కేకేకు చేదు అనుభవం.. గెటవుట్ నినాదాలు

4 Apr, 2017 16:47 IST|Sakshi
కేకేకు చేదు అనుభవం.. గెటవుట్ నినాదాలు

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ కేకే(కే కేశవరావు)కు చేదు అనుభవం ఎదురైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి అడుగుపెట్టిన ఆయనను విద్యార్థులు నిరసనలతో చుట్టుముట్టారు. కేకే గెటవుట్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో కాస్తంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓయూలో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు మంగళవారం కేకే యూనివర్సిటీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆర్ట్స్‌ కాలేజీలోని ప్రిన్సిపల్‌ చాంబర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఓయూ ఉత్సవాల కమిటీతో మాట్లాడి బయటకు వస్తుండగా అప్పటికే అక్కడ ఉన్న వివిధ విద్యార్థి సంఘాల నేతలు కేకేను చుట్టుముట్టారు.

తెలంగాణ వచ్చి టీఆర్ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ చేపట్టలేదని, ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదని, ఇచ్చిన నోటిఫికేషన్‌ కూడా వెనుకకు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. కేకే గెటవుట్‌ అంటూ ఆయనపైకి వందలాదిమంది విద్యార్థులు దూసుకెళ్లారు. అయితే, ఈ విషయాన్ని శాంతంగా మాట్లాడుకుందామని కేకే చెబుతున్నా వారు వెనుకకు తగ్గలేదు. దీంతో అప్రమత్తమైన కేకే భద్రతా సిబ్బంది, అక్కడ ఉన్న పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య చిన్నపాటి తోపులాట చోటుచేసుకుంది.

మరిన్ని వార్తలు