గడువు గండం

1 Apr, 2018 08:33 IST|Sakshi
చిన్నంబావి మండలం దగడపల్లిలో శనివారం సాయంత్రం జరుగుతున్న సీసీ రోడ్డు పనులు

గ్రామాల్లో ఆగమేఘాల మీద సీసీరోడ్లు

నాణ్యత గాలికొదిలేసిన కాంట్రాక్టర్లు

జిల్లాలో రూ.60కోట్లతో 1,642 రోడ్లు

కేవలం 758 రోడ్లు మాత్రమే పూర్తి

నాణ్యత పరిశీలించాకే బిల్లులు: ఈఈ 

సాక్షి, వనపర్తి : గడువు గండం ఉండడంతో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో చేపట్టిన సీసీరోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.750కోట్లు కేటాయించి కేవలం స్వల్ప కాల వ్యవధిలోనే రోడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లాలో రూ.60కోట్ల వ్యయంతో 1,642 సీసీరోడ్ల పనులకు అనుమతిచ్చింది. మార్చి 31లోగా
పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో కాంట్రాక్టర్లు, నిర్మాణదారులు ఆగమేఘాల మీద పనులు చేపడుతున్నారు. వాగుల నుంచి తెచ్చిన ఇసుకకు బదులు మట్టి, రాతిపొడిని వాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వర్క్‌ ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణ లేకపోవడంతో పనుల్లో నాణ్యత పాటించడం లేదు. ఫలితంగా సుమారు 20ఏళ్ల పాటు మన్నిక ఉండాల్సిన సీసీరోడ్లు ఏడాది కూడా పటిష్టంగా ఉండే పరిస్థితి కనిపించడం లేదు.  

కేవలం 758 పనులు మాత్రమే పూర్తి  
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం శనివారం నాటికి సీసీరోడ్ల నిర్మాణానికి ఇచ్చిన గడువు ముగిసింది. జిల్లాలో ఇప్పటివరకు 758 రోడ్ల నిర్మాణ పనులు మాత్రమే పూర్తయ్యాయి. మంజూరైన 1642లో 884రోడ్లు ఇంకా నిర్మాణానికి నోచుకోలేదు. కేవలం రూ.24కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. ప్రభుత్వం నుంచి గడువు పెంచుతున్నట్లు ఉత్తర్వులు వెలువడితే తప్ప పనులు కొనసాగే అవకాశం లేదు. లేదంటే మంజూరైన నిధులు వెనక్కి వెళ్లిపోయే అవకాశం ఉంది. నిర్మాణ పనులకు సంబంధించి వారం పదిరోజుల్లో ఓ స్పష్టత వస్తుందని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.  

సర్పంచ్‌లు, స్థానిక నేతలే..  
గ్రామీణాభివృద్ధిశాఖ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఈ సిమెంట్, కాంక్రిట్‌ రోడ్ల నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను పంచాయతీరాజ్‌శాఖకు అప్పగించింది. రోడ్ల పనులను గ్రామాల్లో సర్పంచ్‌లు, స్థానిక నాయకులు కాంట్రాక్టర్లుగా పనులు చేపడుతున్నారు. పనులను హడావుడిగా చేపట్టడంతో నాణ్యత దెబ్బతిన్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.    

పరిశీలనలో కొన్ని.. 

  • చిన్నంబావి మండలం పెద్దమారులో రూ.90లక్షలతో చేపడుతున్న రోడ్డు శనివారం సాయంత్రం వరకు కూడా పూర్తికాలేదు. కాంట్రాక్టర్‌ గడువులోగా పూర్తిచేసేందుకు వేగంగా పనులు చేపడుతున్నాడు.  పనులు వేగవంతంగా పూర్తిచేయాలనే ఆతృతతో రేవల్లి మండలం చీర్కపల్లి శివారులో ఓ రైతు పొలం నుంచి తీసుకువెళ్లిన మట్టితో కూడిన ఇసుకను వాడుతున్నారు. 
  • వనపర్తి మండలం అప్పాయిపల్లిలో ఇసుకకు బదులుగా మట్టిని వాడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి.  
  •  వీపనగండ్ల మండలం వల్లాభాపురంలో నిబంధనల ప్రకారం వేయాల్సిన మందంలో రోడ్డు నిర్మాణం చేపట్టడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.    

గడువు ఇవ్వాలి 
మా గ్రామానికి రూ.1.40కోట్లు మంజూరయ్యాయి. దీనిలో రూ.40లక్షల వ్యయంతో నేను పని తీసుకున్నాను.  జిల్లావ్యాప్తంగా ఒకేసారి పనులు జరుగుతుండటంతో కూలీలు, మిషన్ల కొరతతో పనులు సగం కూడా పూర్తి కాలేదు. మరో వారం రోజలు అయినా పొడిగిస్తే పనులు పూర్తవుతాయి. లేదంటే నిధులు వెనక్కి వెళ్తాయి.  
– గోవింద శ్రీధర్‌రెడ్డి, పెద్దమారు   

నాణ్యతకే ప్రాధాన్యం 
ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడం ఆలస్యమైంది. వచ్చిన వెంటనే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాం. అయినప్పటికీ గడువు లేకపోవడంతో జిల్లాలో 50శాతం కూడా పూ ర్తికాలేదు. పనులు నెమ్మదించినా సరే నా ణ్యత విషయంలో తేడావస్తే బిల్లులు మం జూరుచేయబోం. ప్రభుత్వం గడువు పెంచుతుందా? లేదా? అనే విషయం త్వరలోనే తేలనుంది. 
– శివకుమార్, పీఆర్‌ ఈఈ, వనపర్తి జిల్లా
 

మరిన్ని వార్తలు