డెలి‘వర్రీ’ 

31 Jan, 2018 14:16 IST|Sakshi

      బిడ్డ పుట్టగానే రూ.300 నుంచి రూ.500 దాకా డిమాండ్‌ 

     ‘రిమ్స్‌’ ప్రసూతి వార్డులో సిబ్బంది చేతివాటం 

      ప్రసవం అయిన నుంచి బెడ్‌పైకి తరలించేవరకు ఇదే తంతు.. 

      సాక్షాత్తు మంత్రి హెచ్చరించినా మారని పరిస్థితి.. 

      పట్టించుకోని రిమ్స్‌ అధికారులు  

‘మాది ఆదిలాబాద్‌ మండలం భీంసరీ గ్రామం. నా కోడలును డెలివరీ కోసం రిమ్స్‌కు తీసుకొచ్చినం. సోమవారం ఆడపిల్ల పుట్టింది. డెలివరీ అయినసుంది ఈడ పని చేసేటోళ్లు పైసలకు పీక్కతిట్టండ్లు. ప్రసవం అయినంక వెంటనే రూ.200 అడిగి తీసుకున్నరు. ఆడి నుంచి వార్డుకు తీసుకొచ్చినందుకు మళ్లా రూ.200, బట్టలు మార్చేవారికి మరో రూ.100 ఇచ్చినం. డబ్బులు లేకనే ఈడికొస్తే.. ఇక్కడ పైసలు..పైసలంటూ మమ్మల్ని తిప్పల పెడుతున్నరు. మా బాధ ఎవలకు చెప్పుకోవాలే. అధికారులు జెర పట్టించుకొని గరీబోళ్లకు న్యాయం చేయాలె.’ 

ఇది ఒక్క ఊశమ్మ కుటుంబానికే కాదు. రిమ్స్‌కు ప్రసూతికోసం వస్తున్న ప్రతీ ఒక్కరికి ఎదురవుతున్న ఇబ్బంది. సంబంధిత అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో ప్రసూతి వార్డు లంచాల వార్డుగామారిపోయినట్లు తెలుస్తోంది.  
   
ఆదిలాబాద్‌ : జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రి ప్రసూతి వార్డులో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్‌ కిట్‌ పథకం ప్రారంభించడంతో ప్రసవాల సంఖ్య పెరిగింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేసుకోవాలని ఓ పక్క ప్రభుత్వం ప్రచారం చేస్తుంటే.. తీరా ఆస్పత్రికి వచ్చిన వారిని లంచాల పేరిట సిబ్బంది ఇబ్బందులకు గురిచేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిమ్స్‌లో బాబు పుడితే రూ.500, పాప పుడితే రూ.300 డిమాండ్‌ చేసి మరీ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డెలివరీ కోసం తీసుకొచ్చింది మొదలు బిడ్డ పుట్టినప్పటి నుంచి వార్డుకు తరలించి బట్టలు మార్చే వరకు ఆయా విభాగాల సిబ్బందికి తప్పనిసరిగా చేయి తడపాల్సిన పరిస్థితి. ప్రసూతి అయినప్పుడు మహిళ సిబ్బంది.. అక్కడి నుంచి వార్డుకు తీసుకొచ్చిన తర్వాత స్ట్రెచర్‌ సిబ్బంది.. మళ్లీ బట్టలు మార్చాలంటే మహిళ సిబ్బంది.. ఇలా  వార్డులో సిబ్బంది చేతివాటంతో పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. డబ్బులు లేవంటే వారిపై కస్సుబుస్సు మనడం పరిపాటిగా మారిందనే విమర్శలున్నాయి. ఎంతో కొంత ఇద్దామనుకుంటే దానికి వారు  ససేమీరా అంటున్నారని, మాకు ఇంత ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారని అక్కడి బాలింతల బంధువులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా రిమ్స్‌ ఉన్నతాధికారులు ఇటువైపు చూడకపోవడం గమనార్హం. డబ్బులు అడిగిన వారి పేర్లు చెప్పాలని అంటున్న అధికారులు రోగులకు సిబ్బంది పేర్లు ఎలా తెలుస్తాయని బంధువులు పేర్కొంటున్నారు. అధికారులే సిబ్బందిని కఠినంగా హెచ్చరించాలని కోరుతున్నారు.  


బయట చెబితే బెదిరింపులు.. 


ప్రసూతి వార్డులో జరిగే కాసుల తంతు బయటకు చెప్పలేని పరిస్థితుల్లో బాలింతల బంధువులు ఉన్నారు. ప్రసవం తర్వాత నార్మల్‌ డెలివరీ అయితే మూడు రోజులు, సర్జరీ చేసే వారం రోజులు ఉండాల్సి వస్తుంది. అలాంటిది ప్రసూతి వార్డులో సిబ్బంది డబ్బులు తీసుకున్నారని మీడియాకు చెప్పినా.. ఇంకా ఎవరితోనైనా అడిగించినా.. మరుసటి రోజు బాధితులకు సిబ్బంది నుంచి బెదిరిస్తారనే భయంతో నిజం చెప్పడం లేదు. ఒకవేళ ధైర్యం చేసి ఎవరైనా చెబితే మరుసటి రోజు సిబ్బంది ప్రసూతి వార్డుకు వెళ్లి మరీ డబ్బులు తీసుకుంటున్నామని ఎవరు చెప్పారంటూ ఆరా తీస్తారు. కొన్ని సందర్భాల్లో గొడవలు పడ్డ సంఘటనలు కూడా  ఉన్నాయి. అందుకే చాలా మంది వారితో మాకేందుకులే గొడవలని రిమ్స్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన తర్వాత వారికి జరిగిన అన్యాయం గురించి చెబుతున్నారు. నెలల తరబడి ప్రసూతి వార్డులోనే కొంత మంది విధులు నిర్వహిస్తుండడంతో వారు చేతివాటానికి అలవాటు పడిపోయినట్లు తెలుస్తోంది. 


మంత్రి చెప్పినా మారని పరిస్థితి.. 


రెండు నెలల క్రితం రాష్ట్ర అటవీ, బీసీ శాఖ మంత్రి జోగురామన్న రిమ్స్‌ ఆస్పత్రిలో తనిఖీ చేశారు. ఆ సమయంలో కొందరు ప్రసూతి వార్డులో డబ్బులు తీసుకుంటున్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇబ్బందులు పెడుతున్నారంటు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. అయినా సిబ్బంది తీరులో మార్పు రాకపోవడం గమనార్హం. ప్రసూతి వార్డులో సిబ్బంది చేతివాటంపై గతంలో కలెక్టర్‌గా పనిచేసిన అహ్మద్‌బాబుకు కూడా పలుమార్లు ఫిర్యాదు చేసిన సంఘటనలు ఉన్నాయి. అప్పటి నుంచి కలెక్టర్‌లు, అధికారులు మారినా ప్రసూతి వార్డులో మాత్రం పరిస్థితి మారకపోవడం విశేషం.


కఠిన చర్యలు తీసుకోవాలి.. 


డెలివరీ కోసం నా భార్యను రిమ్స్‌కు తీసుకొచ్చాను. కూతురు పుట్టింది. అయితే నేను లేని సమయంలో మావల్ల నుంచి ఇక్కడి సిబ్బంది రూ.500 తీసుకున్నారు. బెడ్‌పైకి వచ్చిన తర్వాత కూడా బట్టలు మార్చేందుకు డబ్బులు అడగడం సిగ్గుచేటు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.  
గంగాధర్, ఆదిలాబాద్‌ 


గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం


గతంలో ప్రసూతి వార్డులో డబ్బులు వసూలు చేస్తున్నారని కలెక్టర్‌కు, రిమ్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశాం. అప్పట్లో కలెక్టర్‌ దీనిపై స్పందించి సిబ్బందిని తొలగించాలని ఆదేశించారు. అయినప్పటికి సిబ్బందిలో మార్పు రాలేదు. నిత్యం ఎంతో మంది పేదలు వస్తుంటారు. వారి నుంచి డబ్బులు వసూలు చేయడం సరి కాదు.                          కనక నర్సింగ్, మానవ సేవే మాధవ సేవా సభ్యుడు, ఆదిలాబాద్‌


విచారణ జరిపిస్తాం.. 


ప్రసూతి వార్డులో సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఎవరైనా డబ్బులు తీసుకున్న సిబ్బంది పేర్లు చెబితే వారిపై చర్యలు తీసుకుంటాం. వార్డులో సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశాం. డబ్బులు తీసుకున్న సిబ్బందిని గుర్తించేందుకు విచారణ జరిపిస్తాం.  
డాక్టర్‌ కె. అశోక్, రిమ్స్‌ డైరెక్టర్‌     

మరిన్ని వార్తలు