కుంగిపోయిన భవనం వద్దకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం 

23 Aug, 2018 14:45 IST|Sakshi
ఘటనా స్థలి వద్ద రోదిస్తున్న వాచ్‌మన్‌ కుటుంబ సభ్యులు 

 పనులను పర్యవేక్షిస్తున్న కలెక్టర్, సీపీ ఇతర అధికారులు

ఇంకా లభించని  వాచ్‌మన్‌ భిక్షపతి ఆచూకీ

కాజీపేట : కాజీపేట పట్టణంలోని భవానీ నగర్‌లో మంగళవారం రాత్రి బహుళ అంతస్తుల భవనం భూమిలోకి కుంగిపోయిన ఘటనలో సహాయక చర్యలను జిల్లా అధికార యంత్రాంగం వేగవం తం చేసింది. ఈ భవన శిథిలాల్లో వాచ్‌మెన్‌ మేడ భిక్షపతి (60) చిక్కుకున్నట్లుగా గుర్తించిన అధికా రులు కాపాడటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నా రు. భూపాల్పల్లి, హైదరాబాద్‌ల నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు ఫైర్‌ సేఫ్టీ అధికారుల బృందాలను ఘటన స్థలానికి రప్పించి సహాయక చర్యలను చురుగ్గా కొనసాగిస్తున్నారు. ఈ సహా యక బృందాలు అత్యాధునిక పరికరాలతో వాచ్‌మెన్‌ ఆచూకీని కనుక్కునేందుకు శ్రమిస్తున్నారు.   

సహాయక చర్యలకు ఆటంకం...

జనావాసాల మధ్య నిర్మితమవుతున్న బహుళ అంతస్థుల భవనం ఒక్కసారిగా భూమిలోకి దాదాపు 20ఫీట్ల లోతుకు కుంగిపోవడంతో సహాయక చర్యలు చేపట్టడం సహాయక బృందాలకు కష్టంగా మారింది. ఈ భవనం కుంగిపోవడంతో పక్కపక్కనే ఉన్న నాలుగు భవనాలకు తీరని నష్టం జరిగే పరిస్థితి కనిపిస్తోంది. చుట్టూ ఇండ్లు ఉండడంతో భవనాన్ని కూల్చడం, శిథిలాల కింద చిక్కుకుపోయిన వ్యక్తిని బయటకు తీయడం ఏలా అనే సందిగ్ధంలో అధికారులు పడిపోయారు.

 భవనం ముందు, వెనుక.. పెద్ద, పెద్ద గోతులు నీటితో నిండి ఉండడంతో ప్రొక్లెయినర్లను ఉపయోగించడం కష్టమవుతోంది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి జేసీబీలు, క్రేన్‌లను తెప్పించి పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ భవనం చుట్టూ ఉన్న నాలుగు ఇండ్లు కూడా పగుళ్లు పట్టిపోయాయి. దీంతో ఆయా ఇండ్ల యజ మానులు కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు.  

లోపించిన అధికారుల పర్యవేక్షణ...

మున్సిపల్‌ అధికారులు అనుమతులు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారే తప్ప పనులను పర్యవేక్షించిన దాఖలాలు కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పిల్లర్లు వేసి అతి పెద్ద భవంతిని ప్రధాన రహదారికి కూతవేటు దూరంలో కడ్తున్నప్పటికీ బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు పట్టించుకోకపోవడం బాధాకరమంటున్నారు. పనులు సాగిన వైనంపై సమగ్రమైన విచారణ జరిపించి, బాధ్యుడైన రవీందర్‌రెడ్డితో పాటు సంబంధిత అధికారులపై  చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

ఇంటి యజమాని రిటైర్డు ఉపాధ్యాయుడు..

వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పుల గ్రామానికి చెందిన కొత్త రవీందర్‌రెడ్డి రెండేళ్ల క్రితం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందారు. పింఛన్‌ డబ్బులను వెచ్చించి నగరంలో సొంత ఇళ్లు ఉండాలనే ఆకాంక్షతో జీ ప్లస్‌ 2  పర్మిషన్‌తో భవన నిర్మాణ పనులను ఏడాది  కింద మొదలు పెట్టాడు. బంధు, మిత్రుల సలహా మేరకు మరో రెండంతస్థులకు మున్సిపల్‌ అధికారుల నుంచి పర్మిషన్‌ తీసుకుని బహుళ అంతస్తుల భవనానికి శ్రీకారం చుట్టాడు.

ఘటనా స్థలినిసందర్శించిన కలెక్టర్‌

భవానీనగర్‌లో భవనం కృంగిపోయిన సమాచారం అందుకున్న కలెక్టర్‌ అమ్రపాలితో పాటు జేసీ దయానంద్, సీపీ విశ్వనా«థ రవీందర్, డీసీపీ వెంకటరెడ్డి, ఏసీపీ సత్యనారాయణ, తహసీల్ధార్‌ రవీందర్, డివిజనల్‌ అగ్నిమాపక అధికారి భగవాన్‌రెడ్డి,        ఏడీఎఫ్‌ఓ జైపాల్‌రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. నిట్‌ సివిల్‌ ఇంజనీర్ల బృందం సభ్యులను రప్పించి చేపట్టాల్సిన సహాయక చర్యలపై కలెక్టర్‌ చర్చించారు.  ఎలాగైనా వాచ్‌మెన్‌ను కాపాడాలని సహాయక బృందాలను ఆదేశించారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని పట్టించుకోని అధికారులు

సహాయక చర్యల్లో పాల్గొంటున్న జాతీయ విపత్తుల నివారణ సంస్థ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) సభ్యులను,  సిబ్బందిని ఎవరూ పట్టించుకోకపోవడంపై వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లా అధికారుల విన్నపం మేరకు హైదరాబాద్, భూపాలపల్లి జయశంకర్‌ జిల్లా నుంచి దాదాపు 40 మంది సిబ్బంది కాజీపేటకు బుధవారం మధ్యాహ్నం చేరుకున్నారు.  క్షణం తీరిక లేకుండా సహాయక చర్యల్లో బిజీబిజీగా ఉన్న సిబ్బందికి కనీసం  మంచినీరు, టీ వంటి సౌకర్యాలు కల్పించడానికి స్థానిక అధికారులు ప్రయత్నించిన దాఖలాలు లేవని వారు విలేకరులతో వాపోయారు.

వాచ్‌మన్‌ కుటుంబ సభ్యుల ఆందోళన

కాజీపేట: భవనంలో చిక్కుకుపోయినట్లుగా అనుమానిస్తున్న వాచ్‌మన్‌ మేడ భిక్షపతి (60) ఆచూకీ దొరక్కపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మంగళవారం రాత్రి భార్యకు జాగ్రత్తలు చెప్పి పడుకోవడానికి భవనంలోకి వచ్చిన పది నిమిషాల్లోనే పెద్ద శబ్ధంతో కుంగిపోయింది. భార్య, పిల్లలు ఘటనా స్థలికి చేరుకుని భిక్షపతి కోసం భవనం చుట్టూ తిరుగుతూ పిలుస్తున్నారు.  

స్పందన లేకపోవడంతో లోపల చిక్కుపోయి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. భవనం మొదటి అంతస్తులోనే భిక్షపతి నిద్రిస్తాడని భార్య మణెమ్మ చెప్పగా ఆ దిశగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన భిక్షపతి ఏడాది కాలంగా కుటుంబంతో కాజీపేటకు వలస వచ్చి ఈ ఇంటి యజమాని వద్ద వాచ్‌మన్‌గా చేరినట్లు చెబుతున్నారు.

భిక్షపతికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అధికారులు చేస్తున్న ప్రయత్నాలు బుధవారం రాత్రి వరకు ఒక కొలిక్కి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.

భవనం భద్రమేనా ?అడ్డగోలుగా బహుళ అంతస్తుల నిర్మాణాలు

వరంగల్‌ అర్బన్‌: ఎక్కడ ఎలాంటి భవనం కడుతున్నారు. భవన నిర్మాణానికి ఆ నేల తగినదేనా ? లేదా ? నిర్మాణంలో సరైన రక్షణ చర్యలు ఉన్నాయా ? లేవా? అన్న కనీస పర్యవేక్షణ కరువైంది. పలుకుబడి ఉంటే ఏదైనా చేయచ్చు. అనుమతి ఉన్నా లేకున్నా దర్జాగా ఎన్ని అంతస్తులెనా నిర్మించవచ్చు. ఒక వైపు మామూళ్లే  పెట్టుబడిగా నాణ్యత, అనుమతి లేని భవనాలు అడ్డగోలుగా నిర్మిస్తుంటే... మరోవైపు శిథిల భవనాలు నేలమట్టమవుతున్నాయి.

లంచాలకు ఆశపడి మహా నగర పాలక సంస్థ కింది స్థాయి అధికారులు కళ్లు మూసుకుని వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చేస్తుండటంతో నిర్మాణ లోపాలు, మానవ తప్పిదాలతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మంగళవారం రాత్రి కాజీపేట భవానీ నగర్‌లో నాలుగు అంతస్తుల భవనం భూమిలోకి కుంగిపోవడంతో ఓ వ్యక్తి దాని కింద ఉండి పోయాడు.  ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది.

బహుళ అంతస్తుల భవనాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో  ఖాళీ స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతోపాటు.. నిర్మాణ సామగ్రి ధరలను దృష్టిలో ఉంచుకొని అపార్టుమెంట్ల వైపే మధ్య తరగతి ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో శివారు ప్రాంతాల్లో మొదలుకొని.. ప్రధాన రహదారుల వెంట భారీ భవంతులు, అపార్టుమెంట్లు నిర్మితమవుతున్నాయి.  నగర పాలక సంస్థ పరిధిలో 400 వరకు అపార్టుమెంట్లు ఉన్నాయి. మరో 80 వరకు నిర్మాణంలో ఉన్నాయి.

మామూళ్ల మత్తులో నిబంధనల ఉల్లంఘన..

వరంగల్‌ మహా నగరంలో బహుళ అంతస్థుల నిర్మాణాల్లో కనీస నాణ్యత  ప్రమాణాలు పాటించడం లేదు. ఏదైనా ఒక ప్రాంతంలో భవన నిర్మాణం చేపట్టే ముందు నిర్మాణ ప్లాన్‌ అమోదించేందుకు స్ట్రక్చరల్‌ ఇంజినీరు, సాయిల్‌ టెస్ట్‌(భూసార పరీక్షలు) చేయాలి. నిర్మాణ యోగ్యత కలిగిన నేలగా ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాలి. అర్కిటెక్చర్‌ నిబంధనల మేరకు ప్లాన్, ఇతర పత్రాలను సమర్పించాలి.  అపార్టుమెంటు, భవనం నిర్మించే స్థలం ఎన్ని టన్నుల సామర్థ్యాన్ని తట్టుకోగలదో నిర్ణయించి.. అ మేరకు నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది.

ఈ విషయంలో  నగర పాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌  అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సరైన ధ్రువపత్రాలు లేకున్నా అధికారులు.. బిల్డర్ల నుంచి ముడుçపులు  తీసుకొని అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారనే విమర్శలున్నాయి. నిర్మాణదారులు, బిల్డర్లు కూడా డబ్బులు మిగుల్చుకునేందుకు కక్కుర్తిపడుతున్నారనే ఆరోపణలున్నాయి.

శిథిలావస్థలో ఉన్న ఇళ్లపై నిర్లక్ష్యపు ధోరణి

వర్షం వస్తే చాలు.... పాత కాలం నాటి భవనాలు భయ పెడుతున్నాయి. శిథిలావస్థకు చేరిన భవనాలు ఏ క్షణంలో కూలుతాయోనన్న భయంతో జనం బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఏదో ఒక చోట ప్రమాదాలు సంభవించి ప్రాణ నష్టం వాటిల్లుతోంది. ఇంత జరుగుతున్నా ‘గ్రేటర్‌’ అధికారులు నోటీసుల జారీతోనే సరిపెడుతున్నారు.

 అదనపు అంతస్తే కొంపముంచిందా..?

కాజీపేట భవానీ నగర్‌లో రిటైర్డ్‌ ఉద్యోగి పార్కింగ్‌ ప్లస్‌ మూడు అంతస్థులకు అనుమతి తీసుకున్నారు. అదనంగా మరో అంతస్తు నిర్మించారు. భూసార పరీక్షలు చేపట్టకుండా నిర్మించడం వల్ల నిర్మాణంలో ఉన్న భవనం భూమిలోకి కుంగిపోయి ఉంటుందనే వాదనలు వినవస్తున్నాయి. గ్రేటర్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మాత్రం ఈ ఘటనపై స్పష్టమైన వైఖరిని వెల్లడించడం లేదు. అదనపు అంతస్థుకు మామూళ్లు పుచ్చుకొని చూసీచూడనట్లుగా వ్యవహరించడమే ఘటనకు కారణమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

జీ ప్లస్‌ 3 అనుమతి ఉంది

భవానీ నగర్‌లో కుంగిపోయిన బిల్డింగ్‌కు సంబంధించి జీ ప్లస్‌ 3 భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం జరిగింది. నిబంధనల మేరకు ఓనర్, సర్వేయర్‌ ద్వారా అండర్‌ టేకింగ్‌ తీసుకొని అనుమతులు ఇచ్చాం. అదనపు అంతస్థు విషయం తెలియదు.  - గణపతి, గ్రేటర్‌ డీసీపీ

మట్టి పరీక్షలు తప్పనిసరి..

కాజీపేట అర్బన్‌: భవన నిర్మాణంలో భూసార పరీక్ష(సాయిల్‌ టెస్ట్‌ ) తప్పనిసరి అని నిట్‌ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ పాండురంగారావు తెలిపారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో అనేక చెరువులు, నీటి పారుదల కొనసాగించిన ప్రాంతాల్లో నిర్మాణాలు ప్రమాదకరమని అన్నారు. సొంత ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నిర్మాణం, కమర్షియల్‌ బిల్డింగ్‌ల నిర్మాణంలో తప్పనిసరిగా మట్టి పరీక్షలు నిర్వహించాలన్నారు.  వరంగల్‌లో భద్రకాళీ చెరువుకు కుడి, ఎడమ వైపు భాగం, వడ్డెపల్లి, బంధం చెరువు, చిన్న వడ్డెపల్లి, మెట్టుగుట్టకు అనుకుని గిద్దె చెరువు చుట్టు పక్కల ప్రాంతాల్లో నీటి ప్రవాహాన్ని ఓల్డ్‌ టెలియో చానల్స్‌ అంటారని తెలిపారు.

 అట్టి పాత టెలియో చానెల్స్‌పై నిర్మాణా ప్రమాదకరమని, అదే విధంగా నల్లరేగడిలో, బురద మట్టిలో ఒక అంతస్తు భవనాలు నిర్మించిన ఏడాదిలోపే భూమిలోకి కుంగిపోతాయని వివరించారు. ప్రస్తుతం కాజీపేటలోని భవానీనగర్‌లో నిర్మించిన జీ ప్లస్‌ 4 భవనం సైతం బురద మట్టిలో కట్టడం ద్వారానే కుంగిపోయిందన్నారు. హైదరాబాద్‌లో ఇలా భవనాలు కుంగిపోయినప్పుడు పర్యవేక్షణకు వెళ్లామని.. అక్కడ కూడా ఓల్డ్‌ టెలియో చానల్స్‌పైనే నిర్మాణాలు చేపట్టారన్నారు.

