అంతర్గత ప్రతిభకే అందలం

12 Oct, 2023 01:45 IST|Sakshi

ఉన్నత విద్యలో కొత్త మూల్యాంకన విధానం

అసలైన నైపుణ్యం వెలికితీతకు వ్యూహం.. పాఠాలపై చర్చలు..

ప్రతి నెలా పరీక్షలు తరగతి గదిలో చురుకైన పాత్రకు మార్కులు

ఓయూ పీజీ విద్యార్థులకు ఈ ఏడాది నుంచే అమలు

వచ్చే ఏడాది నుంచి ఉన్నత విద్య మొత్తానికీ వర్తింపు

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నత విద్యలో మూల్యాంకన విధానం పూర్తిగా మారబోతోంది. సంప్రదాయ పద్ధతులకు ఇక స్వస్తి పలకనున్నారు. మార్కులే కొలమానం కాకుండా, విద్యార్థిలోని నిజమైన ప్రతిభను వెలికి తీసి, దాని ఆధారంగా అతని క్రెడిట్స్‌ నిర్ణయిస్తారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని పోస్టు– గ్రాడ్యుయేట్‌ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరంలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలకు విస్తరించాలని అధికారులు నిర్ణయించారు.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తును ఓయూ మొదలు పెట్టింది. అధ్యాపకులకు అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యార్థులను కూడా ముందుగానే సమాయత్తం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఓయూ పరిధిలో పీజీ కోర్సులు చేసే దాదాపు 30 వేల మంది సరికొత్త మూల్యాంకన పరిధిలోకి వస్తారు. కొత్త మూల్యాంకన విధానంపై ఉన్నత విద్యా మండలి గత ఏడాది ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌ (ఐఎస్‌బీ) చేత అధ్యయనం చేయించింది. ఈ సంస్థ ఇచ్చిన సిఫారసులను మండలి ఆమోదించి అమల్లోకి తెస్తోంది. 

ప్రతిభకు అన్నివిధాలా పరీక్ష
ఇప్పటివరకూ ఏడాది మొత్తం చదివిన విద్యకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటిల్లో వచ్చే మార్కులే ప్రతిభకు కొలమానాలు. కొత్త విధానంలో విద్యార్థి అంతర్గత నైపుణ్యాన్ని గుర్తిస్తారు. ఈ ప్రక్రియలో బోధకులు అత్యంత కీలకంగా మారనున్నారు. విద్యార్థి ఏ కోర్సులో చేరినప్పటికీ ఏడాది పొడవునా అతను అనుసరించే విధానాలనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఇందులో అటెండెన్స్‌కు సైతం కొన్ని మార్కులుంటాయి. ప్రతి చాప్టర్‌లో పాఠాన్ని విద్యార్థి ఏమేర అర్థం చేసుకున్నాడో గుర్తించాల్సి ఉంటుంది. దీనికోసం విద్యార్థులకు అధ్యాపకులు కొన్ని ప్రశ్నలు వేస్తారు.

సబ్జెక్టుపై పట్టు కోసం తరగతి గదిలో స్వల్పకాలిక చర్చలు నిర్వహిస్తారు. నెలవారీ పరీక్షలూ నిర్వహిస్తారు. విద్యార్థి తాను చదివే సబ్జెక్టుల్లో ఎక్కడ ప్రతిభ కలిగి ఉన్నాడు? ఎక్కడ వెనుకబడ్డాడు? అనేది గుర్తించి మార్కులు వేస్తారు. మరోవైపు అనుభవ పూర్వక విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విద్యార్థి థియరీ కాకుండా, ప్రాక్టికల్‌గా తన ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మెరుగైన ఫలితాలిస్తాయని పారిశ్రామిక రంగం కోరుకునే నిపుణులు తయారయ్యే వీలుందని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది.

ప్రతిభను వెలుగులోకి తేవడానికే : ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి (ఉన్నత విద్య మండలి ఛైర్మన్‌)
మూల్యాంకన విధానంలో మార్పుల వల్ల విద్యార్థి కేవలం థియరీకే పరిమితం అయ్యే అవకాశం లేదు. అతనిలో అంతర్గతంగా ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉన్నత విద్య చేసినా, ఉపాధి కోసం వెతుక్కునే పరిస్థితి ఉండకూడదనే ఈ సరికొత్త విధానం అనుసరిస్తున్నాం. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నాకే ముందుకెళ్ళాం. మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. 

అధ్యాపకులనూ సన్నద్ధం చేశాం : ప్రొఫెసర్‌ రవీందర్‌ (ఓయూ వీసీ)
ఈ ఏడాది పీజీ కోర్సుల్లో కొత్త మూల్యాంకన విధానం అమలు చేస్తున్నాం. దీనికి అనుగుణంగా అధ్యాపకులను సన్నద్ధం చేశాం. క్లాసులు ప్రారంభమైనప్పట్నుంచే ఈ ప్రక్రియ మొదలవుతుంది. సిసలైన ప్రతిభ వెలికి తీసే విధానం కాబట్టి విద్యార్థులకూ మేలు జరుగతుంది.   

మరిన్ని వార్తలు