అంబేడ్కర్‌ ఆశయాలకనుగుణంగా నడవాలి

15 Apr, 2019 12:19 IST|Sakshi
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేడ్కర్‌ చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం

మెదక్‌జోన్‌: అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని, ఆయన సూచించిన మార్గంలో పయనించి నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నగేష్‌ సూచించారు. ఆదివారం భారతరత్న అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలను జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మెదక్‌లోని జీకేఆర్‌ గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు పట్టణంలోని రాందాస్‌ చౌరస్తా, హెడ్‌ పోస్టాఫీస్‌ చౌరస్తాల్లో గల అంబేడ్కర్‌ విగ్రహాలకు జేసీ నగేష్, జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ అధికారి జ్యోతి పద్మ, మెదక్‌ ఆర్డీఓ సాయిరాం, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్యతోపాటు ఇతర అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జీకేఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలను జేసీ నగేష్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సమాజాభివృద్ధి కోసం కొంత మంది నేతలు సూచనలు మాత్రం చేస్తారని, అంబేడ్కర్‌ అలా కాకుండా ఆచరణలో చూపిన మహనీయులు అని కొనియాడారు. దేశంలో ఉన్నత విద్యావంతుడిగా ఉన్న అతికొద్ది మంది వ్యక్తుల్లో అంబేడ్కర్‌ ఒకరని తెలిపారు. బరోడాలో జరిగిన చేదు అనుభవం తరువాత స్వతంత్ర వ్యక్తిత్వం కలిగి జీవించిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారని తెలిపారు. అటువంటి గొప్ప వ్యక్తి ఒక వర్గానికి, కులానికి పరిమితం చేసే పరిస్థితులు ప్రస్తుతం ఉండటం దురదృష్టకరమన్నారు. కేవలం చదువు ద్వారానే ప్రపంచవ్యాప్తంగా అంబేడ్కర్‌కు ప్రత్యేక గుర్తింపు లభించిందనేది వాస్తవమన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించాలని, కేవలం చదువు మాత్రమే కాకుండా సామాజిక అంశాలపై పట్టు సాధించాలని, తద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని యువకులు ఈ దిశగా ప్రయత్నం చేయాలని సూచించారు.

128వ అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమంలో కూడా ఇంకా వివక్ష గురించి మాట్లాడుకోవడం నిజంగా దురదృష్టకరమన్నారు. అంబేడ్కర్‌ ఆశయాలు ప్రతి ఒక్కరూ నిజంగా అర్థం చేసుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. మెదక్‌ జిల్లా కేంద్రంలో నిర్మించే అంబేడ్కర్‌ భవనానికి త్వరలో కలెక్టర్‌ స్థలాన్ని ఎంపిక చేస్తారని తెలిపారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో జిల్లా జనాభాకు అనుగుణంగా సీట్ల సంఖ్యను పెంచే విధంగా ప్రభుత్వానికి లేఖ రాయడం జరుగుతుందన్నారు. అలాగే కలెక్టర్‌ కార్యాలయంలో ఎలాంటి వివక్ష లేకుండా విధులను పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాంటి సంఘటనలు ఏవైనా ఉన్నట్లు తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధి కోసం అనేక రకమైన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ అన్ని పథకాలను తెలుసుకొని అర్థికంగా అభివృద్ధి చెంది ఇతరులకు ఆదర్శంగా ఉండేందుకు కృషిచేయాలని సూచించారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా పాపన్నపేట మండలం కొత్త లింగాయపల్లి గ్రామం నుంచి ప్రత్యేకంగా బైక్‌లపై వచ్చిన కొంతమంది యువకులను జేసీ ప్రత్యేకంగా అభినందించారు.

భారతీ సంస్కృతి, సంప్రదాయాలను పిల్లలకు నేర్పించడం అనే అంశంపై చైనా వెళ్లిన కృపాకర్‌ అనే విద్యార్థిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో షెడ్యూల్టు కులాల అభివృద్ధిశాఖ అధికారి జ్యోతిపద్మ, మెదక్‌ ఆర్డీఓ సాయిరాం, డీఎస్పీ కృష్ణమూర్తి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ దేవయ్య, ఏడీ ఉద్యానవనశాఖ నర్సయ్య, ఏడీ సర్వే అండ్‌ లాండ్‌ రికార్డ్స్‌ గంగయ్య, డీటీఓ రమేష్, సీఐ వెంకటయ్యతోపాటు ఏఎస్‌డబ్లు్యఓలు సుధాకర్‌రావు, కవిత, నర్సాపూర్‌ వార్డెన్‌ మల్లేశం ఇతర అధికారులు, దళిత సంఘాలు, ప్రజాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సీపీఎం ఆధ్వర్యంలో అంబేడ్కర్‌కు నివాళి 
మెదక్‌జోన్‌: రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ 128వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం సీపీఎం మెదక్‌జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాలులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ దళిత, బడుగు, బలహీన వర్గాలకే కాకుండా దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేడ్కర్‌ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యురాలు కే.నర్సమ్మ, జిల్లా కమిటీ సభ్యులు కే.మల్లేశం, బస్వరాజ్, నాయకులు సంతోష్, నరేష్, మోహిన్, టీమాస్‌ జిల్లా కన్వీనర్‌ సి.హెచ్‌. దేవయ్య, ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు భాస్కర్‌ రిటైర్డ్‌ టీచర్‌ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

మెదక్‌జోన్‌: మెదక్‌ పట్టణంలో ఆదివారం జరిగిన డాక్టర్‌ అంబేడ్కర్‌ 128వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు సామాజిక సేవకులను సన్మానించారు. అందులో భాగంగా సామాజిక కార్యకర్తగా, స్వేరో స్వచ్ఛంద సంస్థ సభ్యుడిగా, జర్నలిస్టుగా, (టీయూడబ్ల్యూజే). (ఐజేయూ)ఎలక్ట్రానిక్‌ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న దొందుగుల నాగరాజును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జేసీ నగేష్, సాంఘిక సంక్షేమశాఖ అధికారిణి జ్యోతి పద్మ తదితరులు పాల్గొన్నారు. 

సమసమాజ నిర్మాణం కోసం అంబేడ్కర్‌ కృషి

మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి 
మెదక్‌ మున్సిపాలిటీ: దేశ నవనిర్మాణం, సామాజిక న్యాయం, బడుగు, బలహీన వర్గాలకు, మహిళలకు న్యాయమైన వాటాకోసం రచించిన వ్యూహాలపై నిర్దేశించిన విధానాలపై నిర్వహించిన సమరశీల పోరాటాలపై చెరగని ముద్రవేసిన మహనీయుడు అంబేడ్కర్‌ అని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అంబేడ్కర్‌ 128వ జయంతి ఉత్సవాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేడ్కర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణాధ్యక్షుడు గంగాధర్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు.

ప్రజల ఆకాంక్ష ప్రతిబింబించేలా రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడని కొనియాడారు. అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్, వైస్‌చైర్మన్‌ రాగి అశోక్, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్‌ ఆర్కెశ్రీనివాస్, పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి, నాగ్సాన్‌పల్లి సర్పంచ్‌ సంజీవరెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్‌ జీవన్‌రావు, రాష్ట్ర కార్యదర్శి సతీష్, నియోజకవర్గ అధ్యక్షుడు రంజిత్‌గౌడ్, టీఆర్‌ఎస్‌ నాయకులు  గడ్డమీది కృష్ణాగౌడ్, రాజు, లింగారెడ్డి, జయరాంరెడ్డి, దుర్గయ్య, ఉమర్, బాలాగౌడ్, అమీర్, వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు