‘నిమ్స్‌’పై సందిగ్ధం..!

29 Aug, 2019 08:01 IST|Sakshi

ఓపీ సేవలు అందుతాయో లేదోనని అనుమానం..

కొనసాగించాలంటున్న జిల్లా ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు

ప్రారంభంనుంచి ఇప్పటివరకు సుమారు లక్షమంది రోగులకు అందిన వైద్యసేవలు

సాక్షి, యాదాద్రి: జిల్లాలోని బీబీనగర్‌ మండలం రంగాపురం వద్ద ఏర్పాటు చేసిన ఎయిమ్స్‌లో వైద్యవిద్యా తరగతులు ప్రారంభం కావడంతో నిమ్స్‌ (నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) సేవలపై సందిగ్ధం నెలకొంది. నిమ్స్‌లో ఇప్పటివరకు అందుతూ వచ్చిన ఓపీ సేవలు ఇకముందు కొనసాగుతాయా లేదా అని జిల్లా ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో బీబీనగర్‌ మండలం రంగాపూర్‌ వద్ద నిమ్స్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిమ్స్‌ ప్రాంగణంలోనే ఎయిమ్స్‌ ఏర్పాటుకు అంగీకరించారు. ఎయిమ్స్‌ వంటి జాతీయ స్థాయి ఆరోగ్య కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఇక్కడ రోగులకు సేవలందిస్తున్న నిమ్స్‌ ను ఎక్కడికి తరలిస్తారన్న సందిగ్ధం ఏర్పడింది.

2016లో ఓపీ సేవలు ప్రారంభం..
హైదరాబాద్‌లో గల నిమ్స్‌కు అనుబంధంగా బీబీనగర్‌లో నిమ్స్‌ ఓపీ సేవలను 2016 మార్చిలో ప్రారంభించారు. మూడేళ్లుగా నిమ్స్‌ ప్రాంగణంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో రోగులకు ఓపీసేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు లక్ష మంది రోగుల వరకు ఇక్కడ వైద్య పరీక్షలు, సేవలను పొందారు. జనరల్‌ మెడిసిన్, సర్జరీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, కార్డియాలజీ, అల్ట్రాసౌండ్, ఈసీజీ, ఫిజియోథెరపీ సేవలను అందుస్తున్నారు. నామమాత్రపు రుసుముతో అందుతున్న సేవలు రోగులకు ఎంతో ఉపయోగ కరంగా ఉన్నాయి.

నిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధమైన త రుణంలో ఎయిమ్స్‌ను కేంద్ర ప్రభుత్వం మం జూరు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ పనుల ను వెంటనే విరమించుకుంది. డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగుల నియామకానికి నోటిఫికేషన్‌లు జారీ చేసి ఆ తర్వాత వాటిని పక్కన పెట్టింది. అయితే ఇక్కడ ఓపీ సేవలు అందుతున్న క్రమంలోనే పూర్తిసా ్థయి వైద్యం అందించడానికి వసతుల కోసం రూ.10కోట్ల వరకు మంజూరు చేసి ఖర్చు చేశారు. ఈ క్రమంలోనే ఎయిమ్స్‌ మంజూరు కావడంతో ఇక ఇక్కడ నిమ్స్‌ సేవలు అందవేమోనన్న ఆందోళనలో రోగులు ఉన్నారు. అయి తే ఎయిమ్స్‌ వైద్యసేవలు అందించడానికి మరో ఏడాదికి పైగానే సమయం పట్టే అవకాశం ఉందని ఎయిమ్స్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 50మంది విద్యార్థులతోనే మెడికల్‌ కళాశాలను ప్రారంభించారు. ఎయిమ్స్‌ వైద్యం ప్రారంభమయ్యే వరకు నిమ్స్‌ వైద్యసేవలు కొనసాగించాలని వివిధ రాజకీ య పార్టీల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. 

నిమ్స్‌ సేవలు కొనసాగుతాయి
ఎయిమ్స్‌ వైద్యకళాశాల ప్రారంభమైనప్పటికీ నిమ్స్‌లో ఓపీసేవలు కొనసాగుతాయి. ఈ మేరకు ఎయిమ్స్‌ అధికారులు, నిమ్స్‌ అధికారులతో చర్చించాను. ప్రస్తుతం నిమ్స్‌లో అందుతున్న ఓపీ సేవలు జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ఇకముందు కూడా అవి అందుబాటులో ఉంచాలని నిర్ణయించాం.  
– అనితారామచంద్రన్, కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా 

మరిన్ని వార్తలు