గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తారు, కానీ కేసీఆర్‌?

13 Nov, 2019 14:43 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపట్టి 40 రోజులు కావస్తున్నా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టైనా లేకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి, జ్ఞానం లేదని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు కుంటుపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నరే అపాయింట్‌మెంట్‌ ఇచ్చినపుడు సీఎం కేసీఆర్‌ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 40 రోజుల నుంచి జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వానికి కనీస ధ్యాస లేదన్నారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఒక పక్క ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచారు. ఆర్టీసీని ప్రభుత్వపరం చేస్తామని హామీ ఇచ్చారు.

మరి కేసీఆర్‌కు ఏమైంది? ఆయన మొండివైఖరే సమ్మెకు కారణం. ఇంత దీర్ఘకాలికంగా సమ్మె ఎప్పుడూ జరగలేదు. హైకోర్టు మందలించినా కేసీఆర్‌కు బుద్ధి రాలేదు. ముఖ్యమంత్రి కార్మికులను చర్చలకు పిలవాలి. త్వరలో అన్ని సంఘాల నాయకులు సమ్మెబాట పట్టే రోజులు వచ్చాయి. మరోవైపు భూ ప్రక్షాళన చేస్తా అన్నారు. కానీ ధరణి వెబ్‌సైటే పనిచేయడం లేదు. అన్నీ బోగస్‌ లెక్కలుగా తేలిపోయాయి. కేసీఆర్‌ పుణ్యమా అని రాష్ట్రం రూ.3,12,000 కోట్ల అప్పుల తెలంగాణ అయింది. త్వరలోనే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతా’ మని వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు