అటు సడలింపులు.. ఇటు వలసలు

13 May, 2020 02:04 IST|Sakshi

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులకు కారణాలివే.. 

సడలింపులంటే స్వేచ్ఛగా ఉండటమన్న భావనలో జనం 

దీనిపై వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగంలో ఆందోళన 

కట్టడికి ఏం చేయాలన్న దానిపై ఉన్నతస్థాయిలో సమీక్ష 

ఇంకా కేసులు పెరుగుతాయంటున్న అధికారులు 

ఐసోలేషన్, వైద్య చికిత్స, మౌలిక సదుపాయాలపై దృష్టి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కొన్ని రోజులుగా వైరస్‌ ఉధృతి వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. సోమవారం 79 కేసులు, మంగళవారం 51 కేసులు నమోదు కావడంతో వైద్యాధికారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ సడలింపులివ్వడం, మరోవైపు వివిధ రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులు స్వస్థలాలకు వస్తుండటంతో వైరస్‌ కేసులు పెరుగుతున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. మున్ముందు కేసుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి. దీన్ని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. వైరస్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ సిద్ధం చేసింది.  

సడలింపులంటే స్వేచ్ఛ కాదు
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూనే, జోన్ల వారీగా సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. రెడ్‌ జోన్‌లో ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో అనుమతులు ఇచ్చిన దానికంటే జనం అధికంగా బయటకు వస్తున్నారు. సడలింపులంటే వైరస్‌ పూర్తిగా పారిపోయిందని, అందుకే స్వేచ్ఛగా తిరగొచ్చన్న భావన చాలామందిలో నెల కొందని వైద్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కొందరైతే మద్యం తీసుకొని వచ్చి ఇళ్లలో ఫ్రెండ్స్‌తో పార్టీలు చేసుకుంటున్నారని, కొందరైతే మేడ మీద కూర్చొని అర్ధరాత్రుల వరకు ఎంజాయ్‌ చేస్తున్నారని అంటున్నారు. ఇక ఇటు సడలిం పులతో పలుచోట్ల వ్యాపారాలు ప్రారంభమయ్యాయి. బతుకుదెరువు కోసం బయటకు వచ్చేవారి సంఖ్య పెరిగింది. కొన్ని కార్యాలయాలు ఇప్పటికీ అవసరం లేకపోయినా సిబ్బందిని ఆఫీసులకు రప్పిస్తున్నారు. వర్క్‌ ఫ్రం హోంకు అవకాశమున్నా సడలింపు ఉందంటూ కార్యాలయాలకు పిలిపిస్తున్నారు. ఇటువంటి చర్యలే కొంప ముంచుతున్నాయని అధికారులు  చెబుతున్నారు.  

ఇంకా కేసులు పెరుగుతాయ్‌ 
సడలింపులతో బయటకు వస్తున్న జనంతోపాటు వలసల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కూలీలు, ఉద్యోగులతో మున్ముందు రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. జనం గుమికూడితే కేసుల సంఖ్య పెరగక తప్పదంటున్నారు. అంతర్గత అంచనా ప్రకారం ఇప్పుడున్న కేసులకు అనేక రెట్లు పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘లాక్‌డౌన్‌ ఎత్తేయడం వల్ల, సడలింపులు ఇవ్వడం వల్ల వైరస్‌ తీవ్రత పెరుగుతుందన్న అంచనా ప్రభుత్వానికి ఉంది. కానీ జనజీవనం బయటకు రాకపోతే బతికే పరిస్థితి ఉండదు. కాబట్టి సడలింపులిచ్చింది. ఈ సడలింపులను ఏమాత్రం దుర్వినియోగం చేయకూడదు. ఇది స్వేచ్ఛా సమయం కాదు. వైరస్‌తో కలసి జీవించాల్సిందే అంటే కరోనాతో రాసుకుపూసుకొని తిరగమని అర్థం కాదు. కొన్ని జాగ్రత్తలతో ఉద్యోగ, వ్యాపారాలు చేసుకోవాలి. అంతేగానీ ఇష్టారాజ్యంగా ఉండకూడదు’అని ఒక వైద్యాధికారి తెలిపారు.  

వలసలతో మరికొన్ని ఇబ్బందులు
సడలింపుల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న తెలంగాణవాసులు ప్రస్తుతం రాష్ట్రంలోకి వస్తున్నారు. ఇలా ఇప్పటివరకు దాదాపు 32వేల మంది రాగా, వారిలో 25 మందికి పాజిటివ్‌ వచ్చింది. చెక్‌పోస్టుల ద్వారా వస్తున్నవారిని గుర్తించి పరీక్షలు చేస్తున్నా.. ఇతరత్రా మార్గాల్లో వస్తున్నవారిని గుర్తించడం సాధ్యం కావడంలేదు. దీంతో ఎక్కడి నుంచి ఎవరు ఎలా రాష్ట్రంలోకి అడుగుపెడుతున్నారో తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వైరస్‌ మరింత వ్యాప్తి చెందే అవకాశముందని అంచనా వేస్తున్నారు.  

ప్రజలకు చేసిన సూచనలు
► సడలింపులివ్వడం, వలస కూలీలు, విదేశాల నుంచి పలువురు వస్తున్న నేపథ్యంలో కేసులు పెరుగుతాయి. కాబట్టి జనం ఈ విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్తలు తీసుకోవాలి.  
► అత్యవసరమైతేనే బయటకు రావాలి. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు ఇష్టారాజ్యంగా బయటకు రాకూడదు.  
► క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన వారు తప్ప, మిగిలినవారు కార్యాలయాలకు రాకుండా వర్క్‌ ఫ్రం హోంను పాటించాలి.  
► సడలింపును దుర్వినియోగం చేస్తే ఇంట్లో ఉన్న అందరికీ వైరస్‌ సోకే ప్రమాదముంది.  
► తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. మాస్క్‌లు ధరించాలి. తరచుగా సబ్బుతో చేతులను కడుక్కోవాలి.  
► యువకులు మాత్రమే ఉద్యోగ, వ్యాపారాల్లో బయటకు రావాలి. పెద్ద వయసు వారు, అనారోగ్యంతో ఉన్నవారు బయటకు రాకుండా చూడాలి.

మరిన్ని వార్తలు