సమగ్ర విచారణ జరిపిస్తాం

 కాజీపేట: భవానీనగర్‌లో భవనం కుంగిపోయిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్‌ నరేందర్, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ స్పష్టం చేశారు. బుధవారం వారు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలపై అధికారులతో చర్చించారు. భవన శిథిలాల కింద చిక్కుకపోయిన భిక్షపతిని సజీవంగా కాపాడేందుకు ఫైర్‌ సెప్టీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు శాయశక్తులా కృషి చేస్తాయన్నారు.  బిల్డింగ్‌ నిర్మాణం కోసం మున్సిపల్‌ అనుమతులపై ఆరా తీశారు.  భిక్షపతి కుటుంబానికి ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు

ప్రమాదంపై విభిన్న కథనాలు..

ఇంటి యజమాని రవీందర్‌రెడ్డి ఇంజనీర్‌ పర్యవేక్షణ లేకుండా మేస్త్రీ మాటలను విశ్వసించి ఒక లెక్క, పద్ధతి లేకుండా పిల్లర్లను అతి తక్కువ సైజ్‌లో వేసి బహుళ అంతస్థుల భవనం నిర్మించడమే ప్రమాదానికి కారణమంటున్నారు చుట్టు పక్కల వారు. రెండంతస్థుల కోసం వేసిన పిల్లర్లపైనే పెంట్‌ హౌస్‌తో కలిసి ఐదంతస్తులు వేయడమే ప్రమాదానికి అసలు కారణం అయ్యి ఉంటుందని నిట్‌ అధికారులు భావిస్తున్నారు.

అసలే నల్లరేగడి భూమి, దానికితోడు భవన నిర్మాణ స్థలం పెద్ద గోతులతో ఉంది.. అలాంటప్పుడు భూసార పరీక్షలు చేయించకుండానే యజమాని నేరుగా భవన కట్టడం కూడా ప్రమాదానికి కారణమంటున్నారు.

విచారణ జరిపించాలి..

భవనం కుంగిపోయిన ఘటనపై అధికారులు సమగ్రమైన విచారణ జరిపించాలి. ఘటనకు బాధ్యుడైన భవన యజమానిపై కేసు నమోదు చేయాలి.భవిష్యత్‌లో ఇలాంటి సంఘటన జరుగకుండా చర్యలు తీసుకోవాలి - సందెల విజయ్, భవానీనగర్‌

సాయిల్‌ టెస్ట్‌ చేయించకుండానే... 

బహుళ అంతస్థుల భవన నిర్మాణం చేపట్టినప్పుడు తప్పని సరిగా సాయిల్‌ టెస్ట్‌ చేయించాలనే నిబంధన ఉన్నా.. ఇక్కడ పాటించినట్లుగా కనిపించడం లేదు. అసలే నల్లరేగడి భూమి కావడంతో భవనం కుంగిపోయింది.  బి.జయరాజ్, భవానీనగర్‌

పక్క ఇళ్లకు పరిహారం ఇవ్వాలి..
 
భవనం కూలడం వల్ల పక్కనున్న మా ఇండ్లకు తీరని నష్టం వాటిల్లింది. నాలుగు ఇండ్లకుపైగా పనికిరాకుండా పోయే ప్రమాదం తలెత్తింది. వీటిని అధికారులు పరిశీలించి నష్టపరిహారం ఇచ్చేలా చూడాలి. తమకు న్యాయం చేయాలి.    జి.గీత, స్థానికురాలు 

నాణ్యత లేని మెటీరియల్‌ వాడారు..

బహుళ అంతస్థుల భవనం నిర్మించేప్పుడు వాడాల్సిన స్టీలు, పిల్లర్ల  నిర్మాణాలను బిల్డర్లు పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. పెడస్టల్‌ నిర్మాణం బాగా లేని కారణంగానే భూమిలోకి భవనం కుంగిపోయిందని కచ్చితంగా చెప్పొచ్చు. నాణ్యత లేని మెటీరియల్‌ వాడడం వల్లనే ఈ ఘటన జరిగింది.  - తేలు సారంగపాణి, బిల్డర్‌

మరిన్ని వార్తలు