డొంక కదిలింది

20 Apr, 2016 03:30 IST|Sakshi
డొంక కదిలింది

అనవసరపు ఆపరేషన్ల కేసులో  సర్జన్ సురేష్, ఆర్‌ఎంపీ గణేష్ అరెస్ట్
కొనసాగుతున్న కేసు విచారణ
మరికొందరిని అరెస్టు చేసే అవకాశం
వైద్యులు, ఆర్‌ఎంపీల్లో గుబులు

 
 కాసులకోసం కక్కుర్తిపడి కడుపు‘కోత’లు కోసిన వ్యవహారంలో చర్యలు మొదలయ్యాయి. అవసరం లేకున్నా కమీషన్ల కోసం పలువురు ఆర్‌ఎంపీలు, వైద్యులు కలిసి అపెండిసైటిస్, గర్భసంచి తొలగింపు ఆపరేషన్లు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కథలాపూర్ మండలంలో మొదట వెలుగుచూసిన ఈ వ్యవహారంలో పాత్రధారులు, సూత్రధారుల కోసం అన్వేషించిన పోలీసులు జగి త్యాల వైద్యుడు టి.సురేష్‌కుమార్‌ను, కథలాపూర్ మండలం తాండ్య్రాల ఆర్‌ఎంపీ జక్కని గణేష్‌ను మంగళవారం అరెస్టు చేయడంతో ఈ దందాలో డొంక కదలినట్లయింది. - కథలాపూర్/జగిత్యాల అర్బన్/కోరుట్ల

అనవసరపు ఆపరేషన్ల వ్యవహారం మానవహక్కుల కమిషన్‌కు వెళ్లగా కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్, రెవెన్యూ, వైద్యశాఖ అధికారులు వేర్వేరుగా విచారణ చేపట్టి నివేదిక అందించారు. దీని ప్రకారం... కథలాపూర్ మం డలంలో 2011 నుంచి 2016 వరకు 620 అపెండిసైటిస్, 422 గర్భసంచుల ఆపరేషన్లు తొలగించినట్లు తేలింది. తర్వాత సారంగాపూర్, రాయికల్ మండలాల్లోనూ ఈ దందా సాగినట్లు వార్తలు వచ్చాయి. జగిత్యా ల, కోరుట్లలోని ఇద్దరు ముగ్గురు వైద్యులే ఈ ఆపరేషన్లు చేసినట్లు తేలింది. ఇద్దరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోరుట్ల సీఐ రాజశేఖరరాజు, కథలాపూర్ ఎస్సై నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేసి మంగళవారం అరెస్టుల ప్రక్రియ ప్రారంభించారు.


 వైద్యుల్లో గుబులు
 డాక్టర్ సురేశ్‌కుమార్, ఆర్‌ఎంపీ గణేశ్‌ను అరెస్టు చేయడంతో పలువురు వైద్యుల్లో గుబులు మొదలైంది. మరికొందరికి సైతం ఈ వ్యవహారంలో పాత్ర ఉన్నట్లు వెల్లడి కాగా, ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. రాయికల్ మండలం మూటపల్లి, గొల్లపల్లి మండలం యశ్వంతరావుపేట, సారంగాపూర్ మండలం బీర్‌పూర్ తదితర చోట్ల సైతం పలువురు ఆర్‌ఎంపీలు, వైద్యులు అపెండిసైటిస్, గర్భసంచి ఆపరేషన్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో కేసుకు తమకు వచ్చే రూ.6 నుంచి రూ.8 వేల కమీషన్ కోసం ఆర్‌ఎంపీలు పలువురిని ఈ ఆపరేషన్లకు ప్రోత్సహించినట్లు తేలిన విషయం తెలిసిందే.


 రాజకీయ ఒత్తిళ్లతో జాప్యం!
 అనవసరపు ఆపరేషన్ల వ్యవహారం బహిర్గతమైనప్పటినుంచి 40 రోజుల్లోగా ఏం జరుగుతుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది. వ్యవహారం మానవహక్కుల కమిషన్ దృష్టికి వెళ్లడం, విచారణలు, నివేదికలతో చర్చనీయాంశంగా మారింది. చివరకు ఇద్దరి అరెస్టుతో కీలక మలుపు తిరిగినట్లయింది. మరింత లోతుగా విచారణ చేపట్టి... ఈ దందాలో పాత్ర ఉన్న గ్రామీణ వైద్యులను మరికొందరిని అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 10 మంది ఆర్‌ఎంపీల పాత్ర ఉన్నట్లు అధికారులు అంచనాకు వచ్చినా... రాజకీయ పలుకుబడితో పలువురిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే దర్యాప్తులో జాప్యం జరుగుతోందనే ఆరోపణలున్నాయి.


 అతని రూటే సప‘రేటు’
 డాక్టర్ టి.సురేశ్‌కుమార్ మొదటినుంచి తన రూటే సప‘రేటు’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జగిత్యాలలో విజయలక్ష్మి నర్సింగ్‌హోం, కోరుట్లలో పల్లవి ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. పల్లవి ఆస్పత్రికి డీఎంహెచ్‌వో అనుమతి లేదని విచారణలో తేలింది. ఈ విషయంపై పోలీసులు డీఎంహెచ్‌వోకు లేఖ రాశారు. సర్జన్ సురేశ్ ఇచ్చే కమీషన్ల ఆశతో కడుపునొప్పితో వచ్చే రోగులను కథలాపూర్ మండలం తాండ్య్రాలకు చెందిన ఆర్‌ఎంపీ గణేశ్ తప్పుదోవ పట్టించి ఆపరేషన్లు చేయించినట్లు తేలింది. ఆర్‌ఎంపీ గణేశ్ సిఫారసుతో ఒక్క తాండ్య్రాలలోనే 50 మందికి అపెండిసైటిస్ ఆపరేషన్లు చేశారు. సురేశ్‌కుమార్ గతంలో ధర్మారంలోని ఓ నర్సింగ్‌హోమ్‌లో శస్త్రచికిత్స చేయగా, అనస్తీషియా సైతం సురేశ్‌కుమారే ఇవ్వడంతో మందు వికటించి రోగి ఆపరేషన్ థియేటర్‌లోనే మరణించినట్లు ఆరోపణలొచ్చాయి. బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు చెల్లించి, ఒత్తిడి తీసుకువచ్చి కేసు మాఫీ చేసినట్లు సమాచారం.


 కొనసాగుతున్న విచారణ
 అనవసరపు ఆపరేషన్ల వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని కోరుట్ల సీఐ రాజశేఖరరాజు వెల్లడించారు. మరికొందరు వైద్యులు, ఆర్‌ఎంపీలు కూడా ఈ తతంగంలో పాలుపంచుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, పూర్తిస్థాయి విచారణ అనంతరం బాధ్యులను అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. విచారణ నిక్కచ్చిగా జరిపిన ఎస్సై నిరంజన్‌రెడ్డి, కానిస్టేబుళ్లు జలీల్, రాజ్‌కుమార్, సురేశ్‌ను సీఐ అభినందించారు. బాధితులు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. మోసాలు చేస్తున్న ఆర్‌ఎంపీలపై నిఘా ఉంచామన్నారు.

మరిన్ని వార్తలు