీవెన, సోదరుడు సుదర్శన్, సోదరి సులోచన వివరాలు వెల్లడించారు. బోరబండ శ్రీరామ్‌నగర్‌లో ఉంటున్న భాస్కర్‌ (24) ఘట్‌కేసర్‌లోని నల్ల నర్సింహ్మా రెడ్డి కాలేజీలో బీఫార్మసీ పూర్తిచేశాడు. కాలేజీలో అతడికి మహబూబ్‌ నగర్‌ జిల్లా ఎనుగొండ గ్రామానికి చెందిన కర్రె నిషిత అనే యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. గత ఆగస్టులో నిషిత తన ప్రేమ విషయాన్ని వారి ఇంట్లో చెప్పింది.

దీంతో ఆగస్టు 19న నిషిత బాబాయ్‌ కొర్రమోని వెంకటయ్య భాస్కర్‌కు ఫోన్‌చేసి బెదిరించాడన్నారు. 20న నగరానికి వచ్చిన అతను తమను బోరబండ కమ్యునిటీహాల్‌కు పిలిపించి నిషితను మర్చిపోవాలని బెదిరించినట్లు తెలిపారు. మరుసటి రోజే నిషిత భాస్కర్‌కు ఫోన్‌చేసి మహబూబ్‌నగర్‌ వచ్చి తన కుటుంబ సభ్యులను ఒప్పించాలని కోరడంతో భాస్కర్‌ అక్కడికి వెళ్లాడన్నారు. మర్నాడు ఉదయం వెంకటయ్య తమకు ఫోన్‌చేసి భాస్కర్‌ మహబూబ్‌నగర్‌లో అపస్మారకస్థితిలో ఉన్నాడని, అతడిని తీసుకువెళ్లాలని చెప్పడంతో తాము అక్కడికి వెళ్లి చూడగా  అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు తెలిపారు. భాస్కర్‌ ఆగస్టు 23న మళ్లీ మహబూబ్‌ నగర్‌ వెళ్లాడని, అదేరోజు సాయంత్రం నిషిత బాబాయ్‌ ఫోన్‌ చేసి భాస్కర్‌ నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని,  జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నట్లు చెప్పడంతో తాము అక్కడకు వెళ్లేసరికి అతను మృతి చెంది ఉన్నాడన్నారు. 

ముమ్మటికీ హత్యే ..  
భాస్కర్‌ది ఆత్మహత్య కాదని..ముమ్మటికీ హత్యేనని వారు అరోపించారు. నిషిత కుటుంబం మున్నూరు కాపులని, తాము మాదిగ కులానికి చెందిన వారం కావడంతోనే పిలిపించి హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. వెంకటయ్య టీఆర్‌ఎస్‌ నాయకుడని, అతని భార్య కొర్రమోని వనజ కౌన్సిలర్‌గా కొనసాగుతందని, వారికి స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉన్నందునే దర్యాప్తును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆగస్టు 23న భాస్కర్‌ మరణిస్తే సెప్టెంబర్‌ 3న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ చేశారని, ఇప్పటివరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు