‘తమ్ముళ్ల’తో దోస్తీ కడదాం.. ‘కారు’కు బ్రేకులేద్దాం..

21 Jun, 2014 04:31 IST|Sakshi
‘తమ్ముళ్ల’తో దోస్తీ కడదాం.. ‘కారు’కు బ్రేకులేద్దాం..

*  మండల, జిల్లా పరిషత్‌లను దక్కించుకుందాం
స్థానిక సంస్థల్లో పాగాకు కాంగ్రెస్ తాజా వ్యూహం
మద్దతు కూడగట్టే బాధ్యత సబిత, చిన్నారెడ్డిలదే..
గెలుపు అవకాశాలను సమీక్షించిన టీపీసీసీ చీఫ్ పొన్నాల

 
సాక్షి,రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
చిరకాల ప్రత్యర్థి తెలుగుదేశంతో జతకట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అనూహ్యంగా ఎదిగిన టీఆర్‌ఎస్‌ను నిలువరించేందుకు రాజకీయ వైరాన్ని పక్కనపెట్టాలనే అభిప్రాయానికొచ్చింది. అత్యధిక స్థానిక సంస్థలను చేజిక్కించుకునేందుకు టీడీపీతో దోస్తీ కట్టడమే మేలనే నిర్ణయానికి వచ్చింది. శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ సమీక్షా సమావేశం జరిగింది.
 
ఈ సమావేశంలో స్థానిక సంస్థల  ఎన్నికల్లో గెలుపు అవకాశాలు, క్యాంపుల నిర్వహణ, ఇతర పార్టీల మద్దతు కూడగట్టే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లా పరిషత్‌లో స్పష్టమైన మెజార్టీ రాకపోయినప్పటికీ, అత్యధిక స్థానాలు గెలుచుకున్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ జెడ్పీని చేజార్చుకోకూడదని పొన్నాల స్పష్టం చేశారు. జెడ్పీలో 33 సీట్లకుగాను కాంగ్రెస్‌కు 14, టీఆర్‌ఎస్ 12, టీడీపీకి 7 జెడ్పీటీసీలు దక్కాయి. ఈ నేపథ్యంలో మేజిక్ నంబర్‌కు సరిపడా సభ్యులను సమకూర్చుకునేందుకు టీడీపీ మద్దతు కోరాలని ఆయన సూచించారు. కారు జోరుకు బ్రేకులు వేయాలంటే ‘దేశం’తో సర్దుబాటు చేసుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు.
 
12 చోట్ల గెలిచిన టీఆర్‌ఎస్.. కాంగ్రెస్, టీడీపీ సభ్యులకు వల వేయడం ద్వారా మేజిక్ సంఖ్య(17)ను చేరుకునే దిశగా పావులు కదుపుతోందని సమావేశంలో పాల్గొన్న నేతలు టీపీసీసీ అధ్యక్షుడి దృష్టికి తెచ్చారు. ‘టీఆర్‌ఎస్‌ను నియంత్రించేందుకు మనకు మద్దతిచ్చేందుకు టీడీపీ సంసిద్ధత తెలిపింది.  అయితే నేతల మధ్య కొరవడిన సమన్వయమే ఒకింత ఇబ్బందిగా మారింద’ని అన్నారు. విజయావకాశాలు మెండుగా ఉన్న జిల్లా పరిషత్ సహా మండల పరిషత్‌లను కై వసం చేసుకునేందుకు వ్యూహరచన చేయాలని, ఇతర పార్టీలు, సొంత పార్టీ నేతలను సమన్వయ పరిచే బాధ్యతను మాజీ మంత్రులు జి.చిన్నారెడ్డి, సబితా ఇంద్రారెడ్డికి అప్పగిస్తున్నట్లు పొన్నాల స్పష్టం చేశారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా టీడీపీతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అవలంబించాలని అన్నారు.
 
‘దేశం’ నేతలను కలుపుకొనిపోవడం ద్వారా టీఆర్‌ఎస్ ఎత్తులకు చెక్ పెట్టాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు యాదయ్య, రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు వెంకటస్వామి, పార్టీ నేతలు నాగయ్య, సుధీర్‌రెడ్డి, కోదండరెడ్డి, క్యామ మల్లేశ్, కూన  శ్రీశైలంగౌడ్, కార్తీక్‌రెడ్డి, ఉద్దెమర్రి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు