చెప్పలేకపోయా.. క్షమించండి!

29 Aug, 2014 00:00 IST|Sakshi
చెప్పలేకపోయా.. క్షమించండి!

- అభివృద్ధి కోసమే బీజేపీలో చేరా
- కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి

సంగారెడ్డి మున్సిపాలిటీ: పార్టీ మారే విషయంపై మీతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. అంత సమయం లేకపోవడంతో చెప్పలేకపోయా.. పెద్ద మనసుతో క్షమించండి. కాంగ్రెస్ తరఫున టికెట్ రాకపోవడంతో బీజేపీ నాయకులు నన్ను ఆహ్వానించి పోటీ చేయమన్నారు. దీంతో ఆ పార్టీలో చేరా’ అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని పీఎస్‌ఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన టీజేఆర్ యువసేన, కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం అభివృద్ధిని కాంక్షించి మాత్రమే పార్టీ మారానని తెలిపారు.

దీనికి తన మిత్రులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అందరూ సహకరించాలని కోరారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ కార్యకర్తలను విస్మరించలేదన్నారు. కానీ బీజేపీలో చేరే సమయంలో కార్యకర్తల అభిప్రాయం తీసుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. నియోజకవర్గంలో తన కార్యకర్తలతో పాటు బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు బీజేపీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో ఐకమత్యంగా పని చేసి సత్తాచాటాలన్నారు.

మెదక్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోడీ సహకారం ఎంతో అవసరమని తెలిపారు. టికెట్ కోసమే పార్టీ మారానంటూ టీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని పేర్కొన్నారు. గత జనరల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున కొండా సురేఖ, మైనంపల్లి హన్మంతరావుకు పార్టీ టికెట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక తాను ద్రోహిని ఎలా అవుతానని జగ్గారెడ్డి ప్రశ్నించారు. జహీరాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందిన బీబీపాటిల్ ఏ ఉద్యమంలో పాల్గొన్నాడో చెప్పాలన్నారు. అసలు ఆయనకు టికెట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని టీఆర్‌ఎస్‌ను విమర్శించారు.

మరిన్ని వార్తలు