సర్పంచ్‌ల చేతికొచ్చిన ‘పవర్‌’ 

26 Jun, 2019 11:09 IST|Sakshi
దమ్మపేట గ్రామ పంచాయతీ కార్యాలయం

సమస్యల పరిష్కారానికి ఊతం 

దమ్మపేట: గ్రామపంచాయతీల్లో ఏడాదిన్నర కాలంగా ఖర్చు కాకుండా ఉన్న నిధులను వినియోగించుకునేందుకు అవకాశం ఏర్పండింది. ప్రభుత్వం వారం రోజుల క్రితమే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం అమలులోకి వచ్చింది. వివిధ పథకాల కింద పంచాయతీలకు మంజూరవుతున్న నిధులను సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వం నిబంధనలు సూచించింది. అందులో భాగంగా సర్పంచులకు నిధుల వ్యయం, పనుల నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. సర్పంచ్, ఉపసర్పంచులకు ఉమ్మడి చెక్‌పవర్‌ అమలులోకి తీసుకువచ్చారు. దీంతో గ్రామాల్లో ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభించింది. ఇప్పటికైనా సౌకర్యాల కల్పనకు ప్రజాప్రతినిధులు తగిన చొరవ చూపాల్సిన అవసరం ఉంది. 

పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.. 

ఆయా పంచాయతీల సర్పంచులు బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రామాల్లో అత్యవసరమైన సౌకర్యాల కల్పనకు ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో వ్యయం చేశారు. అనంతరం పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు నెలకొంటున్నా ఒక సొంతంగా నిధులను భరించలేమని చేతులెత్తేశారు. దీంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. పంచాయతీల్లో పారిశుద్ధ్య సిబ్బందికి నెలల తరబడి జీతాలు ఇవ్వని పరిస్థితి ఏర్పండింది. 

నిధుల వ్యయంపై దృష్టి.. 

గతంలో సర్పంచి, గ్రామ కార్యదర్శికి ఉమ్మడి చెక్‌పవర్‌ ఉండటంతో అవసరమైన నిధులు డ్రా చేయడం అంత సులువుగా జరిగేది కాదు. ప్రతి ఏటా నిర్వహించే ఆడిట్‌ సమయలో గ్రామ కార్యదర్శి బాధ్యత వహించాల్సి వస్తుందన్న కారణంతో సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకునే వారు. ఎంబీ రికార్డుల ఆధారంగా నిధులు డ్రా చేసేవారు. ప్రస్తుతం సర్పంచ్, ఉపసర్పంచులకు ఉమ్మడి చెక్‌పవర్‌ రావడంతో నిధుల వ్యయంపై కార్యదర్శులకు బాధ్యత తప్పింది. ఇదే సమయంలో ఇద్దరికి ఇవ్వడం వల్ల కూడా ఇష్టానుసారంగా నిధులను డ్రా చేసే పరిస్థితి ఉండదు. గ్రామసభల్లోనూ నిధుల అందుబాటు, వ్యయం వివరాలు చర్చకు వస్తుండటంతో పారదర్శకతకు అవకాశం ఉంటుంది. 

ప్రజల భాగస్వామ్యం.. 

కొత్త చట్టంలో గ్రామసభలకు హాజరయ్యే ప్రజల సంఖ్యపై కచ్చితమైన నిబంధనలను ప్రభుత్వం పేర్కొంది. దీంతో గ్రామపంచాయతీలో ఏం జరుగుతోంది? పాలన ఎలా ఉంది? నిధుల వ్యయం పరిశీలన, ఎలాంటి పనులను చేపడతారు? అనే విషయాలు అందరికీ తెలిసే పరిస్థితి ఏర్పడుతుంది. గ్రామ జనాభా ఆధారంగా గ్రామసభకు ఎంత మంది హాజరు అవ్వాల్సి ఉందన్న దానిపై స్పష్టత ఇచ్చింది. గ్రామంలో 500 మంది జనాభా ఉంటే 50 మంది, వెయ్యి మంది ఉంటే 75 మంది, 3 వేలు మంది ఉంటే 150, 5 వేలు ఉంటే 200, 10 వేల జనాభా ఉంటే 300 మంది హాజరు కావాలి. ఇలా కాకుండా హాజరైన సంఖ్య తగ్గితే కోరం లేనట్లుగానే పరిగణిస్తారు. ఈ నిబంధనలతో పంచాయతీ పాలక వర్గాలు బాధ్యతగా నడుచుకునేందుకు మార్గం ఏర్పడుతుంది. 

హాజరు అంతంత మాత్రమే.. 

ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు పరిశీలిస్తే ప్రజలు ఎక్కడా ఆశించిన స్థాయిలో హాజరైన సందర్భాలు లేవు. గ్రామసభలు నిర్వహించే సమయాన్ని కూడా పంచాయతీలు కొన్ని సందర్భాల్లో ప్రజలకు తెలపని సంఘటనలున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. మరో వైపు కోరం నిబంధనతో సమస్యల పరిష్కారం త్వరితగతిన జరుగుతుందని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు