బస్సు కిందపడి విద్యార్థి దుర్మరణం

31 Jul, 2014 00:05 IST|Sakshi
ప్రమాదానికి కారణామైన బస్సు

- కళాశాలకు వెళుతుండగా ఘటన
- మృతదేహంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిరసన
- రూ. 2 లక్షలు నష్టపరిహారం ఇచ్చేందుకు ఆర్టీసీ డీఎం హామీ

 సదాశివపేట : ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు కింద పడి ఓ ఇంటర్ విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండలంలోని ఆత్మకూరు ఎస్సీ కాలనీ వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ నాగయ్య కథనం మేరకు.. ఆత్మకూర్ గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన మొగులయ్య, వీరమణి దంపతులకు ముగ్గురు కుమారులు కాగా.. ఉదయ్‌కుమార్ (17), మోహన్‌లు చదువుతుండగా, జాన్ వ్యవసాయం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఉదయ్‌కుమార్ సదాశివపేట పట్టణంలోని ఇండో బ్రిటీష్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. నిత్యం సింగూర్ వైపు నుంచి సంగారెడ్డికి వెళ్లే ఆర్టీసీ బస్సులో కళాశాలకు రాకపోకలు సాగిం చేవాడు. అందులో భాగంగానే బుధవారం ఉదయం బస్సు రాగానే ఎక్కాడు.

అయితే అదుపు తప్పి బస్సు వెనుక చక్రం కింద పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఉదయ్ మృతదేహంతో బస్సు ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న సంగారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ నాగేశ్వర్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అయితే రూ. 5 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో మేనేజర్ గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో జెడ్పీటీసీ సంగమేశ్వర్, గ్రామ సర్పంచ్ నరసింహులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు అమరేందర్‌రెడ్డి, నరసింహులు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణలు, కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో చర్చలు జరిపారు.

కోర్టు కేసుతో సంబంధం లేకుండా రూ. 2 లక్షల నష్టపరిహారం చెల్లించేందుకు ఆయన అంగీకరించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి మొగులయ్య ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ లచ్చాగౌడ్‌పై  కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగయ్య తెలిపారు. ఇదిలా ఉండగా.. విద్యార్థి ఉదయ్‌కుమార్ మృతికి సంతాప సూచకంగా ఇంటర్, డిగ్రీ ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఇండో బ్రిటీష్ కళాశాల సిబ్బంది, తోటి విద్యార్థులు ప్రమాద స్థలానికి చేరుకుని తోటి మిత్రుడిని కోల్పోయామని కన్నీటి పర్యంతమయ్యారు. కాగా ప్రతి రోజు సదాశివపేట నుంచి ఆత్మకూర్ వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేకంగా బస్సు నడపాలని గ్రామస్తుల డిమాండ్‌కు డీఎసీ నాగేశ్వర్ అంగీకరించారు.

మరిన్ని వార్తలు