తెలంగాణలో గెలిస్తే విమోచన దినోత్సవం

8 Sep, 2017 02:27 IST|Sakshi
తెలంగాణలో గెలిస్తే విమోచన దినోత్సవం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం
ముగిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమోచన యాత్ర
అప్పంపల్లిలో బహిరంగ సభ


సాక్షిప్రతినిధి, మహబూబ్‌నగర్‌: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ చేపట్టిన తెలంగాణ విమోచన యాత్ర ముగింపును పురస్కరించుకుని గురువారం రాత్రి మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం అప్పంపల్లిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ విమోచనం కోసం నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి ఎందరో ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. వారి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అని చెప్పారు.

అప్పటి హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ దేశంలోని చిన్న చిన్న రాజ్యాలను భారత్‌లో విలీనం చేయించారని.. అందులో భాగంగానే 17 సెప్టెంబర్‌ 1948లో తెలంగాణకు విమోచనం కలిగించి నిజాం మెడలు వంచారన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వందలాది మంది నిజాం పోలీసులను ఎదిరించి ఆత్మ బలిదానాలు చేశారన్నారు. వారి త్యాగాలను బీజేపీ ఎన్నటికీ మరువదన్నా రు. 2019లో తెలంగాణలో తాము అధికారంలోకి రావడం ఖాయమని హన్స్‌రాజ్‌ స్పష్టం చేశారు.

తెలంగాణలో గడీల రాజ్యం: లక్ష్మణ్‌
నిజాం నిరంకుశ పాలన నుంచి విమోచన పోరాటాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ప్రాంతాలను విజ్ఞాన, స్ఫూర్తి కేంద్రాలుగా మార్చాలన్నారు.  పోరాడి సాధించుకున్న తెలంగాణలో గడీల రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. సమైక్య పాలనలో అప్పటి సీఎం రోశయ్యను తెలంగాణ విమోచన దినోత్సవం విషయమై ప్రశ్నించిన కేసీఆర్‌.. ఈ రోజు ఎందుకు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలన నిజాంను తలపిస్తోందన్నారు. సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నాగం జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, నాయకులు నాగురావు నామోజీ, ప్రేమ్‌రాజ్, సుదర్శన్‌రెడ్డి, కొండయ్య, ఆచారి, నర్సింహులు, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు