బుడ్డోడికి జ్వరమొచ్చింది

27 Feb, 2018 12:47 IST|Sakshi
కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జ్వరంతో బాధపడుతున్న పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు

హెల్తీసీజన్‌లో విచిత్ర పరిస్థితి

నెల రోజులుగా ప్రబలుతున్న వైరల్‌ ఫీవర్స్‌

జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పితో

బాధపడుతున్న పిల్లలు

25 వేలకుపైగా బాధితులు

సాక్షి, కామారెడ్డి:సాధారణంగా ఫిబ్రవరి మాసాన్ని ‘హెల్తీ సీజన్‌’గా పేర్కొంటుంటారు. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.నెల రోజులుగా జిల్లాలో వైరల్‌ ఫీవర్స్‌తో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. జలుబు, దగ్గుతో చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. జలుబు, జ్వరం, దగ్గుతో గొంతునొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దగ్గడం వల్ల బాడీపెయిన్స్‌ పెరుగుతున్నాయి. దీంతో వారు మరింత నీరసించిపోతున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు న్యుమోనియా బారిన పడుతున్నారు. దీంతో పిల్లలకు మెరుగైన వైద్యం అందించడం కోసం హైదరాబాద్‌కు రెఫర్‌ చేస్తున్నారు. వాతావరణంలో ఏర్పడిన మార్పులకు తోడు నీటికాలుష్యం, చల్లగాలి, దుమ్ము, ధూళి, పొగ, చల్లని పదార్థాలు తీసుకోవడం, ప్రయాణాలు వంటి సమస్యలతో పిల్లలు చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. 

వ్యాధుల బారిన వేలాది మంది..
చిన్న పిల్లల్లో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏడాది నుంచి నాలుగేళ్లలోపు పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. జిల్లాలో 30కి పైగా చిన్న పిల్లల ఆస్పత్రులు ఉన్నాయి. ఏ ఆస్పత్రికి వెళ్లినా నిరంతరం పదుల సంఖ్యలో పేషెంట్లు కనిపిస్తున్నారు. ఆస్పత్రుల్లోని బెడ్‌లన్నీ పిల్లలతో నిండిపోతున్నాయి. చిన్నచిన్న ఆస్పత్రులకు సైతం నిత్యం 20 నుంచి 30 మంది పిల్లలు వైద్యం కోసం వస్తున్నారు. చిల్డ్రన్స్‌ స్పెషలిస్టులు ఉన్న కొన్ని ఆస్పత్రులకు రోజు కనీసం 50 మందికి తగ్గకుండా వస్తున్నారు. పేరున్న ఆస్పత్రులకు రోజూ వంద మందికిపైగానే పిల్లల్ని తీసుకువస్తున్నారు. వైద్యులు క్షణం తీరికలేకుండా చూసినా ఓపీ తగ్గడం లేదు. నెల రోజులలో జిల్లా వ్యాప్తంగా 25 వేల మందికిపైగా చిన్నారులు ఆస్పత్రుల్లో చేరినట్టు అంచనా..

హెల్తీసీజన్‌లో విచిత్ర పరిస్థితి...
ఫిబ్రవరి మాసంలో వాతావరణంలో పెద్దగా మార్పులు ఉండకపోవడంతో ఈ సమయాన్ని హెల్తీసీజన్‌గా పేర్కొంటారు. అలాంటిది ఈసారి మాత్రం వాతావరణంలో వచ్చిన అనేక మార్పులతో వ్యాధుల తీవ్రత పెరిగింది. ముఖ్యంగా చిన్నారులు ఈ మార్పును తట్టుకోలేక అనారోగ్యానికి గురవుతున్నారు. సకాలంలో వైద్యం అందని పక్షంలో న్యుమోనియా బారిన పడుతున్నారు. రక్తహీనతకు తోడు అనారోగ్యానికి గురికావడం వల్ల ప్లేట్‌లెట్స్‌ పడిపోయి తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు.  

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..  
కాచి చల్లార్చిన నీటిని తాగించాలి.  
ఇంటా, బయట దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవాలి.  
పడుకునే బట్టలను శుభ్రంగా ఉంచాలి.  
జలుబు చేస్తే ఆవిరి పట్టాలి.  
పౌష్టికాహారం ఇవ్వాలి. ద్రవాహారం ఎక్కువగా ఇస్తుండాలి. పిల్లలకు రెగ్యులర్‌గా ఫ్రూట్స్, మిల్క్, ఎగ్‌ వంటివి ఇవ్వాలి.  
ప్రయాణాలు చేయకపోవడం మంచిది.  
ఐస్‌క్రీమ్‌లు, కూల్‌డ్రింక్స్‌ ఇవ్వవద్దు.

వాతావరణంలో మార్పులతో..
ఈసారి వైరల్‌ ఫీవర్స్‌ ఎక్కువగా ఉన్నాయి. నెలరోజులుగా పిల్లలు జ్వరాలబారిన పడుతు న్నారు. సాధారణంగా ఈ సీజన్‌లో ఇలాంటి సమస్యలు రావు. కానీ వాతావరణంలో మార్పులు, శుభ్రమైన నీరు తీసుకోకపోవడం, చల్లని పదార్థాలు తీసుకోవడం, దుమ్ముధూళిలో తిరగడంతో సమస్యలు వస్తున్నాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు మరింత నీరసించిపోయి న్యుమోనియా బారిన పడుతున్నారు. తగిన జాగ్రత్తలతో వ్యాధులను నివారించవచ్చు. పిల్లలకు కాచి చల్లార్చిన నీటినే తాగించాలి. పరిశుభ్ర వాతావరణం ఉండేలా చూసుకోవాలి. పౌష్టికాహారం అందించాలి.
– రాజేశ్వర్, చిన్నపిల్లల వైద్య నిపుణులు, కామారెడ్డి

మరిన్ని వార్తలు